Minister t.harishrao
-
6న ఢిల్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో ఈ నెల 6న ఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యు డు, రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావును కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆహ్వానిం చారు. ఈ మేరకు గురువారం హరీశ్‌రావుకు లేఖ పంపారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. భూసేకరణను వేగవంతం చేయండి... పీఎంకేఎస్‌వై పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై సాగునీటిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీతో కలసి హరీశ్‌రావు సమీక్షించా రు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు కోసం 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇంతవర కు 10,428 హెక్టార్లు సేకరించారని, మిగతా భూమిని త్వరితగతిన సేకరించాలని సూచించారు. దీంతోపాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురం భీం ప్రాజెక్టు పరిధిలో మిగిలిన భూసేకరణను వేగిరం చేయాలని ఆదేశించారు. -
ఆ కాంట్రాక్టర్లను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి విడతలో మంజూరైన పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను తొలగించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకం తొలి, రెండో దశ పనులపై గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయలో భాగంగా తొలి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రెండో దశలో అనుమతి లభించిన పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల అంచనాల తయారీలో ఆయకట్టు పరిధిలోని రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్ పథకం, ప్రపంచ బ్యాంకు, నాబార్డు, జైకా ఆర్థిక సాయంతో చేపట్టిన పనుల పురోగతిపైనా మంత్రి సమీక్ష జరిపారు. నిజామాబాద్ జిల్లా గట్టుపొడిచిన వాగు పనుల పురోగతిపై ఆరా తీశారు. మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనుల చెల్లింపుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, సీఈలు విజయ్‌ప్రకాశ్, నాగేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సలహాదారుతో భేటీ సాగునీటి రంగ కేంద్ర ప్రభుత్వ సలహాదారు, కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాతో మంత్రి హరీశ్ గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాధించిన ఫలితాలను ఆయనకు వివరిం చారు. రాష్ట్రంలోని కొత్త, పాత సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. -
మింగిన నిధులను కక్కిస్తాం
చిట్టా బయట పెడతాం: హరీశ్‌రావు కల్హేర్: గతంలో చెరువుల నిధులు స్వాహా చేసిన వారి చిట్టా తమ వద్ద ఉందని, లెక్కలతో సహా కక్కిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఫత్తెపూర్ శివారులో గురువారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.పనులు చేయకుండా నిధులు ఎంతమేర మింగింది చెబుతామని, వారి చరిత్ర త్వరలో బయటపెడ్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అవినీతి రహితం గా, పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నేతలు శివరాజు పాటిల్‌ను బక్రా చేయాలని చూశారని, ఆయన తెలివితో వ్యవహరించి కాంగ్రెస్ నేతలనే బక్రా చేశారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. అంతకు ముందు మంత్రి ఫత్తెపూర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. టీడీపీకి ఓట్లేస్తే మురికి కాల్వలో వేసినట్లే నారాయణఖేడ్: టీడీపీకి ఓట్లేస్తే మురికి కాల్వ లో వేసినట్లేనని మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో గురువా రం ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చం ద్రబాబు విజయవాడకు వెళ్లిపోయారని, ఇక ఆ పార్టీకి ఓట్లువేయడం అవసరమా అని ప్రశ్నిం చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీలో ఉండలేక టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. -
జనవరి నుంచి కొత్త ప్రాజెక్టుల పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించేలా అధికారులు సిద్ధం కావాలని మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ, భూసేకరణ, సహాయ పునరావాసం వంటి వాటినన్నింటినీ పూర్తిచేసి జనవరిలో పనులు ప్రారంభించాలని సూచించారు. గురువారం సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) కార్యాలయంలో ప్రాజెక్టుల వారీగా అధికారులతో మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రాణహితలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణంపై స్పష్టత రావడంతో అక్కడ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి కోసం ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు భూసేకరణ సర్వేలో రెవెన్యూశాఖ సహకరించడం లేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. వెంటనే రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషికి హరీశ్‌రావు సూచించారు. ఫిబ్రవరి రెండో వారానికి పాలమూరు టెండర్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటే మారిన ప్రణాళికకు అనుగుణంగా డిండి ఎత్తిపోతల సర్వే, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్ అంచనాలకు అనుగుణంగా డీపీఆర్ సైతం త్వరగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దుమ్ముగూడెంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2016 జూన్(ఖరీఫ్) నాటికి పూర్తిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని, అవి పూర్తయితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుం దని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 13 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టుల పురోగతి, వాటిల్లో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలు తదితరాలపై మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మారథాన్‌లా సమీక్ష జరిగింది. 146, 123 జీవోలను వాడుకుంటూ ముందుకు... కాంట్రాక్టర్లకు అదనపు ధరల చెల్లింపులకు సంబంధించిన జీవో 146, భూసేకరణ జీవో 123లను ఉపయోగించుకోవాలని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 146 జీవో విడుదలైన నేపథ్యంలో కాంట్రాక్టు ఏజెన్సీలతో మాట్లాడి పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను 146 జీవోను ఉపయోగించుకొని పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1,400 ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 300 ఎకరాలను నవంబర్ 15 నాటికి సేకరించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, రాళ్లవాగు, వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, పెండ్లిపాకాల, ఉదయసముద్రం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల కింద సైతం భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. -
రైతుల పేరుతో రాజకీయాలా?
సంగారెడ్డి మున్సిపాలిటీ: రైతుల పేరుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్‌కు రైతులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో వీరు ఒక్కరోజైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమన్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేవని, మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అప్పట్లో కోరినా పట్టించుకోని కాంగ్రెస్.. ఈ రోజు టీఆర్ఎస్ను విమర్శించడం అవివేకమన్నారు. రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలకు అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాహుల్ స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ ఘనత మాదే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రూ.400 కోట్లతో మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని గత పదేళ్లలో ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. వడగళ్ల వానతో గతంలో వరుసగా నాలుగేళ్లు రైతులు నష్టపోతే రూ.480 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా, అందులో పైసా కూడా ఇవ్వలేదన్నారు. తాము రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని అందించామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను విమర్శిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు ఆంధ్రాలో రుణమాఫీ చేయని టీడీపీ సర్కార్‌పై ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు! కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 25 లక్షల మందికి పింఛన్లు ఇస్తే తాము 36 లక్ష ల మందికి ఇస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా తెలంగాణలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. జిల్లాకు 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని, సీఎం అదనంగా మరో 1500 ఇళ్లు ఇస్తామని ప్రకటించారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్య మానేరుకు మరో రూ. 250 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మధ్య మానేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ. 250 కోట్లు అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ముంపు గ్రామాల్లో పునరావాసం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలనే నిర్ణయాన్ని ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదించింది. మిడ్‌మానేరు రిజర్వాయర్ ముంపు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు శనివారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు నీటిపారుదల, రెవెన్యూ విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ప్రాణహిత ప్రాజెక్టుకు మిడ్‌మానేరు రిజర్వాయర్ గుండెకాయ వంటిదని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముంపు గ్రామాల్లోని ఇళ్లు, ఇతర కట్టడాల విలువ తరుగుదలను 35 శాతానికి పరిమితం చేయాలని అధికారులకు సూచించారు. గతంలో చెల్లించిన నష్టపరిహారం కంటే తక్కువ కాకుండా ప్రస్తుత పరిహారం లెక్కించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు హరీశ్, కేటీఆర్ ఆదేశించారు. 2015 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు దాటిన నిర్వాసితులకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని దినాలకు గాను ప్రస్తుతం ఇస్తున్న రోజుకు వంద రూపాయలను, రూ.180కి పెంచాలని మంత్రులు సూచించారు. ముంపు గ్రామాల పునరావాస కేంద్రాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, సిరిసిల్ల అర్బన్ ప్రాం తంలోని సుమారు 423 ఎకరాల భూములను జీఓ 123 ప్రకారం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ కోసం రైతులతో వెంటనే సంప్రదింపులు ప్రారంభించాలని కరీంనగర్ కలెక్టర్‌ను ఆదేశించారు. మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలోని గోపాల్రావుపేటలో 32 ఇళ్లకు పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అక్టోబర్ 31లోపు అమలు చేయాలని అన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ మానిక్‌రాజ్, ఈఎన్సీ మురళీధర్‌రావు, కరీంనగర్ కలెక్టర్ నీతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోజనం లేని పంటల బీమా ఎందుకు?
లోపభూయిష్టంగా పాలసీ: హరీశ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంటల బీమా పాలసీ లోపభూయిష్టంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆయన బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీని రైతులపై మోపుతున్నారని, ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్క రైతుకైనా ఇన్సూరెన్స్ చెల్లించిన దాఖలాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ‘ రైతు పొందిన రుణంలో 13 శాతం ప్రీమియం రూపంలో పోతే ఇక రైతు చేతికి ఏమి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని రైతుల మీద ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారని హరీశ్‌రావు బ్యాంకర్లను నిలదీశారు. కాగా చంద్రబాబు విభజన చట్టం చదవలేదా? అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు కుట్రలు చేసింది బాబు కాదా? అని అడిగారు. తెలంగాణ సమాజంపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. -
ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి
అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం ప్రగతినగర్ : గోదావరి పుష్కరాలకు శ్రీరాంసాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది భాగంలోని శ్రీరాంసాగర్, గుమ్మిర్యాల్, దోంచంద, సావె ల్, తడ్‌పాకల పుష్కర ఘాట్లకు శుక్రవారం రాత్రి నుంచే నీటిని వదలాలని ఆదేశించారు. ఎస్సారెస్పీలోని 10 టీఎంసీల నీటి నిలువలో నుంచి 5 టీఎంసీల నీరు పుష్కరాల కోసం విడుదల చేయాలన్నారు. పుష్కరాల ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందే ఘాట్లకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కందకుర్తి, దాని కింది భాగంలోని ఇతర ఘాట్లలో నీటికి కొంత ఇబ్బంది ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ దిగువ భాగంలోని ఘాట్ల వద్ద భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అన్ని ఘాట్లలో ప్రత్యామ్నాయ నీటి ఏర్పాట్లతో షవర్లు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం రాత్రిలోగా అన్ని పుష్కర పనులు పూర్తి చేయూలని ఆదేశించారు. ఘాట్ల వద్ద అధికారులందరికీ విధులు కేటారుుంచాలని, పురోహితులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ధరలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయూలని చెప్పారు. అనంతరం జేసీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని ఘాట్లలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారని, పనులు పూర్తి స్థాయిలోకి వచ్చాయని చెప్పారు. అన్ని ఘాట్లలో షవర్‌బాత్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐకేపీ పీడీ వెంకటేశం, డీపీఓ కృష్ణమూర్తి, పుష్కరాల లైజనింగ్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు. -
కొత్త పద్ధతిలో ఇసుక పంపిణీ
- జిల్లాలో 8 క్వారీలకు అనుమతి - రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు ప్రగతినగర్ : కొత్త విధానం ప్రకారం సరైన పద్ధతిలో ఇసుక పంపిణీకి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహకరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. ఇసుక పాలసీపై బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. జిల్లాలో 8క్వారీలలో ఇసుకను తీయడానికి అనుమతికి ప్రతిపాదించామన్నారు. ఐదు పట్టా భూముల్లో అనుమతించినట్లు చెప్పారు. ఈ పట్టా భూముల నుంచి తీసిన ఇసుకను స్టాక్పాయింట్లలో ఉంచి అనుమతించిన వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఇసుక క్వారీలున్న గ్రామాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.3 చొప్పున, జిల్లాకు రూ.4 చొప్పున సీనరేజ్ చార్జీలు చెల్లించడం జరగుతుందన్నారు. తద్వారా ఆయా గ్రామాలలో స్థానికంగా రోడ్ల నిర్వహణకు, అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇచ్చిన అనుమతుల మేరకు ఇసుక తరలింపులో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా, స్థానికుల అవసరాలకు, ప్రభుత్వ నిర్మాణాలకు అందేలా చూడాలన్నారు. ఇసుక తరలింపులో అక్రమాలకు తావివ్వకుండా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహక రించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 క్వారీలకు గాను పదింటికి అనుమతి లభించిందన్నారు. మరో 36క్వారీలకు అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, జిల్లాకేంద్రంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మైన్స్ ఏడీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ అనుసంధానం వేగవంతం చేయూలి జిల్లాకేంద్రంలో ఓటరు కార్డుకు ఆధార్ జోడింపును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ బీఎల్ఓలను ఆదేశించారు. బుధవారం స్థానిక న్యూఅంబేద్కర్ భవన్లో నగరానికి సంబంధించి ఓటరుకార్డుకు ఆధార్ సీడింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరం మినహా మిగతా 8నియోజక వర్గాలలో ఓటరు కార్డుకు సీడింగ్ పూర్తయ్యే దశలో ఉందన్నారు. నగరంలో మాత్రం కేవలం 20-30 శాతమే పూర్తి అయిందని పేర్కొన్నారు. సీడింగ్ పూర్తయితే డూప్లికేట్, బోగస్ ఓటరు కార్డులు ఏరివేయ వచ్చని చెప్పారు. దేశంలోనే మన జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున తర్వితగతిన పూర్తిచేయూలని సూచించారు. సమావేశంలో ఐకేపీ, మెప్మా పీడీలు వెంకటేశం, సత్యనారాయణ, తహశీల్దార్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా సాగేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 9 నుంచి 23 వరకు జరగనున్న పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని, జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సందర్భంగా అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచాలని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం, అభ్యర్థులకు రవాణాకు అవసరమైన బస్సు సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ రవీందర్‌రెడ్డి, అదనపు జేసీ రాజారాం, డీఆర్ఓ మనోహర్, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, ఆర్ఐఓ విజయ్‌కుమార్, డీఈఓ శ్రీనివాసాచారి, ఆర్టీసీ ఆర్ఓఎం రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.