పనిచేయకపోతే వెళ్లిపోండి
చిన్ననీటి పారుదల శాఖ అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఎన్నిసార్లు చెప్పినా వినరా.. పనిచేయకపోతే వెళ్లిపోండి అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చిన్ననీటి పారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మెదక్‌జిల్లా నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయం నుంచి మంత్రి అన్ని జిల్లాల చిన్ననీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. మిషన్‌కాకతీయ రెండోవిడత కింద ఇప్పటివరకు 1504 చెరువులు మంజూరు కాగా అందులో 750 చెరువులకు టెండర్లు నిర్వహించినట్లు తెలిపా రు. 307 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తి చేసి 152 చెరువు పనులు ప్రారంభించినట్లు ఎస్‌ఈ సదాశివ మంత్రికి చెప్పా రు.
మంత్రి స్పందిస్తూ పురోగతి 50శాతం కన్నా తక్కువగా ఉందని, రాష్ట్రంలో పాలమూరు జిల్లా మిషన్‌కాకతీయ పురోగతిలో వెనుకబడి ఉందని అన్నారు. ట్రిపుల్ ఆర్, నాబార్డు, ప్రపంచ బ్యాంకు నిధులతో చేసే పనుల్లోనూ వెనుకబడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈనెల 23లోపు టెండర్లు పిలవాలి
ఈనెల 23లోపు రెండోవిడత పనులన్నింటికీ టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తి చేయాలని, పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే మొదటి విడత పనులను ఈ నెలాకరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈ సదాశివ పనితీరు బాగోలేదని, జిల్లాలోని నాలుగు డివిజన్లలో పనులు పురోగతి సాధించే విధంగా ఒక్కో డివిజన్‌లో రెండు రోజులపాటు స్థానికంగా ఉండి పర్యవేక్షించాలని చీఫ్ ఇంజనీర్ లింగరాజును ఆదేశించారు. ఇంజనీర్ల పనితీరులో మార్పు రాకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట డివిజన్‌లలో రెండురోజుల్లో పనులన్నింటికీ టెండ ర్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అగ్రిమెంట్లు పూర్తి చేయడంలో ఎందుకు ఆలస్యమవుతోందని మహబూబ్‌నగర్ ఈఈ నర్సింగ్‌రావును ప్రశ్నించారు. రెండుమూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఈఈ చెప్పారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులు పాలమూరు జిల్లాలోనే ఎక్కువగా ఉ న్నాయని, త్వరి తగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ట్రిపుల్ ఆర్, నాబార్డు పనులలో డ బ్బులు ఖర్చు కావడం లేదన్నారు. నాబార్డు, ప్రపంచబ్యాం కు నిధుల ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరుతుంద ని, ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్తాయాన్నరు.
చెరువుల అభివృద్ధికి నీతిఅయోగ్ నిధులు
రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో చెరువుల అభివృద్ధి కోసం నీతిఅయోగ్ పథకం కింద రూ.450కోట్లు మంజూరు చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. కేంద్రం నిధులు, రాష్ట్ర వాటాతో కలిపి రూ.900 కోట్లతో చెరువులను అభివృద్ధి చేసుకోవచ్చని, అందుకోసం 15రోజుల్లో ప్ర తిపాదనలు పంపాలని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి అన్నారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పురోగతి, ఫిర్యాదుల కోసం కాల్‌సెంటర్ నెం.040-23472233ను ప్రా రంభించిందని తెలిపారు.
వారానికోసారి కాల్‌సెంటర్ ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కాల్‌సెంటర్ మాదిరిగా ఈ మెయిల్ ఐడీని కూడా ఇవ్వాలని ఆదేశించారు. చిన్ననీటి పారుదల శాఖ ఎస్‌ఈ బి.సదాశివ, డిప్యూటీ ఎస్‌ఈ ఆనంద్‌సాగర్, ఈఈలు నర్సింగ్‌రావు, గోవిందప్ప, డిప్యూ టీ ఈఈ అశోక్‌కుమార్‌లు కాన్ఫరెన్సుకు హాజరయ్యారు.