Irrigation projects works
-
కన్నీళ్లను తుడిచేది సీమ ఎత్తిపోతలే
సాక్షి, న్యూఢిల్లీ: తరతరాలుగా కరువుతో తల్లడిల్లుతున్న సీమ కడగండ్లు తీర్చేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి తాగునీరు అందించేలా రాయలసీమ ఎత్తిపోతల ఎంతో ఉపకరిస్తుందని పథకం ఆవశ్యకతను వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వేగంగా మంజూరు చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. బుధవారం ఢిల్లీలో భూపేంద్రయాదవ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం సందర్భంగా పర్యావరణ అనుమతులతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. ఏకపక్షంగా నీటి విడుదల.. కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆపరేషనల్ ప్రొటోకాల్స్, ఒప్పందాలు, ఆదేశాలను ఉల్లంఘించడంతో కృష్ణాపై వాటా హక్కుల్ని ఏపీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. 2021–22, 2022–23లో సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచే విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వినియోగించడం ప్రారంభించిందన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడంతో పాటు బోర్డుకు ఎలాంటి ఇండెంట్ లేకుండా... నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాకు అవసరం లేనప్పటికీ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందన్నారు. నీటి పారుదల అవసరాల్లో విద్యుదుత్పత్తి అన్నది కేవలం యాదృచ్ఛికంగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల దిగువ వరకు నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే కానీ పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని కేంద్రమంత్రికి వివరించారు. లేదంటే పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతల మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.. తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3 టీఎంసీలు), దిండి పథకాల గురించి గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వినియోగించుకోవడం కూడా సాధ్యపడదన్నారు. ఈ పరిస్థితుల నేప«థ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఎస్) అమలు చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరునగరి సుజల స్రవంతికి సరఫరా చేయగలుగుతామన్నారు. నిబంధనలు, ప్రొటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రయోజనాలు ప్రమాదంలో పడకుండా కాపాడాలన్నారు. ప్రధాన కాలువకు నీటిని అందించేందుకే.. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర అధికారులతో సమగ్ర చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే అందించామన్నారు. ఇందుకోసం భూ సేకరణ చేయడం లేదని, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి 10 కి.మీ దూరంలో ఉండడంతో పాటు కేవలం ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని అందించడం కోసమే ఎత్తిపోతలను చేపడుతున్నట్లు సీఎం వివరించారు. వీలైనంత త్వరలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి.. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని సీఎంజగన్ వివరించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తికి అనువైన స్థలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, వీటిని ప్రోత్సహించేందుకు పాలసీ కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆ తరహా ప్రాజెక్టులకు ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు లాంటి చోట్ల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోసం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల (1,350 మెగావాట్లు) పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల ప్రగతికోసం చేపట్టిన ఆయా ప్రాజెక్టులన్నింటికీ అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 3 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు ‘‘ఏపీ 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ఉందని సీఎం జగన్ కేంద్రమంత్రికి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు తీరప్రాంతంలో 10 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 మార్చి నాటికి పోర్టు కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన సమాచారాన్ని కూడా అందజేశామన్నారు. ఈ పనులను వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అనుమతులిచ్చి సహకారం అందించాలని కోరారు. -
ఆంధ్రరాష్ట్రానికి పోలవరం.. మణిహారం
సత్తెనపల్లి(పల్నాడు): ఆంధ్రరాష్ట్రానికి పోలవరం మణిహారమని, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్తెనపల్లి నియోజవకవర్గానికి చేరుకోవడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన రాజుపాలెం మండలం దేవరంపాడులోని నేతి వెంకన్నస్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణానికి చేరుకోగా మున్సిపల్ చైర్పర్సన్ చలంచర్ల లక్ష్మీతులసి హారతి పట్టి ఆహ్వానించారు. నరసరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద నుంచి అశేషజనవాహినితో ర్యాలీగా అమరావతి బస్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక వద్దకు వచ్చారు. హరిమిత్ర మండలి ఏర్పాటు చేసిన భారీ గజమాలను ధరించారు. ఆర్యవైశ్యనాయకులు వెలుగూరి శరత్ వెండికిరీటాన్ని మంత్రికి అందించారు. అచ్యుత శివప్రసాద్ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని పదవిలా కాకుండా కీలకమైన బాధ్యతగా భావిస్తానన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోల వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారన్నారు. జలవనరుల శాఖ కీలకమైనదని రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు, నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా పారదర్శకంగా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంస్కరణలతో, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా కోట్లరూపాయలు లబ్ధిదారుల ఖాతాలో చేర్చుతున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వేదికపై వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి నిమ్మకాయల రాజానారాయణ, పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి, మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ రాయపాటి ఫురుషోత్తమరావు, జిల్లా రైతు సలహామండలి సభ్యులు కళ్లం విజయభాస్కరరెడ్డి, వైస్ చైర్మన్ షేక్ నాగూర్‌మీరా, యువజన నాయకులు అచ్యుత శివప్రసాద్ తదితరులున్నారు. గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో కలిసి అభినందించారు. -
సర్కార్‌పై ‘రాజకీయ చార్జిషీట్లు’
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. వాగ్దానాలు, హామీల్లో వైఫల్యాలతోపాటు అవి నీతిని వెలికితీసి ప్రజాకోర్టులో పొలిటికల్ చార్జిషీట్లు దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఇచ్చిన వాగ్దానాలు, నేతలు స్థానికంగా ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలపై వివరాలు సేకరించనుంది. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయేందుకు అవకాశమున్న అంశాలు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు మొదలు వివిధ స్థాయిల నేతలు పాల్పడే అవినీతి, దందాలపై బీజేపీ దృష్టి పెట్టింది. వీటితో ముడిపడిన వివిధ అంశాలపై ప్రత్యేకంగా పనిచేసేందుకు త్వరలోనే ముఖ్యనేతలతో సబ్ కమిటీలను నియమించనున్నట్టు సమాచారం. ఈ కమిటీలకు కన్వీ నర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమించడం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై సమాచార సేకరణ, లోతైన విశ్లేషణ జరిపి అధికారపార్టీ తీరును ఎండగట్టాలని నాయకత్వం భావిస్తోంది. గత ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, వాటి నిర్మాణానికి చేసిన వ్యయం, వాటి వల్ల ప్రజలకు ఒనగూరిన అదనపు ప్రయోజనాలు, అవినీతి, అక్రమాలు, కమిషన్లు పొందేందుకు ఉన్న ఆస్కారాలు, సంబంధిత విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. ముఖ్య నేతలతో కమిటీల నియమాకం సీఎం కేసీఆర్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఏ మేరకు అమలయ్యాయి, వాటిలో ప్రధానంగా అమలుకానివి ఏవేవీ అన్న అంశాన్ని కూడా మరో కమిటీ ద్వారా వెలికితీయనున్నారు. వివిధ స్థాయిల్లోని టీఆర్ఎస్ నేతలపై వచ్చిన, వస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టి పెట్టేందుకు ఇంకొక కమిటీని నియమిస్తున్నారు. త్వరలోనే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్వహణ, లోటుపాట్లు తదితర అంశాల పరిశీలనకు ఓ మాజీ ఎంపీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీలకు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్ వెంకటస్వామి, తీన్మార్ మల్లన్న, ఇతర ముఖ్య నేతలను కన్వీనర్లు, కో కన్వీనర్లుగా నియమించేందుకు నియమించనున్నట్లు సమాచారం. ఈ కమిటీల్లో సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు తెలుస్తోంది. వీటికి సమాంతరంగా వివిధ సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, దందాలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా మొత్తంగా అధికార పార్టీపై వివిధ మార్గాల ద్వారా రాజకీయపరంగా ముప్పేట దాడిని కొనసాగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. -
పోలవరం బకాయిల విడుదలకు సిఫార్సు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ఉన్న రూ.2,087 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ని కోరగా రూ.711 కోట్ల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్సు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. బిల్లుల స్క్రూటినీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరాల్సి రావడం, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి కారణాలవల్ల బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. పోలవరం నిర్మాణంలో ఇరిగేషన్ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుందని, వాటిని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపుతారని తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు అనుమతి లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్ మార్కెట్ నుంచి సేకరిస్తుందని పేర్కొన్నారు. ఆ నిధులు నాబార్డ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి, అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయని చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు పరిమళ్ నత్వానీ, అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.11,600.16 కోట్లు తిరిగి చెల్లించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2019 మే నుంచి ఇప్పటివరకు రూ.4,836 కోట్లు చెల్లించినట్లు టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఏపీలో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులు ఏపీలోని 13 జిల్లాల్లో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించామని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వీధి వ్యాపారుల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం దేశంలో ఎంపిక చేసిన 125 మునిసిపాలిటీల్లో ప్రధానమంత్రి స్వానిధి సే సమృద్ధి పథకాన్ని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా పీఎం స్వానిధి పథకం కింద ఎంపిక చేసిన వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు చెప్పారు. ఎగుమతుల విషయంలో దేశంలోని చిన్న, మధ్యతరగతి సంస్థల నుంచి ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు అందలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నారాయణ రాణే చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు పనులు ప్రారంభం గెజిట్ నోటిఫికేషన్‌ను అమలుచేసే పనిని గోదావరి, కృష్ణా బోర్డులు ఇప్పటికే ప్రారంభించాయని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకంగా నీటి విడుదలను నిలిపేయాలని తాజాగా ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అభ్యర్థించిందని టీజీ వెంకటేశ్ ప్రశ్నకు సమాధామిచ్చారు. విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు త్వరలో విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయని పౌర విమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ చేపడుతోందని, ఈ మేరకు ఈ ఏడాది జూన్ 15న ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ డిమాండ్–సరఫరా ఎలా ఉందో ఎయిర్‌లైన్స్ సంస్థలు అధ్యయనం చేసిన అనంతరం ఆయా రూట్లలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్‌లైన్స్ ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్ అనంతరం విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసుల నిర్వహణకు వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ను గుర్తించినట్లు తెలిపారు. వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. -
ఇబ్బందుల్లోనూ పనుల యుద్ధం!
‘‘రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకే ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ ప్రాజెక్టు పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముందుగా నిధులిస్తున్నాం. పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలి’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరులశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల ప్రగతిని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు 91 శాతం పూర్తయ్యాయని, జూన్ 15 నాటికి మిగిలినవి పూర్తి చేస్తామన్నారు. స్పిల్ వేకు 42 రేడియల్ గేట్లను బిగించామని, మరో 6 గేట్లు అమర్చాల్సి ఉందని, వాటిని కూడా వేగంగా బిగిస్తామని వివరించారు. జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు త్వరలోనే పోలవరానికి చేరుకుంటాయన్నారు. ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేసి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నెలాఖరుకు స్పిల్ చానల్ పనులు రక్షిత స్థాయి (సేఫ్ స్టేజ్)కి చేరుకుంటాయన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు సంక్లిష్టమైనవి కూడా పూర్తి చేశామని వెల్లడించారు. కాఫర్ డ్యామ్‌లోని అన్ని రీచ్‌లను జూన్ నెలాఖరుకు 38 మీటర్ల ఎత్తుకు, జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని తెలిపారు. వేగంగా దిగువ కాఫర్ డ్యామ్ పనులు.. నిర్దేశించుకున్న ప్రణాళిక మేరకు పోలవరం పనులు జరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టండి.. పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి దాదాపు రూ.1,900 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తేవడంతో.. కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండడం సరి కాదన్నారు. ఢిల్లీ వెళ్లి ఆ నిధులు రీయింబర్స్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పనులకు వచ్చే మూడు నెలల్లో కనీసం రూ.1,470 కోట్లు అవసరమవుతాయని అధికారులు వివరించడంతో ఆ మేరకు నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాధాన్యతగా నేరడి బ్యారేజీ.. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. బ్యారేజీ ముంపు ప్రాంతంపై చర్చల కోసం ఇప్పటికే ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాసి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఒడిశా అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు కూడా 84 శాతం పూర్తయ్యాయని, జూలై 31 నాటికి మిగిలినవి పూర్తవుతాయని వివరించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను ఇరువైపుల నుంచి చేస్తున్నామని, 116 మీటర్ల పని మిగిలి ఉందని, ఫాల్ట్ జోన్‌ను పాలి యూథిరేన్ ఫోమ్ (పీయూఎం) రసాయన మిశ్రమం ద్వారా ఫోర్ ఫిల్లింగ్ ప్రక్రియ ద్వారా చేస్తున్నామని, మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలి.. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తయిందని అధికారులు వివరించారు. టన్నెల్ –2 హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. టన్నెల్–2లో ఇంకా 7,335 మీటర్ల పని మిగిలి ఉందని తెలిపారు. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని, తదుపరి సమావేశం నాటికి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం నిర్దేశించారు. సత్వరమే వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పూర్తి.. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వీటన్నింటినీ ప్రాధాన్యత ప్రాజెక్టులుగా చేపట్టామని, వీటి పనుల్లో ఏమాత్రం ఆలస్యం కావడానికి వీల్లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులకు సంబంధించి భూసేకరణ ఇబ్బందులు తొలగినందున వేగంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. భూసేకరణ సమస్యలను కొలిక్కి తెస్తున్నామని, గడువులోగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కాంట్రాక్టరు కోర్టుకు వెళ్లారని, న్యాయపరమైన చిక్కులను తొలగించి ముందడుగు వేస్తున్నామని వివరించారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేశామన్నారు. బ్రహ్మంసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. బ్రహ్మంసాగర్‌లో సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నిల్వ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు సమీకరించి పక్కాగా పనులు.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులు, గోదావరి కృష్ణా సెలైనటీ మిటిగేషన్, జలభద్రత ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల పనుల సన్నద్ధత, ఆర్థిక వనరుల సేకరణను పరిశీలించారు. ఇప్పటికే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశామని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఈ ప్రాజెక్టుకు రూ.12,056 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పనులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) రూ.2,750 కోట్ల రుణం మంజూరు చేసిందని, అందులో రూ.850 కోట్లు మార్చిలోనే విడుదలైనట్లు చెప్పారు. నిధులను సమీకరించి ప్రణాళిక ప్రకారం పనులను చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన బిల్లులన్నీ మంజూరు చేయాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరింత వేగంగా ప్రాజెక్టుల పనులు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం పెంచాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆయన 13 జిల్లాల చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ఆరు ప్రాజెక్టులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూలు ప్రకారమే చేస్తున్నామని సీఈ సుధాకర్ బాబు వివరించగా.. ఎగువ కాపర్ డ్యామ్ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి అనిల్ సూచించారు. వరద వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఓ.ఆనంద్‌ను ఆదేశించారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని సీఈ హరినారాయణరెడ్డి చెప్పగా.. వాటిని ఈ ఏడాదే సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడానికి సిద్ధం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనం ఫోర్ పూలింగ్ విధానంలో చేస్తున్నామని, ఆగస్టు నాటికి పూర్తవుతాయని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను ఈ ఏడాదే పూర్తి చేసి.. వాటిని ప్రారంభించడానికి సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘యాస్’ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
సకాలంలో పోలవరం పూర్తి కావాల్సిందే: సీఎం జగన్
సాక్షి, అమరావతి : నిర్ధేశించుకున్న లక్ష్యాలలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్ధేశించుకున్న పోలవరం సహా నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వెలిగొండ, వంశధార, అవుకు టన్నెల్ తదితర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి ప్రతి పనిలో కూడా ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రెండో విడత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌ల కార్యాచరణ సిద్దం చేయాలని, దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టండని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలలోపు పనులు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్షించి.. ప్రాధాన్యతా ప్రాజెక్టులు, సకాలంలో వాటిని పూర్తి చేయడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఇళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. సహాయ పునరావాస కార్యక్రమాలపైనా అధికారులతో సీఎం సమీక్షించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల పనుల పురోగతి, నెల్లూరు బ్యారేజీ సివిల్ వర్క్స్ పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. మార్చి 31లోగా గేట్ల బిగింపు పూర్తవుతుందని అన్నారు. ఏప్రిల్‌లో బ్యారేజీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సంగం బ్యారేజీకి సంబంధించి సివిల్ మేజర్ వర్క్స్ పూర్తయ్యాయని పేర్కొన్నారు. గేట్లకు సంబంధించిన సామగ్రి చేరిందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. రెండు వారాల్లో గేట్ల బిగింపు ప్రారంభించి, మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామన్న అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జే శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ అవుకు టన్నెల్ పనుల పురోగతి అవుకు టన్నెల్లో లూజ్ సాయిల్ వల్ల క్లిష్టపరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటికే రెండు టన్నెల్స్ నుంచి దాదాపు 14వేల క్యూసెక్కుల వరకూ నీటిని పంపించగలుగుతాన్నమని, మరో టన్నెల్లో 134 మీటర్ల తవ్వకం పనుల్లో వర్షాలు, లూజ్‌సాయిల్ కారణంగా సమస్యలు వచ్చాయని అన్నారు. సొరంగంలో విరిగిపడ్డ మట్టిని తొలగించే పనులు, పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. జులై నాటికి ఈ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. వెలిగొండ టన్నెల్ పనుల పురోగతి వెలిగొండలో టన్నెల్ 1 హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. టన్నెల్ 2 హెడ్ రెగ్యులేటర్ పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు, మూడున్నర నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. టన్నెల్ 1 తవ్వకం పనులు పూర్తి చేశామన్న అధికారులు లైనింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. టన్నెల్ 2 లో ఆగష్టు నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్ నీటినిల్వకు సిద్ధం చేశామని అధికారులు తెలపగా.. ఆర్ అండ్ ఆర్ పనులు అక్టోబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన కాల్వల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. పోలవరం_ప్రాజెక్టు: ► ఫిబ్రవరి 10 నాటికి స్పిల్ వే రోడ్ పూర్తిచేస్తామన్న అధికారులు ► స్పిల్‌ఛానల్‌లో శరవేగంగా పనులు జరుగుతున్నాయన్న అధికారులు ► రేడియల్ గేట్లను అమర్చే ప్రక్రియ ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ► అప్రోచ్ ఛానల్ కూడా మే నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకూడదన్న సీఎం ►అనుమతులకోసం ప్రత్యేకించి ఒక అధికారిని పెట్టాలన్న సీఎం ►సిలెండర్ల దిగుమతిలో ఆలస్యం లేకుండా చూసుకోవాలన్న సీఎం ఎగువ కాఫర్ డ్యాంలో రీచ్ 1 మార్చి నెలాఖరుకు, రీచ్ 2 ఏప్రిల్ నెలాఖరు నాటికి రీచ్, 3 మే నెలాఖరు నాటికి, రీచ్ 4 మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ► వచ్చే వర్షాకాలంలోగా కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు ► గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యాం కారణంగా ఎవరూ ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం ► ఆలోగా సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న సీఎం ► ప్రాధాన్యతా క్రమంలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఆర్ అండ్ ఆర్ పనులు చేపట్టాలన్న సీఎం ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులపై కూడా సీఎం సమీక్ష ► వంశధార ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను జులై నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ► ఈ ప్రాజెక్టు కింద మొత్తం మూడు ప్యాకేజీల్లో పనులు పూర్తి చేసి జూలైనాటికి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామన్న అధికారులు ► వంశధార - నాగావళి అనుసంధానానికి సంబంధించి జూన్‌నాటికి పనులు పూర్తిచేస్తామన్న అధికారులు తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులపైనా సీఎం సమీక్ష ► తోటపల్లి పెండింగ్ పనులను 2022 జూన్ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ► గజపతినగరం బ్రాంచి కెనాల్ కింద 15వేల ఎకరాలకు 2022 జూన్ నుంచి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు ► తారకరామ తీర్ధసాగర్ ప్రగతిని వివరించిన అధికారులు ►న్యాయపరమైన వివాదాలపై దృష్టిపెట్టి, డిసెంబర్, 2022 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్న అధికారులు ►మహేంద్ర తనయ ప్రాజెక్టును జూన్, 2022 నాటికి పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►కాల్వలకు భూసేకరణ పూర్తిచేసి... త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్న అధికారులు పనులు వెంటనే మొదలుపెట్టాలి: సీఎం ► రెండో ఫేజ్‌లో ప్రయార్టీ ప్రాజెక్టులతో కార్యాచరణ తయారు చేయాలని సీఎం ఆదేశం ►వీటితోపాటు ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులకు సీఎం ఆదేశం ► రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టు, కృష్ణా కొల్లేరు సెలైనటీ మిటిగేషన్ ప్రాజెక్టు, ఏపీ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ► ప్రాజెక్టులకు సంబంధించిన ఎస్పివి(స్పెషల్ పర్పస్ వెహికిల్)లపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలనూ సమీక్షించిన సీఎం ► ఆయా ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు ► రాయలసీమ, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు వివిధ ఆర్థిక సంస్థలతో సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని వెల్లడించిన అధికారులు ► మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపైనా దృష్టిపెట్టామన్న అధికారులు ►వరికిపూడిశెల పనులు సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. -
సబ్ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని నిర్మూలించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్లో పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టు కింద ఇచ్చే పనులకు పరిమితి విధించింది. పనుల కాంట్రాక్టు అగ్రిమెంట్ (ఒప్పంద) విలువలో 25 శాతం కంటే ఎక్కువ విలువైన పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇవ్వకూడదని నిబంధన పెట్టింది. సబ్ కాంట్రాక్టు కింద ఇచ్చే 25 శాతం పనులను ఎవరికి ఇస్తున్నారు? వారికి ఏమి అర్హతలున్నాయి? పనులు చేసిన అనుభవం ఉందా? అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎ ల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపాలి. ఈ ప్రతిపా దనలపై ఎస్‌ఎల్‌టీసీ సంతృప్తి చెందితేనే సబ్ కాంట్రాక్టుకు పనులు ఇచ్చేందుకు అనుమతి ఇస్తుంది. ఎస్‌ఎల్‌టీసీ అనుమతి లేకుండా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడాన్ని నిషేధించింది. సబ్ కాంట్రాక్టర్లను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోపిడీ ► ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్), ఎల్ఎస్ (లంప్సమ్) పద్ధతుల్లో నిర్వహించిన టెండర్లో పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ 50 శాతం పనిని సబ్ కాంట్రాక్టుకు ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. కానీ.. సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ► 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 మధ్య ఈ నిబంధనను వక్రీకరించిన గత చంద్రబాబు సర్కార్.. ప్రధాన కాంట్రాక్టర్‌ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. పోలవరం హెడ్ వర్క్స్‌లో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాని మోదీ ఇదే అంశాన్ని రాజమహేంద్రవరం ఎన్నికల సభలో ఎత్తిచూపారు. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ.200 కోట్లతో పూర్తయ్యే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల అంచనా వ్యయాన్ని రూ.430 కోట్లకు పెంచేసిన టీడీపీ సర్కార్.. ‘సింగిల్’ షెడ్యూలు దాఖలు చేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు రూ.450.85 కోట్ల పనులు కట్టబెట్టింది. వీటిని చంద్రబాబు తన బినామీ సీఎం రమేష్ సబ్ కాంట్రాక్టు కింద అప్పగించేశారు. డిజైన్లు మారడం వల్ల పనుల పరిమాణం పెరిగిందని చూపి, అదనంగా రూ.129 కోట్లను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ► సబ్ కాంట్రాక్టర్లు సులభంగా ఉండే మట్టి పనులు చేసి కాంక్రీట్ పనులు, ఎలక్ట్రో మెకానిక్ పనులను వదిలేయడం, ప్రధాన కాంట్రాక్టర్‌కు వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల సాగునీటి ప్రాజెక్టుల పనులు అస్తవ్యస్తంగా మారాయి. పారదర్శకతకు గీటురాయి ► టీడీపీ సర్కార్ నీరుగార్చిన టెండర్ వ్యవ స్థకు సంస్కరణల ద్వారా జీవం పోసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. పనులను పారదర్శకంగా పూర్తి చేసే దిశగా సబ్ కాంట్రాక్టు విధానం పరిమితులు విధించింది. ► సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిన పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్‌దే. వాటి నాణ్యత బాధ్యత కూడా ప్రధాన కాంట్రాక్టర్‌దే. బిల్లుల చెల్లింపులో ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటిని ఉల్లంఘిస్తే ప్రధాన కాంట్రాక్టర్‌పై సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ► దీని వల్ల అర్హత లేని వారికి సబ్ కాంట్రాక్టు కింద పనులు ఇచ్చే అవకాశం ఉండదు. అర్హత ఉన్న వారికే సబ్ కాంట్రాక్టు కింద పనులు ఇవ్వడం వల్ల పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తారు. -
పనులను పరుగెత్తించాలి
గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్–2 పనులు వేగంగా సాగాలి. గడువులోగా పనులు పూర్తి చేయాలి. అక్టోబర్‌లో ప్రారంభించడానికి సిద్ధం చేయాలి. పోలవరం పనుల్లో ఇంకా వేగం పెరగాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. అవుకు టన్నెల్–2, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2.. వంశధార–నాగావళి అనుసంధానం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిని ఈ ఏడాదే ప్రారంభించడానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో ఈ ఏడాది పూర్తి చేయాలని నిర్దేశించుకున్న ఆరు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం లోతుగా సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గడువులోగా అవుకు టన్నెల్–2 పనులు గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్–2 పనులు వేగంగా జరుగుతున్నాయని.. గడువులోగా పనులు పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. అక్టోబర్‌లో ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని చెప్పారు. వెలిగొండ టన్నెల్–1లో 700 మీటర్ల మేర తవ్వకం పనులు మిగిలాయని, గడువులోగా ఆ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. నల్లమలసాగర్ పనులు పూర్తయ్యాయని.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అన్ని రకాల అనుమతులు వచ్చాయని వివరించారు. నల్లమలసాగర్ నుంచి ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ (తూర్పు ప్రధాన కాలువ)కు నీటిని సరఫరా చేసేందుకు 180 మీటర్ల పొడవున టన్నెల్ తవ్వాలని.. వాటిని మూడు నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పారు. తీగలేరు కెనాల్‌కు నీటిని సరఫరా చేసేందుకు 600 మీటర్ల మేర తవ్వాల్సిన టన్నెల్ పనులు కూడా పూర్తవుతున్నాయని వివరించారు. నాలుగు నెలల్లోగా టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్‌లో వెలిగొండ టన్నెల్–1 ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేయడానికి సిద్ధం చేస్తామన్నారు. నెల్లూరు బ్యారేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయని, రెండు నెలల్లోగా సివిల్ పనులు పూర్తవుతాయని.. అక్టోబర్ చివరికి పనులు పూర్తవుతాయని సీఎంకు అధికారులు వివరించారు. సంగం బ్యారేజీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని, అక్టోబర్‌కు పనులు పూర్తవుతాయని, ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. ప్రాజెక్ట్‌ల పనుల పురోగతిపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి అనిల్‌కుమార్, అధికారులు నేరడి బ్యారేజీకి అంచనాలు సిద్ధం చేయండి వంశధార–నాగావళి అనుసంధానం పనులను వేగవంతం చేశామని.. డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. వంశధార ఫేజ్–2 స్టేజ్–2లో మిగిలిపోయిన పనులను కూడా వేగంగా సేఫ్ స్టేజ్ (రక్షణాత్మక స్థాయి) వరకూ పూర్తి చేసి.. ఈ ఏడాది హిరమండలం రిజర్వాయర్‌లో 8 టీఎంసీలను నిల్వ చేస్తామని.. వచ్చే ఏడాది జూలై నాటికి మిగతా పనులను కూడా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఆరు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వంశధార ఫేజ్–2 స్టేజ్–2లో వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వంశధార ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యేలోపు నేరడి బ్యారేజీ పనులు చేపట్టడానికి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేయాలన్నారు. నేరడి బ్యారేజీని పూర్తి చేయడం ద్వారా.. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం పూర్తి కావాలి పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమీక్షించారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం గడువులోగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరికి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తే పోలవరం స్పిల్ వేను వరద జలాలు తాకుతాయని.. ఆ మేరకు వరద ఆగస్టులో వస్తుందని అధికారులు తెలిపారు. ఆగస్టులో తప్ప.. మిగతా రోజుల్లో స్పిల్‌వే పనులు చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఏప్రిల్‌లో మూడు వేల మంది కూలీలు పని చేసేవారని.. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో 900 మంది మాత్రమే పనులు చేసేవారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు వేల మంది కూలీలు పని చేస్తున్నారని.. మిగతా అందరినీ పిలిపిస్తున్నామన్నారు. స్పిల్ వేలోని 52 ఫర్స్లు గతంలో సగటున 28 మీటర్ల ఎత్తున ఉంటే.. ప్రస్తుతం సగటున 47.44 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయన్నారు. రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక పనులకు టెండర్లు కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి, దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి టెండర్లు పిలవాలి. పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలి. చిత్రావతి, గండికోట జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు మిగిలిపోయిన భూసేకరణను పూర్తి చేయడం ద్వారా ఆ జలశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ సమీక్షలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ నుంచి పోలవరం గేట్లు బిగించాలి పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్ల తయారీ పనులను పూర్తి చేసి, నవంబర్ నుంచి స్పిల్ వేకు 48 గేట్లను అమర్చడం ప్రారంభించాలి. గోదావరికి వరద తగ్గాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను భర్తీ చేసి.. గోదావరి డెల్టాలో రబీ పంటలకు అవసరమైన నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించాలి. ఈసీఆర్ఎఫ్ పనులను చేపట్టి గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. వరద వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులు చేసుకోవాలి. స్పిల్ వే పూర్తయ్యాక గేట్లను నవంబర్ నుంచి బిగించాల్సి ఉంటుంది కాబట్టి.. ఆలోగానే గేట్ల ఫాబ్రికేషన్ పనులు పూర్తి అయ్యేలా చూడాలి. ఈ అంశంలో ప్లాన్–బీ కూడా పెట్టుకోవాలి. పనులు ప్రణాళికా బద్ధంగా సాగకపోతే.. షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుంది. గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని.. పోలవరం ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలి. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలి. (అధికారులు జూలైలోగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు) 2022 జూన్ నాటికి సాగుకు నీళ్లివ్వాలి. పోలవరానికి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన వ్యయంలో రూ.3,791 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఇందులో రూ.2,300 కోట్లను రీయింబర్స్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మిగిలిన రూ.1,491 కోట్లను కూడా రీయింబర్స్ చేయడానికి ప్రతిపాదనలను పంపాలని సీఎం ఆదేశించారు. -
అధికారులపై మంత్రి హరీష్ ఆగ్రహం
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాక కు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను హరీష్ పరిశీలించారు. దుబ్బాక నియోజక వర్గంలో దాదాపు 40 కిలోమీటర్ల మేర ఈ కాలువ ఉంది. ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి హరీష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి లో ప్రధాన కాలువ పనులు అసంపూర్ణంగా ఉండటంతో మంత్రి హరీష్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ('పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి') -
లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తి: స్పీకర్
సాక్షి, శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తి అయ్యిందని స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మధనాపురం, అన్నంపేట, వెన్నెలవలస, తాళపత్రి, నందివాడలలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. పెండింగ్ సాగునీటీ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. రూ. 22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతుల ప్రథంక ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. (కరోనా: శ్రీకాకుళంలో మరో ఇద్దరికి పాజిటివ్ !) గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేస్తూ జీవోలు విడుదల అయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం అక్రమాల వలన ఎత్తిపోతల పథకాలు డిజైన్లు మార్చడం, నష్టపరిహారం చెల్లింపులు వివాదస్పదం అయ్యాయన్నారు. నీరు చెట్టు పనుల్లో అక్రమాల వలన సాగునీటి వనరులు నిరుపయోగంగా మారయన్నారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాగునీటి పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులను, నిధులను ఇచ్చారని చెప్పారు. నారాయణ పురం ఆనకట్ట వద్ద బ్యారేజీ కం రిజర్వాయర్ నిర్మించి ఆయకట్ట స్థిరీకరణ చేయాలని ఆయన పేర్కొన్నారు. (ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..) -
సాగు నీరు..రుణాల జోరు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆశించిన మాదిరి లేకున్నా ఉపశమనం కలిగించేలా ఉంది. 2020–21 వార్షిక బడ్జెట్లో సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధులకన్నారూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు పెంచింది. గతంకన్నా భిన్నంగా ప్రాజెక్టుల పంపుల నిర్వహణ భారీగా ఉండనుండటంతో దానికింద నిర్వహణ పద్దు నిధులను పెంచారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల ప్రాజెక్టులకు అధిక కేటా యింపులు చేశారు. అయినప్పటికీ ఈ నిధులతో ప్రాజెక్టులు పూర్తికాకుంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాల ద్వారానే వాటిని పూర్తి చేయనున్నారు. అడిగింది కొండంత.. ఇచ్చింది కొంతే.. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపుల నేపథ్యంలో గతేడాది సాగునీటికి కేవలం రూ. 8,476.17 కోట్లే కేటాయించారు. ఈ ఏడాది కూడా మాంద్యం పరిస్థితులున్నా గతేడాదికన్నా రూ. 2,57 7,38 కోట్ల మేర పెంచి మొత్తంగా రూ.11,0 53.55 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం రూ. 21 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్కింద రూ. 7 వేల కోట్లు కోరింది. కానీ ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ. 805.47 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు కు రూ. 3,500 కోట్లు, దేవాదులకు రూ. 500 కోట్లు, తుపాకులగూడేనికి రూ. 500 కోట్లు కేటాయించాలన్న సాగునీటిశాఖ విజ్ఞప్తిని సర్కా రు పెద్దగా పట్టించుకోలేదు. పాలమూరుకు రూ. 368.58 కోట్లు, దేవాదులకు రూ. 292.38 కోట్లు, తుపాకులగూడేనికి రూ.73.83 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడు,కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,200 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు రూ. 50 కోట్లకే పరిమితమయ్యాయి. బకాయిలూ భారీగానే... సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భారీగానే పెండింగ్ బకాయిలున్నాయి. రూ. 11,965.23 కోట్ల బకాయిలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రధాన పనులకు సంబంధిం చి బకాయిలు రూ. 5,550 కోట్లు ఉండగా రుణాల కోసం కార్పొరేషన్లకు మార్జిన్ మనీ కింద ఇవ్వాల్సినవి రూ. 1,695 కోట్లు, భూసేకరణ బకాయిలు రూ. 1,585 కోట్లు, విద్యుత్ బకాయిలు రూ. 3,072 కోట్ల మేర ఉన్నాయి. పాలమూరు పరిధిలో రూ. వెయ్యి కోట్లు, కాళేశ్వరం పరిధిలో రూ. 1,500 కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 350 కోట్ల మేర ఉన్నాయి. ఇక ఈ ఏడాది మైనర్ ఇరిగేషన్‌కు కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే రూ. 42 కోట్లు తగ్గించి రూ. 602.45 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ. 402 కోట్లు కేటాయించారు. అయితే దీని బకాయిలే రూ. 550 కోట్ల మేర ఉన్నాయి. ఆదుకునేది అప్పులే ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్, రబీ నాటికి భారీ ఆయకట్టు లక్ష్యాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటితో 360 టీఎంసీలను ఎత్తిపోయా లని ప్రణాళిక వేశారు. దీంతోపాటే సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా దేవాదులలో 100% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రాష్ట్ర నిధులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ. 61,500 కోట్ల రుణ సేకరణ చేపట్టగా అందులో రూ. 38 వేల కోట్ల రుణాల ద్వారానే ఖర్చు జరిగింది. ఇక సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 17 వేల కోట్ల రుణ సమీకరణ చేయగా అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019–20 వార్షిక బడ్జెట్ నిధుల ద్వారా రూ. 8 వేల కోట్లు ఖర్చు జరగ్గా రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ. 14 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది సైతం రూ. 20 వేల కోట్ల రుణాల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. అందులో కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్లు ఖర్చు జరిగే అవకాశం ఉండగా మిగతా ప్రాజెక్టులకు మరో రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. డబుల్ రోడ్లకు బ్యాంకు రుణాలే దిక్కు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నిర్మించే డబుల్ రోడ్లకు ఈసారి బ్యాంకు రుణాలే ఆధారం కానున్నాయి. ఈ రోడ్లకు ప్రణాళికలు రూపొందించిన కొత్తలో విరివిగా నిధులు అందగా, గత రెండు మూడేళ్లుగా చాలినన్ని విడుదల కావడం లేదు. ఈసారి కూడా బడ్జెట్ కేటాయింపులు దాదాపు అలాగే ఉన్నాయి. డబుల్ రోడ్లకు తాజా బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతి పద్దు కింద రూ.655 కోట్లు చూపారు. గత బడ్జెట్లో దీనికి కేవలం రూ.187 కోట్లు కేటాయించారు. అంతకు ముందు బడ్జెట్లో అది రూ.460 కోట్లుగా చూపారు. 2017–18లో రూ.2,500 కోట్లు వచ్చాయి. ఆ సంవత్సరం పనులు ఊపుగా జరిగాయి. ఆ తర్వాత నుంచి నిధులు తక్కువగా రావడంతో కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయాయి. ఇటీవల బ్యాంకు లోన్ ద్వారా ఆ బకాయిలు తీర్చారు. ఇప్పుడు కూడా చాలినన్ని నిధులు వచ్చే అవకాశం లేనందున మళ్లీ బ్యాంకు రుణంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో 65% పనులు పూర్తయ్యాయి. మరో 35% పనులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు.. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నగరంలో పోలీసు కమాం డ్ కంట్రోల్ భవనం తదితరాల కోసం రూ.550 కోట్లు కేటాయించారు. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు కేటాయించారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. బియ్యం సబ్సిడీకి రూ.2,362 కోట్లు రాష్ట్రంలో ప్రజా పంపి ణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం బడ్జెట్లో రూ.2,362 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బి య్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధి్ధదారులకు సబ్సిడీ బియ్యం సరఫరాకు వీలుగా ఈ నిధుల కేటాయింపు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.7 కోట్లు అదనంగా కేటాయించారు. -
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల, వెలిగొండ, జీఎన్ఎస్ఎస్, నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు టన్నెల్, గండికోట టన్నెల్, పెన్నా, వంశధార పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందని, ప్రస్తుతం ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో ముందుగా చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌లపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: టీజీ వెంకటేశ్) ఏ ప్రాజెక్టుకు ఎంత నిర్మాణ వ్యయం అవుతుందనే వివరాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలుండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు సైతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా, బనకచర్ల అనుసంధానంపై ప్రణాళిక వివారాలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వీలైనంత తక్కువ ఖర్చులో ఎక్కువ లబ్ధి పొందేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (సీమ కరువుకు ‘రాయలసీమ’తో చెక్) -
వెలిగొండకు మళ్లీ వెలుగులు
-
ప్రాజెక్టుల బాటకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో (ఆన్ గోయింగ్) ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖకు దిశా నిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్షేత్ర స్థాయిలో వాటి పనులను తనిఖీ చేయడానికి శ్రీకారం చుట్టారు. తనిఖీ అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా గురువారం వెలిగొండ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. తనిఖీ అనంతరం ప్రాజెక్టు వద్దే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఆ ప్రాజెక్టు అధికారులు, సహాయ, పునరావాస విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తొలి దశను ఈ ఏడాది పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు 2009 వరకూ శరవేగంగా సాగాయి. ఆయన హఠాన్మరణంతో ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. వంశధార, తోటపల్లి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, చింతలపూడి ఎత్తిపోతల నుంచి గోదావరి డెల్టా, ఏలేరు ఆయకట్టు ఆధునికీకరణ దాకా అన్ని ప్రాజెక్టుల పనులు పడకేశాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (‘పవర్’ఫుల్ సెక్టార్) మూడు ప్రాధాన్యతల కింద వర్గీకరణ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన వ్యయం.. కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఆధారంగా (రూ.500 కోట్ల లోపు వ్యయంతో పూర్తి కావడం, కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యతగా వర్గీకరించారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయం.. కొత్తగా 20 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను ద్వితీయ ప్రాధాన్యతగా చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ రెండు విభాగాల్లోకి రాని ప్రాజెక్టులు తృతీయ ప్రాధాన్యత) 32 ప్రాజెక్టులను మూడు ప్రాధాన్యతల కింద జలవనరుల శాఖ అధికారులు వర్గీకరించారు. వాటిని పూర్తి చేయడానికి రూ.25,698 కోట్లు అవసరం అవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారులు నివేదించారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయడం ద్వారా 10,87,360 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 16,34,821 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టును 41.19 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేయడానికి రూ.11,379 కోట్లు.. 45.72 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేయడానికి రూ.31,825 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. పోలవరం మినహా మిగతా ప్రాజెక్టుల్లో.. తొలి ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.20,872 కోట్లు, ద్వితీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టులకు రూ.1,293 కోట్లు, తృతీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.3,533 కోట్లు అవసరం అవుతాయని వివరించారు. ఆ మేరకు నిధులు సమకూర్చుతామని.. శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పనులను ఈ నెల 27న సీఎం వైఎస్ జగన్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అక్కడే అధికారులతో సమీక్షించి దిశా నిర్ధేశం చేస్తారు. శరవేగంగా పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ - ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళిక అమలుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. - వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటి దాకా రూ.5,107 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.3,480 కోట్లు అవసరం. ఇది పూర్తయితే కొత్తగా 4,47,300 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 14,800 ఎకరాలను స్థిరీకరించవచ్చు. ఈ ప్రాజెక్టులో తొలి దశను ప్రథమ ప్రాధాన్యత కింద చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. - వంశధార ప్రాజెక్టు రెండవ స్టేజ్‌లో ఫేజ్–2కు ఇప్పటి దాకా రూ.1,575 కోట్లు వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.464 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టును తొలి ప్రాధాన్యత కింద పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. - తోటపల్లి ప్రాజెక్టుకు ఇప్పటి దాకా రూ.810 కోట్లు వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.201 కోట్లు అవసరం. ఇది పూర్తయితే అదనంగా 62,217 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. - తాడిపూడి ఎత్తిపోతల పథకానికి ఇప్పటిదాకా రూ.586 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.380 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. కొత్తగా 41,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ఈ ప్రాజెక్టును ద్వితీయ ప్రాధాన్యత కింద పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. - గోదావరి డెల్టా ఆధునికీకరించకపోవడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. సమృద్ధిగా గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా చివరి ఆయకట్టు భూములు నీళ్లందక ఎండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆధునికీకరణ పనులు పూర్తయితే డెల్టాలో 10,13,161 ఎకరాల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చు. డెల్టా ఆధునికీకరణకు ఇప్పటిదాకా రూ.1,595.29 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు పూర్తి కావాలంటే రూ.1,379 కోట్లు అవసరం. వీటిని తృతీయ ప్రాధాన్యత కింద పూర్తి చేయడానికి జల వనరుల శాఖ చర్యలు చేపట్టింది. ఏలేరు, పెన్నా, కృష్ణా డెల్టాల ఆధునికీకరణ పనులను ఇదే రీతిలో పూర్తి చేయాలని నిర్ణయించింది. జూలై నాటికి వెలిగొండ తొలి దశ శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 11,581.68 క్యూసెక్కుల (328 క్యూమెక్కులు) చొప్పున 43.50 టీఎంసీలను తరలించి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. అప్పటి నుంచి 2019 మే 29 వరకు రెండు సొరంగాల్లో మిగిలిన పనులు.. నల్లమలసాగర్ ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించడం, 2,884.13 ఎకరాల భూసేకరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రక్షాళన చేయడంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పనులకు ‘రివర్స్ టెండరింగ్’ నిర్వహించి, రూ.61.76 కోట్లను ఖజానాకు మిగిల్చారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి ఈ ఏడాది తొలి దశను పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతో పనులు వేగం పుంజుకున్నాయి. మొదటి సొరంగంలో రోజుకు 6.45 మీటర్ల చొప్పున పనులు చేస్తున్నారు. మరో వెయ్యి మీటర్ల మేర సొరంగం పనులు చేయాలి. ఈ పనులు జూలై 15 నాటికి పూర్తవుతాయి. శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాలకు నీళ్లు చేరాలంటే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 865.1 అడుగుల్లో 122.718 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. జలాశయంలో నీటి మట్టం 840 అడుగులకు తగ్గితేగానీ హెడ్ రెగ్యులేటర్ పనులు చేపట్టలేని పరిస్థితి. మార్చి 15 నాటికి జలాశయం నీటి నిల్వ తగ్గనుంది. అప్పటి నుంచి వరద ప్రారంభమయ్యేలోగా హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. వచ్చే సీజన్లో నల్లమలసాగర్‌కు నీరు నల్లమలసాగర్ నిర్వాసితుల పునరావాసానికి, భూసేకరణకు రూ.1,220 కోట్లు, తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.534 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వచ్చే సీజన్లో కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరి, నీటి మట్టం 840 అడుగులకు చేరుకోగానే మొదటి సొరంగం ద్వారా రోజుకు 85 క్యూమెక్కులు(3001.35 క్యూసెక్కులు) చొప్పున తరలించి.. నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని సర్కార్ నిర్ణయించింది. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన రూ.1,880.16 కోట్లను 2020–21, 2021–22 బడ్జెట్లలో కేటాయించనుంది. -
రాయచోటిపై సీఎం జగన్ వరాల జల్లు
-
'రివర్స్'పై పారని కుట్రలు!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తమ దోపిడీ బండారం బట్టబయలవుతుందనే భయంతో ‘రివర్స్ టెండరింగ్’ను అడ్డుకునేందుకు మాజీ సీఎం చంద్రబాబు రకరకాల కుట్రలకు తెర తీస్తున్నారు. పోలవరం పనులకు నిర్వహించిన రెండు టెండర్లలో ఆయన పాచికలు పారకపోవడంతో తాజాగా వెలిగొండ రెండో టన్నెల్ ‘రివర్స్ టెండరింగ్’ను నీరుగార్చడానికి కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి పోలవరం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లే ‘రివర్స్ టెండరింగ్’లో తక్కువ ధరకు కోట్ చేస్తూ బిడ్లు దాఖలు చేసేందుకు ముందుకు రావడంతో బెంబేలెత్తిన చంద్రబాబు వారితో పలు దఫాలు సుదీర్ఘంగా రాయబారాలు జరిపారు. ఒక పనికి గతంలో అధిక ధరకు కోట్ చేసిన వారు ఇప్పుడు తక్కువ ధరకు కోట్ చేస్తూ బిడ్ దాఖలు చేస్తే ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేస్తుందంటూ బెదిరింపులకు దిగారు. రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనవద్దని ఆయా సంస్థలను హెచ్చరించారు. అయితే ఆయన ఎత్తుగడలు విఫలమయ్యాయి. తన అక్రమాలు రుజువులతో నిరూపితం అవుతుండటం వల్ల తన రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే ఆందోళనతో ఈ కుట్రలకు తెర తీసినట్లు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లకు బెదిరింపులు.. పోలవరం 65వ ప్యాకేజీ పనులకు రూ.274.25 కోట్ల అంచనా వ్యయంతో ఆగస్టు 17న రివర్స్ టెండరింగ్ విధానంలో మొదటి నోటిఫికేషన్ జారీ అయింది. టీడీపీ హయాంలో ఈ పనులను 4.77 శాతం అధిక ధరలకు మ్యాక్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. ఆ సంస్థతోపాటు మరో ఐదుగురు కాంట్రాక్టర్లు రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపారు. ఇది పసిగట్టిన చంద్రబాబు తన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతో మ్యాక్స్ ఇన్ఫ్రా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తక్కువ ధరకు బిడ్ దాఖలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెడుతుందని భయపెట్టారు. మిగతా కాంట్రాక్టు సంస్థలతోనూ ఇదే రీతిలో సంప్రదింపులు జరిపారు. పోలవరం హెడ్‌వర్క్స్‌కు రివర్స్ టెండరింగ్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ వ్యతిరేకిస్తోందని.. జలవిద్యుత్ కేంద్రం రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోందని.. బిడ్లు దాఖలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విష ప్రచారం చేయడం ద్వారా కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను నమ్మించే యత్నం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుండటం, అవినీతి నిర్మూలనకు నడుం బిగించడం, లాలూచీలకు తావులేకపోవడంతో చంద్రబాబు, టీడీపీకి చెందిన మాజీ మంత్రుల సూచనలను వారు తోసిపుచ్చారు. బట్టబయలైన అక్రమాలు.. రూ.841.33 కోట్లు ఆదా పోలవరం 65వ ప్యాకేజీ పనులను గతంలో 4.77 శాతం అధిక ధరలకు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థే ఈసారి రివర్స్ టెండరింగ్‌లో 15.6 శాతం తక్కువ ధరకు చేజిక్కించుకుంది. దీనివల్ల ఖజానాకు రూ.58.53 కోట్లు ఆదా అయ్యాయి. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం టెండర్లలో మేఘా సంస్థ 12.6 శాతం తక్కువ ధరలకు పనులు దక్కించుకుంది. దీనివల్ల ఖజానాకు మరో రూ.782.8 కోట్లు ఆదా అయ్యాయి. వెరసి రెండు రివర్స్ టెండర్లలో రూ.841.33 కోట్ల మేరకు ప్రజాధనం ఆదా అయింది. ఈ రెండు రివర్స్ టెండర్లు చంద్రబాబు అక్రమాలను బహిర్గతం చేశాయి. రివర్స్ టెండరింగ్‌తో భారీగా ప్రజాధనం ఆదా అవుతుండటం, తన అక్రమాలు బయటపడటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా వెలిగొండ రెండో టన్నెల్ పనులకు రూ.528.35 కోట్లతో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ టెండర్‌ను నీరుగార్చేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం రివర్స్ టెండర్లతో నష్టం టీడీపీ నేతల సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్య రాజకీయ దురుద్దేశంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండర్ పేరుతో టెండర్‌ను రిజర్వ్ చేశారన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రివర్స్ టెండర్ల వల్ల రాష్ట్రానికి లాభం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల ప్రజలకు జరిగే నష్టం ఎంతో చెప్పాలన్నారు. అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు భద్రతతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు హైడల్ వర్క్స్, పవర్ హౌస్ పనులు రెండింటిని ఎందుకు కలిపారని, సీవీసీ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు. గతంలో ఇదే సంస్థ పోలవరం పనుల్లో టెండర్ ఎక్కువకు వేసిందని, అప్పుడు ఇదే మేఘా తన బినామీ అని, పట్టిసీమలో దానికి రూ. 350 కోట్లు దోచిపెట్టానని విమర్శించారని చెప్పారు. గతంలో పనిచేసిన సంస్థలకు నష్ట పరిహారం కింద ఎన్ని వందల కోట్లు చెల్లిస్తారని ప్రశ్నించారు. పోలవరం పనుల్లో తక్కువకు టెండర్ వేయడం ద్వారా నాసిరకం పనులు చేస్తారా, లేక వాళ్లకు వేరే విధంగా లబ్ధి చేకూరుస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. -
సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని సహించను
‘సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఆయకట్టుకు నీళ్లందించి.. రైతుల మోముపై చిరునవ్వు నింపి.. పేదరికాన్ని నిర్మూలించడమే. తక్షణమే పూర్తయ్యే ప్రాజెక్టుల పనులపై దృష్టి పెట్టండి.. జిల్లాల వారీగా ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించండి. కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: బంజరు భూములను సస్యశ్యామలం చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతి, అక్రమాలను సహించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు.. మీపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను భారీగా పెంచేయించారు. ఎక్కువ కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి భారీ ఎత్తున దోచుకున్నారు. ఆ అవినీతి మచ్చ మీపై పడేలా చేశారు.. దీనివల్లే రాష్ట్ర ఖజానాపై భారీగా భారం పడింది. ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగిందన్న సమాచారం నా వద్ద ఉంది.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.. ఈ నెల 6న నిర్వహించే సమావేశానికి ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగిందో తెలియజెప్పేలా వాస్తవ వివరాలతో రండి.. ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం.. దీనివల్ల ఎంత ప్రజాధనం ఆదా అయ్యిందన్నది ప్రజలకు వివరిస్తాం.. ఈ ధనం ఆదా కావడానికి కారణమైన అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తాం.. ఆదా చేసిన సొమ్ముతో కొత్త ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి దోహదం చేయండి’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రూ.1,57,770 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయని, ఇందులో ఇప్పటివరకూ రూ.62,251 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సీఎంకు వివరించారు. మిగతా పనులు పూర్తి కావాలంటే రూ.95,519 కోట్లు అవసరమని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో రూ.10,704 కోట్ల విలువైన పనులను ప్రారంభించలేదన్నారు. రూ.7,302.56 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయినా.. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. పనులు ప్రారంభించి 25 శాతం లోపు పనులు పూర్తయిన ప్రాజెక్టుల పనుల విలువ రూ.22,880.44 కోట్లని.. వీటికి రూ.1,191.15 కోట్లు వ్యయం చేశామని.. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.21,681.30 కోట్లు అవసరమని వివరించారు. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పనులను అవినీతిమయం చేశారన్నారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం ఎంత? సెప్టెంబర్ 2, 2009 వరకూ ఏయే ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? ఎంత పరిమాణం మేర పనులు పూర్తయ్యాయి? ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ సీఎంల హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు.. ఎంత పరిమాణం మేర పనులు పూర్తయ్యాయి? 2014 నాటికి ఏయే ప్రాజెక్టుల్లో ఎంత పరిమాణం పనులు మిగిలాయి? వాటి వ్యయం ఎంత? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని ఏయే ప్రాజెక్టుల్లో ఎంతకు పెంచేశారు? ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారు.. ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి? ఇప్పటికీ ఎంత పరిమాణం మేర పనులు మిగిలాయి.. వాటి విలువ ఎంత?’ అనే వివరాలతో సమగ్ర నివేదికను ఈ నెల 6 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడకుండా నిజాయతీతో వ్యవహరించి ఉంటే కొన్ని ప్రాజెక్టులైనా పూర్తయ్యేవని, ఆయకట్టుకు నీళ్లందేవని, రైతులకు ప్రయోజనం చేకూరేదని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి, యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టీకరించారు. యుద్ధప్రాతిపదికన పోలవరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఏప్రిల్ 1, 2014కు ముందు పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశామని.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక అంటే ఏప్రిల్ 1, 2014 తర్వాత రూ.11,537.30 కోట్లు ఖర్చు చేశామని.. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసిందని.. రూ.4,810.04 కోట్లు ఇంకా బకాయిపడిందని ఈఎస్సీ ఎం.వెంకటేశ్వరరావు సీఎంకి వివరించారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టుకు రూ.16,673.17 కోట్లు ఖర్చు చేశామని.. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.38,875.7 కోట్లు అవసరమని చెప్పారు. ఇదే సమయంలో సీఎం జోక్యం చేసుకుంటూ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,010.45 కోట్ల నుంచి రూ.55,548.87 కోట్లకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వల్ల అంచనా వ్యయం పెరిగిందని ఈఎన్సీ వెంకటేశ్వరరావు వివరించారు. ‘పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రధానంగా పోలవరం హెడ్ వర్క్స్‌లో ఏయే కాంట్రాక్టర్లకు ఎంత విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించారు? చంద్రబాబు ఒత్తిడి వల్ల ఎంత అంచనా వ్యయం పెంచేశారు? రివర్స్ టెండరింగ్ చేస్తే ఎంత ఆదా అవుతుందన్న వివరాలను ఈ నెల 6లోగా సిద్ధం చేయండి’ అని సీఎం ఆదేశించారు. ‘పోలవరం రాష్ట్రానికి వరప్రదాయిని. ఆ ప్రాజెక్టు పనులు ఆగడానికి వీల్లేదు. ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చో చెప్పండి.. చంద్రబాబు తరహాలో ఇప్పుడు పూర్తి చేస్తాం.. అప్పుడు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పకూడదన్నది నా ప్రధాన ఉద్దేశం’ అని దిశానిర్దేశం చేశారు. దీనిపై ఈఎస్సీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. హెడ్ వర్క్స్‌లో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి కాఫర్ డ్యామ్‌ల పనులు చేస్తున్నామని చెప్పారు. అయితే, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు ఈ సీజన్లో పూర్తి చేయలేమని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనల మేరకు నిలిపేశామని వివరించారు. వచ్చే సీజన్లో కాఫర్ డ్యామ్ పూర్తి చేసి.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపడతామని తెలిపారు. మొత్తమ్మీద రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇప్పటివరకూ చేసిన కాఫర్ డ్యామ్ పనులు వరదకు కొట్టుకుపోకుండా, వరద ఉధృతికి ఒక్క నిర్వాసితుడూ ఇబ్బంది పడకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వారంలోనే పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టిసారిస్తానన్నారు. కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం.. ఆయకట్టుకు నీళ్లందించడమేనని, రైతుల మోముపై చిరునవ్వు చిందేలా చేసి పేదరికాన్ని నిర్మూలించడమేనని సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరించారు. కానీ.. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యాన్ని మార్చేసిందని.. చంద్రబాబు జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులను వినియోగించుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ లక్ష్యం సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమేనని స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యయం, మిగిలిపోయిన పనుల ప్రాతిపదికన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో చేపడదామన్నారు. 6న నిర్వహించే సమావేశానికి ప్రాధాన్య ప్రాజెక్టుల వివరాలతో రావాలని కోరారు. జిల్లాల వారీగా ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించడంతోపాటు ఎంత ఖర్చు చేస్తే ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చో తెలుసుకోవాలన్నారు. యుద్ధప్రాతిపదికన ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని అరికడితే.. ఆదా అయ్యే సొమ్ముతో కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చునని.. కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ముఖ్యమంత్రి కార్యదర్శి సొల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, విశ్రాంత సీఎస్ అజేయ కల్లం తదితరులు పాల్గొన్నారు. కాగా, నీటిపారుదల శాఖపై సమీక్ష సమావేశం జరుగుతుండగానే బయట వర్షం కురిసింది. నిన్న మొన్నటివరకు తీవ్ర సూర్య తాపంతో ప్రజలను అల్లాడించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సీఎం వైఎస్ జగన్ సోమవారం నీటిపారుదల అంశంపై సమీక్ష ప్రారంభించిన సమయం నుంచే అందుకు తగ్గట్లుగా వాతావరణం అనుకూలించడం విశేషం. గోదావరి జలాలతోనే సస్యశ్యామలం కృష్ణా నదిపై కర్ణాటక సర్కార్ ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుతోందని.. దీనివల్ల నీటి లభ్యత మరింతగా తగ్గుతుందని సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. గోదావరి నదిలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్న అంశాన్ని గుర్తు చేశారు. ‘ఏటా మూడు నుంచి నాలుగు వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. పోలవరం పూర్తయినా గరిష్టంగా 301 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవచ్చు. గోదావరి జలాలను వృథా కానివ్వకుండా వినియోగించుకుంటే.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చు.. రాష్ట్రమే కాదు తెలంగాణను కూడా సస్యశ్యామలం చేయొచ్చు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే తెలంగాణ ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు మళ్లించడానికి కూడా సిద్ధమని కేసీఆర్ మాట ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ గోదావరి జలాల మళ్లింపుపై ఏవైనా చర్యలు తీసుకున్నారా’ అని ప్రశ్నించారు. దీనిపై ఈఎన్సీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. గోదావరి–పెన్నా నదుల అనుసంధానంపై వ్యాప్కోస్‌తో అధ్యయనం చేయించామన్నారు. ఈ క్రమంలోనే పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి.. హరిశ్చంద్రపురం ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్ కుడి కాలువకు తరలించే పనులు చేపట్టామని.. ఎన్జీటీ తీర్పు వల్ల వాటిని ఆపేశామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాలను బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా నెల్లూరు జిల్లాలోని పెన్నా డెల్టాకు తరలించడంపై అధ్యయనం చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. గోదావరి జలాలను తక్కువ ఖర్చుతో భారీ ఎత్తున వినియోగించుకోవడానికి మార్గాలను అన్వేషించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించడంపై అధ్యయనం చేసి.. నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా గోదావరి జలాల వినియోగంపై దృష్టి కేంద్రీకరిద్దామని సూచించారు. బిజీబిజీగా సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం ఎస్ఎల్బీసీ కన్వీనర్ కేవీ నాంచారయ్య, బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబుతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులు సీఎంను కలిశారు. అనంతరం ఉదయం 10.38 గంటలకు వైద్య శాఖపై సమీక్ష ప్రారంభించి మధ్యాహ్నం 12.55 గంటలకు ముగించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీటిపారుదల శాఖపై సమీక్ష ప్రారంభించి సాయంత్రం వరకు కొనసాగించారు. అనంతరం గుంటూరులో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. -
రైతులందరికీ ప్రాజెక్టుల ఫలాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు రైతులందరికీ అందాలని, అందుకు సమర్థ నీటి యాజమాన్యం అవసరమని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఓపెన్ కాల్వలకు బదులు పైపుల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ అత్యుత్తమమైనదని వివరించారు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల రీ ఇంజనీరింగ్ అంశంపై శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం పరి శోధకులు, అధ్యాపకులతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెంగాణ నీటిపారుదల రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల రీఇంజనీరింగ్ చేపట్టారని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సమర్థ నీటి యాజమాన్య పద్ధతులు గురించి రైతాంగంలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ఎక్కడ ఏ సమావేశానికి వెళ్లినా మన సీఎం కేసీఆర్, ఆయన నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, రైతుబంధు తదితర వాటి గురించే మాట్లాడుతున్నారని వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర జలసంఘం చైర్మన్ రాజేంద్రసింగ్, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్, డాక్టర్ జగదీశ్వర్, డి.వసంత్‌కుమార్, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాను వినియోగించుకునేలా వ్యూహం రూపొందించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీరు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇచ్చారని.. ప్రజలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రస్తుత పదవీకాలంలో అన్ని ప్రాజెక్టులు నూటికి నూరుశాతం పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలు ఇందుకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరిస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంతోపాటు పరిశ్రమలకు, తాగునీటికి ఎంత నీరు అవసరమో లెక్కగట్టి, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వాడాలో నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో మొదట చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ఏ ప్రాంతంలో అయినా ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఆలస్యమైనా చెరువులు నింపడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిందేనన్నారు. ఆ ఆశతోనే ఓటేశారు సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పనులను స్వయంగా సందర్శించి వచ్చిన రిటైర్డు ఇంజనీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై రిటైర్డు ఇంజనీర్ల బృందం కేసీఆర్‌కు వివరాలు అందించింది. ఈ సందర్భంగా ఎక్కడ ఏ లోపం ఉందో చర్చించి, అక్కడికక్కడే లోపాన్ని సవరించడానికి అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతున్నచోట, జాప్యానికి కారణాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపారు. అవసరమైతే పనుల్లో నిర్లక్ష్యం వహించే వర్క్ ఏజెన్సీ(కాంట్రాక్లర్లు)ని మార్చాలని సీఎం ఆదేశించారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాల తరబడి పోరాడారు. ప్రాణాలు అర్పించారు. రాష్ట్రం సాధించుకున్నారు. తెలంగాణ వస్తే సాగునీరు వస్తుందని ఆశ పడ్డారు. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించే పనులు చేపట్టాం. అన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, విశ్వసనీయతను ప్రజలు గుర్తించారు. ఈ ప్రభుత్వంతోనే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు నమ్మారు. 75% మంది ఇదే ఆశతోనే టీఆర్ఎస్కు మళ్లీ ఓటు వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాం. వలసలు పోయిన వారు వాపస్ వచ్చారు. ఈ పరిస్థితి చూసే అక్కడి ప్రజలు 13 సీట్లలో టీఆర్ఎస్ను గెలిపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణలో కోటి ఎకరాల్లో నీరు పారించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఐదేళ్ల పూర్తి సమయం మనకుంది. రాజకీయ సుస్థిరత ఉంది. నిధులకు కొరతలేదు. రైతులకు సాగునీరు అందివ్వడమే ధ్యేయంగా పనిచేయడానికి పునరంకితమవుదాం. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో ముందుగా చెరువులు నింపాలి. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ఉపయోగించుకుని చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలి. సాగునీటితోపాటు, తాగునీటికి ఎంత నీరు అవసరమవుతుందో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు తయారు చేసి నీటి కేటాయింపు జరపాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. నీటి వాటాను వదులుకోవద్దు ‘గోదావరి నీటిలో తెలంగాణకు 950 టీఎంసీల వాటా ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఇది ఖరారైంది. దీని ప్రకారమే మనం గోదావరిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలి. హైదరాబాద్‌కు తాగునీరు అందించాలి. ఇదే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది ఎండాకాలంలోనే పనులన్నీ పూర్తి చేసి వర్షాకాలంలో ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు చెరువుల ద్వారా పొలాలకు చేరాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, అన్నా రం, సుందిళ్ల పంపుహౌసుల నిర్మాణం పూర్తి కావాలి. ఎల్లంపల్లి, మిడ్ మానేరు దాకా నీళ్లు రావాలి. మేడిగడ్డ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల చొప్పున నీరు తీసుకోవాలి. మూడు బ్యారేజీలతో 36 టీఎంసీల నీరు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీరు నదిలోనే అందుబాటులో ఉంటాయి. వచ్చిన నీటిని వచ్చినట్లు పంపు చేసి చెరువులకు మళ్లించాలి. ఎల్లంపల్లి దాకా వచ్చిన నీటిలో ఒక టీఎంసీని మిడ్ మానేరుతో శ్రీరాంసాగర్ కాల్వలకు మళ్లించాలి. మరో టీఎంసీ నీళ్లను మల్లన్నసాగర్ వైపు మళ్లించాలి. మల్లన్నసాగర్‌తో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్‌కు తరలించాలి. మల్లన్నసాగర్‌తోనే హైదరాబాద్ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న 10 టీఎంసీల రిజర్వాయర్‌కు నీరు పంపాలి. హల్ది వాగుతో నిజాంసాగర్, ఘనపురం ఆయకట్టుకు సాగునీరు అందించాలి. గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువులు నింపాలి. వీటి నుంచి క్రమం తప్పకుండా నీటిని విడుదల చేస్తూ మూసీ మురికిని వదిలించాలి. మూసీ రివర్ ఫ్రంట్‌ను అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేస్తాం. దానికీ గోదావరి నీళ్లు అందాలి. చివరికి మూసీ నది నీళ్లతో ఉమ్మడి నల్గొండ జిల్లా పొలాలకు నీరు చేరాలి’అని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి వివరించారు. దేవాదులపై సమీక్ష ‘గోదావరి నదిపై నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని ఉపయోగించుకోవడానికి బ్యారేజీ కడుతున్నాం. ఏడాదికి 75 టీఎంసీలకు పైగా నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న డిజైన్లు, కాల్వలు, ఇతర నిర్మాణాలు పెద్దగా ఉపయోగపడేలా లేవు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదులతో నీరందించాలి. పాకాల, రామప్ప, గణపురం, లక్నవరం చెరువులను నింపాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నిర్మించి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాలకు నీరివ్వాలి. దీనికోసం మొత్తం ప్రాజెక్టును సమీక్షించి కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలి. దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలి. మే నెలలోనూ దుమ్ముగూడెం వద్ద గోదావరి నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలి. బయ్యారం వరకు నీటిని తీసుకురావాలి. ఎస్సారెస్పీ ఆయకట్టుకూ నీరందాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశం ప్రశంసించింది ‘తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. సాగునీటి రంగంలో వివక్షకు గురైంది. అందుకే ఇక్కడి ప్రజలు పోరాటం చేశారు. తెలంగాణలో ఓ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి అని ప్రధానికి అనేకసార్లు చెప్పాను. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.20–30 వేల కోట్లు ఇచ్చి సాయపడండి అని వేడుకున్నా. అయినా ప్రధాని నిధులు ఇవ్వలేదు. మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరిస్తున్న తీరును చూసి దేశమంతా మెచ్చుకున్నది. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వరంగల్ జిల్లా నెక్కొండ చెరువులో పుట్టినరోజు చేసుకుని మిషన్ కాకతీయ పనులను మెచ్చుకున్నారు. దేశమంతా ప్రశంసించింది. నీతి ఆయోగ్ కూడా మిషన్ కాకతీయ గొప్ప పథకమని చెప్పింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ.24 వేల కోట్లివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయినా.. నరేంద్ర మోదీ రూ.24 కూడా ఇవ్వలేదు. ఈసారి కేంద్రంలో మనది క్రియాశీల పాత్ర ఉంటుంది. కావాల్సిన నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు బాగుంది. మొదటి నాలుగేళ్లలో 17.17% వృద్ధిరేటు ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 29.17% వృద్ధి రేటు నమోదైంది. నిధులకు కొరతలేదు. ప్రాజెక్టులు కట్టుకోవడమే మన లక్ష్యం’అని చెప్పారు. పాలమూరు వేగం పెంచండి ‘ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి (ప్రస్తుత వికారాబాద్) జిల్లాలకు సాగునీరు అందివ్వడానికి ఉద్దేశించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వేగం పెరగాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల్లో ప్రభుత్వంపై ఎంతో నమ్మకం వచ్చింది. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలి. శ్రీశైలం వనరుల నుంచి నుంచి 70 టీఎంసీల వరకు తీసుకునే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టును ఆ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. దీంతో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నంత వేగంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం సాగాలి. అవసరమైన నిధులను ఈ బడ్జెట్లోనే కేటాయిస్తాం’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు మురళీధర్‌రావు, అనిల్‌కుమార్, హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసరెడ్డి, బి.శంకర్, కె.బంగారయ్య, వి.సుధాకర్, వి.నరసింహ, ఆర్.మధుసూదన్‌రావు, వి.రమేశ్, టి.ఖగేందర్, రిటైర్డు ఇంజనీర్లు శ్యాం ప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకటరామారావు, వేణుగోపాలరావు, రాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటేశం, సత్తిరెడ్డి, రమణ నాయక్, ఎస్.ముత్యంరెడ్డి, జగదీశ్వర్, జియావుద్దీన్, ఇంద్రసేనారెడ్డి, కెప్టెన్ జనార్దన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఏమిటీ జాప్యం?
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలి. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగట్లేదు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణాలు వేగవంతం కావాలి. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా యుద్ధప్రాతి పదికన పనులు చేయాలని పేర్కొన్నారు. సీతారామ, శ్రీరామ్ సాగర్, దేవాదుల పునరుజ్జీవం పథ కం పనులు మందకొడిగా నడుస్తుండటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యాన్ని సహిం చేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని, ఇందుకోసం అవసర మైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మా ణాన్ని స్వయంగా పరిశీలించేందుకు స్వయంగా రెండు రోజులపాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నా రం బ్యారేజీలు, పంపుహౌస్‌లను మంగళవారం ఆయన సందర్శించనున్నారు. అనంతరం మరో రోజు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో నిర్మి స్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో శనివారం ఏడు గంటలపాటు సమీక్షించారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టిన నిర్మా ణాలపై కూలంకషంగా చర్చించి అధికారులకు తగు సూచనలు చేశారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఎంపీ బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములకు తక్షణమే పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి రూ. 80 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు స్పష్టం చేశారు. భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పారు. ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాలువలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఆఫ్ టేక్ (ఓటీ) తూముల ద్వారా అన్ని చెరువులకు నీరందించాలి. కాకతీయ కెనాల్–ఫ్లడ్ ఫ్లో కెనాల్ మధ్యనున్న ఆయకట్టుకంతా నీరందించేలా ఈ ప్రాంతంలోని అన్ని చెరువులు నింపాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలి... ‘తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలి. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగట్లేదు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణాల్లో వేగం పెరగాలి’అని కేసీఆర్ ఆదేశించారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను సందర్శిస్తానని సీఎం చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు, శ్రీరామ్‌సాగర్ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదని సీఎం అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ. 11 వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. వర్క్ ఏజెన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులను మేకల్లా పూర్తి చేస్తామని వర్క్ ఏజన్సీలు సీఎంకు మాటిచ్చాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సింగూరు కింద రెండు ఎత్తిపోతలు.. సింగూరు కింద రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలల చొప్పున నీరందరించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కౌలాస్ నాలాను పటిష్టం చేయడంతోపాటు నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని చెప్పారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. -
‘సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయండి’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన సాయం చేయాలని ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రకృతి విపత్తుల అంశంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడా రు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో సంక్షేమ చర్యలు చేపట్టిందని, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్ధరిస్తోందన్నారు. -
కేటాయింపులేవీ?
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. 2018–19 బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరే ఇందుకు నిదర్శనం. మూడేళ్ల క్రితం ఎంపిక చేసిన 20 ప్రాధాన్య ప్రాజెక్టులను 2018 జూన్‌లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 2019 నాటికి మరో 20 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాదే నాగార్జునసాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించి గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశను పూర్తి చేస్తామని గొప్పలు పోయారు. కానీ, గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే సర్కారు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. ఇలాగైతే పూర్తయ్యేదెలా? బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,978.22 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.15,620.76 కోట్లను మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులకు, రూ.905.05 కోట్లను ఏపీఎస్ఐడీసీకి(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ), రూ.452.41 కోట్లను చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించారు. గత బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,770 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో 33 శాతం అధికంగా నిధులు ఇచ్చామని ప్రకటించారు. కానీ, ఇందులో పోలవరంతోపాటు పీఎంకేఎస్‌వై కింద ఏడు ప్రాజెక్టులకు కేంద్రం రూ.9,000 కోట్లకుపైగా ఇస్తుందని బడ్జెట్లో చూపారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి రూ.7,978.22 కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కూడా అధిక శాతం ఏపీడబ్ల్యూఆర్డీసీ(ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా రుణంగా సేకరించాలని నిర్ణయించింది. కేంద్రం రూ.9,000 కోట్లు ఇస్తుందని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, కేంద్రం ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అలాగే ఏపీడబ్ల్యూఆర్డీసీ సేకరించే రుణం కూడా రూ.3,000 కోట్లకు మించదు. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎలా ముందుకు సాగుతాయో ప్రభుత్వానికే తెలియాలి. మాటల్లోనే ఆర్భాటం.. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తి కావాలం టే రూ.350 కోట్లు అవసరం. కానీ, బడ్జెట్లో రూ. 250 కోట్లే కేటాయించారు. మహేంద్ర తనయ రిజ ర్వాయర్కు రూ.400 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో 80 కోట్లే విదిల్చారు. ఈ రెండు ప్రాజెక్టులను ఈ ఏడాదే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల కేటయింపులను పరిశీలిస్తే పూర్తయ్యే అవకా శాలు కనిపించడం లేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, పెంచిన అంచనా వ్యయం మేరకు కనీసం రూ.2,000 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 334.05 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ నిధులు కాంట్రాక్టర్లకు బకాయిలకే సరిపోవు. హంద్రీ–నీవా రెండో దశను ఈ ఏడాదే పూర్తి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. నిధుల కేటాయింపులో మాత్రం ఆ ఆర్భాటం చూపలేదు. ఈ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు అవసరం కాగా, రూ.663.75 కోట్లే కేటాయించారు. అత్తెసరు నిధులేనా? పీఎంకేఎస్‌వై కింద కేంద్రం నిధులు విడుదల చేస్తేనే పుష్కర, గుండ్లకమ్మ, తోటపల్లి, ముసురుమిల్లి, తాటిపూడి, ఎర్రకాల్వ ప్రాజెక్టు పూర్తవుతాయి. వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపకుండా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తే పైసా కూడా వచ్చే అవకాశం ఉండదు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే మరో రూ.1,100 కోట్లు అవసరం. బడ్జెట్లో కేవలం రూ.400 కోట్లు కేటాయించారు. మహాసంగమం ప్రస్తావనేదీ? గోదావరి–పెన్నా మహాసంగమం తొలి దశను రూ.4617 కోట్లతో ఈ ఏడాదే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బడ్జెట్లో ఆ పథకానికి పైసా కూడా ఇవ్వలేదు. రాజధానిలో తాగునీటి అవసరాల కోసం 1998 కోట్లతో వైకుంఠపురం బ్యారేజీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ప్రకటించినా.. బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అనంతపురం జిల్లాలో భైరవాని తిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, ఎగువ పెన్నా(అప్పర్ పెన్నార్) ఎత్తిపోతల పథకాలకు రూపాయి కూడా కేటాయించలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాదే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్ నిధులు వెనక్కే నాగార్జునసాగర్ ఆధునికీకరణ కోసం నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు రూ.800 కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, బడ్జెట్లో రూ.60.87 కోట్లే విదిల్చింది. ఈ లెక్కన ప్రపంచ బ్యాంక్ నిధులు వెనక్కి వెళ్లడం ఖాయమే. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణకు రూ.500 కోట్లు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.233.94 కోట్లను మాత్రమే కేటాయించింది. కృష్ణా, గోదావరి డెల్టా ఆధునికీకరణ, ఏలేరు ఆధునికీకరణలకు అరకొరగానే నిధులు కేటాయించింది. -
ప్రాజెక్టుల టెండర్లలో భారీ అక్రమాలు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన పనుల టెండర్ అర్హతలను రూపొందించడంలోనే కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారన్నారు. టెండర్లు, ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 25 వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఆహ్వానించారని, ఈ ఉత్తర్వులను ఉంచాల్సిన వెబ్‌సైట్‌ను నిలిపివేశారని అన్నారు. పాములపర్తి జలాయశం పనుల విషయంలోనూ గతంలో రూ.659 కోట్ల పనులను ఏకంగా రూ.3007కోట్లకు పెంచారని, వాటికి ఎలాంటి టెండర్లూ లేకుండా పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో పనులను అప్పగించారన్నారు. ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలం... రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో రైతు సమస్యలపై సమావేశం జరిగింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు రేణుకాచౌదరి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పంటల బీమా పథకం-2016, పత్తిపంటకు మద్దతు ధర, ఆహార పంటల జన్యుమార్పిడి, కరువు మండలాల ప్రకటన, ఎండిన పంటలకు నష్టపరిహారం, రైతుల ఆత్మహత్యలు, పరిహారం, పంటరుణాల మాఫీ వంటి సమస్యలపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల పేర్లు మార్చడాన్ని ఈ సమావేశం ఖండించింది. -
జనవరి నుంచి కొత్త ప్రాజెక్టుల పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించేలా అధికారులు సిద్ధం కావాలని మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ, భూసేకరణ, సహాయ పునరావాసం వంటి వాటినన్నింటినీ పూర్తిచేసి జనవరిలో పనులు ప్రారంభించాలని సూచించారు. గురువారం సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) కార్యాలయంలో ప్రాజెక్టుల వారీగా అధికారులతో మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రాణహితలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణంపై స్పష్టత రావడంతో అక్కడ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి కోసం ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు భూసేకరణ సర్వేలో రెవెన్యూశాఖ సహకరించడం లేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. వెంటనే రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషికి హరీశ్‌రావు సూచించారు. ఫిబ్రవరి రెండో వారానికి పాలమూరు టెండర్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటే మారిన ప్రణాళికకు అనుగుణంగా డిండి ఎత్తిపోతల సర్వే, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్ అంచనాలకు అనుగుణంగా డీపీఆర్ సైతం త్వరగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దుమ్ముగూడెంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.