యాసంగిలో 19 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం
⇒ అద్భుతమైన ఫలితాలు వస్తాయి: హరీశ్‌రావు
⇒ పూడిక మట్టితో ఖరీఫ్ పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది
⇒ మిషన్ కాకతీయ, సాగునీటి పనులపై అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత యాసంగిలో దాదాపు 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి నట్టు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. మిషన్ కాకతీయలో తీసిన పూడిక మట్టితో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఐదేళ్లలో రాని రీతిలో గణనీయంగా పంటల దిగుబడి వచ్చిందని, ఈ యాసంగిలోను అద్భుతమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. శుక్ర వారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మొదటి, రెండో విడత మిషన్ కాకతీయతోపాటు మూడో విడత కింద చేపట్టనున్న పనులను సమీక్షించారు.
దీంతో పాటు భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. మూడో విడత మిషన్ కాకతీయలో మంజూరైన చెరువుల మట్టిని సాయిల్ టెస్టు చేయించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా ఉత్సవాలు జరిపి మూడో విడత పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఏడాది కుమ్రం భీం ప్రాజెక్టును పూర్తి చేసి 45 వేల ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరందించనున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ–2 ను ఈ ఏడాది ఖరీఫ్ కల్లా పూర్తి చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. దీంతో సూర్యాపేట జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ ఇతర మధ్య తరహా ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టును పూడ్చాల్సి ఉందన్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా సాగునీటి వనరుల కింద వాస్తవ ఆయకట్టు నిర్ధారించాలని, ఇందుకు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్యాప్ ఆయకట్టును పూడ్చేందుకు ‘ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, సాగునీటి నిర్వహణ’ (క్యాడ్ వామ్) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకోవాలని పేర్కొన్నారు.
7న ఢిల్లీలో సమావేశం..
గ్యాప్ ఆయకట్టుపై ఏప్రిల్ 7న కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు హరీశ్ చెప్పారు. ఇరిగేషన్ అధికారులు క్యాడ్‌వామ్ కింద ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం క్యాడ్‌వామ్‌ను అమలు చేయనుందని తెలిపారు. మిషన్ కాకతీయ–2 పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. మత్తడివాగు, సాత్నాల వంటి ప్రాజెక్టుల పనుల పురోగతిని స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను కోరారు. శనిగరం చెరువు ఆధునీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని సిద్దిపేట జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.