
యువశక్తితోనే భారత్ అభివృద్ధి
చైనా, జపాన్‌లాంటి దేశాల్లో వయసు మళ్లిన వారి సంఖ్య పెరుగుతుంటే..
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: చైనా, జపాన్‌లాంటి దేశాల్లో వయసు మళ్లిన వారి సంఖ్య పెరుగుతుంటే.. యువతతో ఉరకలెత్తుతున్న భారత్ అనతికాలంలోనే అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువశక్తిని సరిగ్గా వినియోగించుకోవడంతోపాటు వారికి విద్య, శిక్షణ, పోషకాహారం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పట్టణ ప్రాంత యువతకే కాకుండా గ్రామీణ యువతకు సమాన అవకాశాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాంగ శాఖ, ఐఎస్‌బీ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ‘ఎకానమిక్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పాలసీ ఇండియా వర్సెస్ గ్లోబల్ ఎకానమీ చాలెంజెస్ డెవలప్‌మెంట్’ అన్న అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు.
‘‘వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న మనదేశంలో సేవారంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ అనేక అంశాల్లో ఎంతో ముందుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుదుత్పత్తి తదితర అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. టాస్క్ పథకంతో నైపుణ్య శిక్షణ, టీ-హబ్‌తో నవకల్పన, టీ-వర్త్‌తో తయారీ రంగంలో రాష్ట్రం పురోగతి దిశగా అడుగులేస్తోంది’’ అని చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంలో అనుమతులిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాయబారులు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.