సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. 2018–19 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తీరే ఇందుకు నిదర్శనం. మూడేళ్ల క్రితం ఎంపిక చేసిన 20 ప్రాధాన్య ప్రాజెక్టులను 2018 జూన్‌లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 2019 నాటికి మరో 20 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాదే నాగార్జునసాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించి గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశను పూర్తి చేస్తామని గొప్పలు పోయారు. కానీ, గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే సర్కారు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది.
ఇలాగైతే పూర్తయ్యేదెలా?
బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,978.22 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.15,620.76 కోట్లను మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులకు, రూ.905.05 కోట్లను ఏపీఎస్‌ఐడీసీకి(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ), రూ.452.41 కోట్లను చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించారు. గత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,770 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 33 శాతం అధికంగా నిధులు ఇచ్చామని ప్రకటించారు. కానీ, ఇందులో పోలవరంతోపాటు పీఎంకేఎస్‌వై కింద ఏడు ప్రాజెక్టులకు కేంద్రం రూ.9,000 కోట్లకుపైగా ఇస్తుందని బడ్జెట్‌లో చూపారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి రూ.7,978.22 కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కూడా అధిక శాతం ఏపీడబ్ల్యూఆర్‌డీసీ(ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా రుణంగా సేకరించాలని నిర్ణయించింది. కేంద్రం రూ.9,000 కోట్లు ఇస్తుందని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, కేంద్రం ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. అలాగే ఏపీడబ్ల్యూఆర్‌డీసీ సేకరించే రుణం కూడా రూ.3,000 కోట్లకు మించదు. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎలా ముందుకు సాగుతాయో ప్రభుత్వానికే తెలియాలి.
మాటల్లోనే ఆర్భాటం..
శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తి కావాలం టే రూ.350 కోట్లు అవసరం. కానీ, బడ్జెట్‌లో రూ. 250 కోట్లే కేటాయించారు. మహేంద్ర తనయ రిజ ర్వాయర్‌కు రూ.400 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో 80 కోట్లే విదిల్చారు. ఈ రెండు ప్రాజెక్టులను ఈ ఏడాదే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల కేటయింపులను పరిశీలిస్తే పూర్తయ్యే అవకా శాలు కనిపించడం లేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, పెంచిన అంచనా వ్యయం మేరకు కనీసం రూ.2,000 కోట్లు అవసరం. బడ్జెట్‌లో రూ. 334.05 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ నిధులు కాంట్రాక్టర్లకు బకాయిలకే సరిపోవు. హంద్రీ–నీవా రెండో దశను ఈ ఏడాదే పూర్తి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. నిధుల కేటాయింపులో మాత్రం ఆ ఆర్భాటం చూపలేదు. ఈ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు అవసరం కాగా, రూ.663.75 కోట్లే కేటాయించారు.
అత్తెసరు నిధులేనా?
పీఎంకేఎస్‌వై కింద కేంద్రం నిధులు విడుదల చేస్తేనే పుష్కర, గుండ్లకమ్మ, తోటపల్లి, ముసురుమిల్లి, తాటిపూడి, ఎర్రకాల్వ ప్రాజెక్టు పూర్తవుతాయి. వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపకుండా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తే పైసా కూడా వచ్చే అవకాశం ఉండదు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే మరో రూ.1,100 కోట్లు అవసరం. బడ్జెట్‌లో కేవలం రూ.400 కోట్లు కేటాయించారు.
మహాసంగమం ప్రస్తావనేదీ?
గోదావరి–పెన్నా మహాసంగమం తొలి దశను రూ.4617 కోట్లతో ఈ ఏడాదే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బడ్జెట్‌లో ఆ పథకానికి పైసా కూడా ఇవ్వలేదు. రాజధానిలో తాగునీటి అవసరాల కోసం 1998 కోట్లతో వైకుంఠపురం బ్యారేజీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ప్రకటించినా.. బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అనంతపురం జిల్లాలో భైరవాని తిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, ఎగువ పెన్నా(అప్పర్ పెన్నార్) ఎత్తిపోతల పథకాలకు రూపాయి కూడా కేటాయించలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాదే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడం గమనార్హం.
ప్రపంచ బ్యాంక్ నిధులు వెనక్కే
నాగార్జునసాగర్ ఆధునికీకరణ కోసం నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు రూ.800 కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, బడ్జెట్‌లో రూ.60.87 కోట్లే విదిల్చింది. ఈ లెక్కన ప్రపంచ బ్యాంక్ నిధులు వెనక్కి వెళ్లడం ఖాయమే. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణకు రూ.500 కోట్లు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.233.94 కోట్లను మాత్రమే కేటాయించింది. కృష్ణా, గోదావరి డెల్టా ఆధునికీకరణ, ఏలేరు ఆధునికీకరణలకు అరకొరగానే నిధులు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment