ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ఉన్న రూ.2,087 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ని కోరగా రూ.711 కోట్ల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్సు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. బిల్లుల స్క్రూటినీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరాల్సి రావడం, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి కారణాలవల్ల బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.
పోలవరం నిర్మాణంలో ఇరిగేషన్ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుందని, వాటిని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపుతారని తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు అనుమతి లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్ మార్కెట్ నుంచి సేకరిస్తుందని పేర్కొన్నారు. ఆ నిధులు నాబార్డ్ నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి, అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయని చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు పరిమళ్ నత్వానీ, అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.11,600.16 కోట్లు తిరిగి చెల్లించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2019 మే నుంచి ఇప్పటివరకు రూ.4,836 కోట్లు చెల్లించినట్లు టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.
ఏపీలో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులు
ఏపీలోని 13 జిల్లాల్లో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించామని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వీధి వ్యాపారుల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం దేశంలో ఎంపిక చేసిన 125 మునిసిపాలిటీల్లో ప్రధానమంత్రి స్వానిధి సే సమృద్ధి పథకాన్ని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా పీఎం స్వానిధి పథకం కింద ఎంపిక చేసిన వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు చెప్పారు. ఎగుమతుల విషయంలో దేశంలోని చిన్న, మధ్యతరగతి సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు అందలేదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నారాయణ రాణే చెప్పారు.
గెజిట్ నోటిఫికేషన్ అమలు పనులు ప్రారంభం
గెజిట్ నోటిఫికేషన్‌ను అమలుచేసే పనిని గోదావరి, కృష్ణా బోర్డులు ఇప్పటికే ప్రారంభించాయని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకంగా నీటి విడుదలను నిలిపేయాలని తాజాగా ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అభ్యర్థించిందని టీజీ వెంకటేశ్ ప్రశ్నకు సమాధామిచ్చారు.
విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు
త్వరలో విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయని పౌర విమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ చేపడుతోందని, ఈ మేరకు ఈ ఏడాది జూన్ 15న ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ డిమాండ్–సరఫరా ఎలా ఉందో ఎయిర్‌లైన్స్ సంస్థలు అధ్యయనం చేసిన అనంతరం ఆయా రూట్లలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్‌లైన్స్ ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్ అనంతరం విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసుల నిర్వహణకు వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ను గుర్తించినట్లు తెలిపారు. వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment