బ్రిక్స్ సదస్సులో ‘తెలంగానం’
రాయికల్ : జైపూర్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరించారు. ఆదివారం ముగింపు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు, సభ్యదేశాలు తీసుకోవాల్సిన చర్యల గురించి జరిగిన చర్చాగోష్టిలో కవిత హరితహారం కార్యక్రమం గురించి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాడటం లక్ష్యంగా హరితహారం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1300 కోట్లు వెచ్చించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22 శాతంగా ఉన్న అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణ గురించి సదస్సులో తెలిపారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు.