‘మిషన్ కాకతీయ’ పనులు పరిశీలించిన ప్రత్యేక బృందాలు
పలు అక్రమాలను గుర్తించిన వైనం..
అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధం
నర్సంపేట :
టెండర్లు వేసింది ఒకరు... పనులు చేసింది మరొకరు... ఇంకేం నాణ్యత పడకేసింది... ఇక్కడ పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సమస్య తీవ్రతకు కారణమైంది.. ఈ ఉపోద్ఘాతమంతా ఇదంతా మిషన్ కాకతీయ పథకంలో బయటపడుతున్న లోపాలు, చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించినది.
అయితే, ఎలాగోలా పనులు చేశాం.. బిల్లులు తీసేసుకున్నాం.. అని చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు, మన వాటా ముట్టింది కదా అని అధికారులు నిశ్చింతగా ఉన్న తరుణంలో.. వారి గుండెల్లో గుబులు పుట్టించే సంగతి తెలిసింది. పలు చెరువుల పనుల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందగా.. టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా పనుల్లో లోపాలు ఉన్నాయని తేల్చిన వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తరుణంలో అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
27 చెరువులపై ఫిర్యాదు
అవిభాజ్య వరంగల్ జిల్లాలో 1,059 చెరువులను మిషన్ కాకతీయ మొదటి దశలో అభివృద్ధి చేయగా రూ.190 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇందులో 27 చెరువుల పనులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు తెలుసుకున్న రాష్ట్ర ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించారు. ఫిర్యాదులు అందిన చెరువుల్లో పరకాల నియోజకవర్గంలో అత్యధికంగా 14 ఉండగా, నర్సంపేట నియోజకవర్గంలో ఐదు, ములుగు నియోజకవర్గంలో ఐదు, వర్థన్నపేట నియోజకవర్గంలో రెండు, హసన్పర్తిలో ఒక చెరువు ఉంది.
దీంతో ఆయా చెరువులను క్వాలిటీ కంట్రోల్ బృందాలు(టాస్క్‌ఫోర్స్) తనిఖీ చేయగా.. అక్రమాలు నిజమేనని తేలడంతో ప్రభుత్వానికి నివేదికలు అందించారు. పలితంగా అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, చూసీచూడనట్లుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలు విభజించక ముందు ములుగు నియోజకవర్గంలో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం మరికొందరిపై వేటు వేయనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో ఆందోళన మొదలైనట్లు సమాచారం.
ఇవీ అక్రమాలు..
మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు మరమ్మతుల పనుల్లో అనేక లోపాలను టాస్క్‌ఫోర్స్‌తో పాటు ప్రత్యేక బృందం అధికారులు గుర్తించారు. 90 శాతం చెరువులకు టెండర్లు వేసిన లైసెన్స్డ్ కాంట్రాక్టర్లు.. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులకు పనులు అప్పగించడంతోనే అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం.
పనుల్లో భాగంగా చెరువుల్లోని ఒండ్రు మట్టిని తొలగించడంతో పాటు కట్టకు బలాన్నిచ్చే మొరం మట్టి వేసి రోలింగ్ చేయాల్సి ఉండగా దీనికి తిలోదకాలిచ్చారు. ఇక కొందరు రాజుల కాలం నాటి తూములు, అలుగులను పెకిలించి వాటికి ఉపయోగించిన రాళ్లను అమ్ముకోవడంతో పాటు పునర్నిర్మాణంలో నాణ్యత పాటించలేదని చెబుతున్నారు. అలాగే, పంట కాల్వలు నామమాత్రంగా నిర్మించడంతో పాటు కాల్వల జోలికి వెళ్లలేదని సమాచారం. అయితే, ఇంత జరుగుతున్నా ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పనుల్లో నాణ్యత లోపించడానికి ప్రధాన కారణంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది.