సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయ కింద 5,703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనులకు గాను ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని.. జనవరి నుంచి పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగో విడత పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని హరీశ్ ఆదేశించారు.
పాలనా అనుమతులు లభించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలన్నారు. మిషన్ కాకతీయ నాలుగోదశ టైం లైన్లను విధిగా పాటించాలని స్పష్టంచేశారు. ఈ నెల 15కల్లా పాలనాపరమైన అనుమతి కోసం అంచనాలు పంపి.. నెలాఖరు వరకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ రెండు, మూడు దశలలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని హెచ్చరించారు. పునరుద్ధరించే చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలన్నారు.
పూడికతీత మట్టిపై అవగాహన కల్పించాలి
గతంలో రాష్ట్రంలో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందని హరీశ్ అన్నారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీల ఎదుట పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలని కోరారు. వ్యవసాయ, ఇరిగేషన్‌శాఖల కింది స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ కాకతీయ నాలుగోదశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను సహకారం తీసుకోవాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ కింద 147 చెరువుల పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం రూ.162 కోట్లు మంజూరు చేసిందని.. ఈ పనులను సైతం వెంటనే ప్రారంభించాలని హరీశ్ ఆదేశించారు.
దేశానికే ఆదర్శంగా పంచాయతీరాజ్ చట్టం-మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఉం డాలని, ఆ దిశగా పకడ్బందీగా చట్టానికి రూపకల్పన జరపాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు తుది దశకు చేరిన సందర్భంగా మంగళ వారం జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చట్టంలో పొందుపర్చేందుకు సిద్ధం చేసిన పలు అంశాలపై కూలంకశంగా చర్చించి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా, తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా చట్టం ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment