‘మిషన్ కాకతీయ’ను సవాల్‌గా స్వీకరిద్దాం | 'Mission kakatiyanu accept the challenge | Sakshi
Sakshi News home page

‘మిషన్ కాకతీయ’ను సవాల్‌గా స్వీకరిద్దాం

Published Sat, Dec 13 2014 12:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

‘మిషన్ కాకతీయ’ను సవాల్‌గా స్వీకరిద్దాం - Sakshi

‘మిషన్ కాకతీయ’ను సవాల్‌గా స్వీకరిద్దాం

  • దేశానికే ఆదర్శంగా పునరుద్ధరణ చేపడదాం: మంత్రి హరీశ్
  • రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సూచన
  • మండలానికో చెరువుకు తట్ట మోసేందుకు సిద్ధమని ప్రకటన
  • పనుల్లో నాణ్యత, పారదర్శకత విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరిక
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయను సవాల్‌గా స్వీకరిద్దామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. చెరువుల పునరుద్ధరణను విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని హితవు పలికారు. శుక్రవారం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదలశాఖ ఇంజనీర్లకు లాప్‌ట్యాప్‌లు, సర్వే పరికరాలు అందించే కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రూ.10కోట్ల విలువైన పరికరాలను వారికి అందించారు.

    ఈ సందర్భంగా మిషన్ కాకతీయ లక్ష్యాలు, ప్రభుత్వ విధానాల గురించి వారికి సూచనలు చేశారు. ‘ఇంజనీర్లకు పని నేర్చుకోవడానికి ఇదో అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని పునరుద్ధరణను సవాల్‌గా స్వీకరించండి. చెరువుల ఎంపిక, పనుల నాణ్యత, అంచనాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించండి. సొంతింటి ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా వ్యవహరించండి.

    ఉద్యోగుల పట్ల ఎంత ప్రేమగా ఉంటామో నాణ్యత విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తాం. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేయండి. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టండి. అమెరికాలో ఉన్నవారు సైతం తమ గ్రామం పనులను తెలసుకునేలా ఈ వివరాలుండాలి. వాటిపై మా కార్యాలయం నుంచి ఫోన్‌లు వచ్చేంత వరకు ఆలస్యం చేయొద్దు. పనుల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకుండా చూస్తాం’ అని పేర్కొన్నారు.

    పనుల నాణ్యతపై రాష్ట్ర కార్యాలయంలోని అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, పనుల్లో లోపాలుంటే ఇంజనీర్లదే బాధ్యత అని అన్నారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని, దీన్నొక ప్రజా ఉద్యమంగా మలచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. బుందేల్‌ఖంఢ్‌లో ప్రారంభిస్తామన్నారు...
     
    మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వచ్చేందుకు అంగీకరించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో సైతం ప్రారంభిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలిసిన సందర్భంలో ఉమాభారతి తెలిపారని ఆయన వెల్లడించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement