ప్రయోజనం లేని పంటల బీమా ఎందుకు?
లోపభూయిష్టంగా పాలసీ: హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంటల బీమా పాలసీ లోపభూయిష్టంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆయన బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీని రైతులపై మోపుతున్నారని, ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్క రైతుకైనా ఇన్సూరెన్స్ చెల్లించిన దాఖలాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
‘ రైతు పొందిన రుణంలో 13 శాతం ప్రీమియం రూపంలో పోతే ఇక రైతు చేతికి ఏమి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని రైతుల మీద ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారని హరీశ్‌రావు బ్యాంకర్లను నిలదీశారు. కాగా చంద్రబాబు విభజన చట్టం చదవలేదా? అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు కుట్రలు చేసింది బాబు కాదా? అని అడిగారు. తెలంగాణ సమాజంపై కుట్రలు చేస్తున్నారని అన్నారు.