సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించేలా అధికారులు సిద్ధం కావాలని మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ, భూసేకరణ, సహాయ పునరావాసం వంటి వాటినన్నింటినీ పూర్తిచేసి జనవరిలో పనులు ప్రారంభించాలని సూచించారు. గురువారం సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) కార్యాలయంలో ప్రాజెక్టుల వారీగా అధికారులతో మంత్రి సమీక్షించారు.
ముఖ్యంగా ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రాణహితలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణంపై స్పష్టత రావడంతో అక్కడ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి కోసం ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు భూసేకరణ సర్వేలో రెవెన్యూశాఖ సహకరించడం లేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. వెంటనే రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషికి హరీశ్‌రావు సూచించారు.
ఫిబ్రవరి రెండో వారానికి పాలమూరు టెండర్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటే మారిన ప్రణాళికకు అనుగుణంగా డిండి ఎత్తిపోతల సర్వే, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్ అంచనాలకు అనుగుణంగా డీపీఆర్ సైతం త్వరగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దుమ్ముగూడెంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
జనవరి నుంచి కొత్త ప్రాజెక్టుల పనులు
Published Fri, Nov 27 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
Advertisement
Advertisement