వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2016 జూన్(ఖరీఫ్) నాటికి పూర్తిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని, అవి పూర్తయితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుం దని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో 13 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టుల పురోగతి, వాటిల్లో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలు తదితరాలపై మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మారథాన్‌లా సమీక్ష జరిగింది.
146, 123 జీవోలను వాడుకుంటూ ముందుకు...
కాంట్రాక్టర్లకు అదనపు ధరల చెల్లింపులకు సంబంధించిన జీవో 146, భూసేకరణ జీవో 123లను ఉపయోగించుకోవాలని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 146 జీవో విడుదలైన నేపథ్యంలో కాంట్రాక్టు ఏజెన్సీలతో మాట్లాడి పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను 146 జీవోను ఉపయోగించుకొని పూర్తి చేయాలన్నారు.
ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1,400 ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 300 ఎకరాలను నవంబర్ 15 నాటికి సేకరించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, రాళ్లవాగు, వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు, నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పెండ్లిపాకాల, ఉదయసముద్రం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల కింద సైతం భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు.