నాణ్యత లోపం
మిషన్ కాకతీయలో నాసిరకం పనులు
నాణ్యతకు తిలోదకాలిచ్చిన కాంట్రాక్టర్లు
చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్న కట్టలు
పలు చెరువులకు గండ్లు బిల్లులు మాత్రం వేగంగా చెల్లింపు
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ సర్కారు గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు జలకళను సంతరింపజేయడం కోసం చేపట్టిన పథకం పనులు నాసిరకంగా ఉంటున్నాయి. మొదటి, రెండో విడతల్లో చేపట్టిన చెరువు కట్టలు చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రెండో దశ పనులు మార్చి 31, 2017 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో మిషన్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిమెంట్ కాంక్రీట్ పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో పనులు నాసిరకంగా తయారయ్యాయి. చాలా చోట్ల రివిట్‌మెంట్ పనులు జరగక సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కట్టలపై పగుళ్లు ఏర్పడ్డాయి. నూతన తూముల నుంచి లీకేజీలు ఏర్పడ్డాయి. నీటి పారుదల శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో పనులు నాసిరకంగా సాగుతున్నాయి.
చెరువుల పనుల తీరు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 3,251 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో మొదటి విడత కింద 671 చెరువులు ఎంపిక చేయగా.. 657 చెరువుల్లో మాత్రమే అగ్రిమెంట్ జరిపి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 649 చెరువులు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది చెరువుల పనులు పూర్తికాలేదు. 657 చెరువులకు రూ.233.64 కోట్లు మంజూరు కాగా.. పనులు పూర్తయిన 649 చెరువులకు రూ.1.50 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా బిల్లులు పనుల పరిశీలన తర్వాత చెల్లించనున్నారు. ఇక రెండో విడతలో 646 చెరువులు ఎంపిక చేశారు. వీటి మరమ్మతుకు రూ.227.59 కోట్లు మంజూరయ్యాయి. పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
నాసిరకం పనులు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మూడు డివిజన్ల పరిధిలోని మిషన్ కాకతీయ మొదటి, రెండో విడతల్లో చేపట్టిన చెరువు పనులు నాసిరకంగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు దాదాపుగా పది చెరువులకు గండ్లు పడ్డాయి. రెండు చెరువుల కట్టలు పూర్తిగా తెగాయి. కట్టల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో రెండు విడతల్లో చేపట్టిన 70 శాతం చెరువు కట్టలకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల చెరువు మట్టిని కట్టబలోపేతం కోసం వాడారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉపాధిహామీ పథకం కింద ఉపాధి కూలీలు తీసిన మట్టిగుంతలను అధికారులకు చూపి పూడికతీత పేరిట బిల్లులు లేపారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అలాగే తూముల నిర్మాణం చేపట్టిన చాలా చెరువుల్లో షట్టర్లు బిగించక వర్షాకాలంలో నీరు వృథాగా పోయింది. షట్టర్లు బిగించిన చోట నీరు ఇప్పటికీ లీకేజీ అవుతోంది. మొరం తవ్వకాలతో చాలా చెరువుల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలకు ప్రాణసంకటంగా మా రింది. అలాగే చాలా చెరువుల్లో హద్దులు నిర్ణయించి క బ్జాలు బయటకు తీయకపోవడం వల్ల ఉమ్మడి జిల్లాల్లో 1,500 ఎకరాల శిఖం భూమి పరుల అధీనంలో ఉంది. రివిట్‌మెంట్‌మెంట్ పనులు ఈ చెరువుల్లో ఇప్పటివరకు ప్రారంభించకపోవడంలో కట్టలు పగుళ్లు పడ్డాయి.
నాసిరకం పనులకు నిదర్శనం..
జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాకలోని మిషన్ కాకతీయ రెండో విడతలో కేటాయించిన దాదాలాయికుంట పనులు సగం పూర్తయిన తరువాత సెప్టెంబర్ కురిసిన భారీ వర్షానికి గండి పడి వరద నీరంతా వెళ్లిపోయింది.మిషన్ కాకతీయ పనుల్లో డొల్లతనం వల్ల పిట్లం మండలం రాంపూర్ రామసముద్రానికి గండిపడింది.కామారెడ్డి డివిజన్‌లో పెద్ద చెరువుగా పేరున్న బీబీపేట చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపం వల్ల తూముల నుంచి నీరు లీకేజీ అవుతోంది. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్ మండలం తడపకాల్ చెరువు కోతకు గురైంది. బాన్సువాడ మండలం హన్మాజీపేట పాత చెరువుకు మిషన్ కాకతీయ కింద రూ.36 లక్షలతో పనులు చేసిన కట్టబలోపేతంలో నాణ్యత లేకపోవడం వల్ల కోతకు గురైనది.భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలోని దొడ్డి చెరువు తూముకు గండిపడింది.