ఆ కాంట్రాక్టర్లను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి విడతలో మంజూరైన పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను తొలగించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకం తొలి, రెండో దశ పనులపై గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
మిషన్ కాకతీయలో భాగంగా తొలి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రెండో దశలో అనుమతి లభించిన పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల అంచనాల తయారీలో ఆయకట్టు పరిధిలోని రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్ పథకం, ప్రపంచ బ్యాంకు, నాబార్డు, జైకా ఆర్థిక సాయంతో చేపట్టిన పనుల పురోగతిపైనా మంత్రి సమీక్ష జరిపారు.
నిజామాబాద్ జిల్లా గట్టుపొడిచిన వాగు పనుల పురోగతిపై ఆరా తీశారు. మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనుల చెల్లింపుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఈలు విజయ్‌ప్రకాశ్, నాగేందర్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సలహాదారుతో భేటీ
సాగునీటి రంగ కేంద్ర ప్రభుత్వ సలహాదారు, కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాతో మంత్రి హరీశ్ గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాధించిన ఫలితాలను ఆయనకు వివరిం చారు. రాష్ట్రంలోని కొత్త, పాత సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.