సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని లాంటి పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న అంచనాతో తాజా బడ్జెట్‌లో రూ.8,829.39 కోట్లు కేటాయించింది. అయితే, కేంద్రం నుంచి కచ్చితంగా నిధులు వస్తాయా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించారు. కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నెలన్నర తర్వాత రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.6,889 కోట్లు కేటాయించారు. ఆ నిధులన్నీ కేంద్రం నుంచే వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. కానీ, కేంద్రం రూ.1,582.56 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో పోల వరానికి ప్రత్యేకంగా పైసా కూడా కేటాయించలేదు. అయితే, కేంద్రం నుంచి రూ.8,829.39 కోట్లు వస్తాయని చూపి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిం చారు. కేంద్రం నుంచి రాకపోతే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకపోవడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడీ చేస్తున్నట్లు స్పష్టమవుతోందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొంటున్నారు.
పోలవరం కోసం ప్రత్యేక హోదా తాకట్టు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ఏ ఇతర జాతీయ ప్రాజెక్టుకు లేని తరహాలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, ఒప్పందం చేసుకోకుండా, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేక హోదాను వదులుకోవడానికి సిద్ధపడటంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. నిర్మాణ బాధ్యతలు దక్కిన తర్వాత ప్రభుత్వ పెద్దలు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు.
ఈ పాపం ఎవరిది?
విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగించి ఉంటే.. నిర్మాణ భారం ఒక్క పైసా కూడా రాష్ట్ర సర్కార్‌పై పడేది కాదు. నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించేటప్పుడు కేంద్రం విధించిన షరతుల వల్ల ఆదిలోనే రాష్ట్రం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. విద్యుత్, తాగునీటి ప్రాజెక్టు వ్యయం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడంపై కేంద్రం నివ్వెరపోయింది. కేంద్రం ఆమోదముద్ర వేయకుంటే రాష్ట్ర ఖజనాపై రూ.45,265.15 కోట్లకుపైగా భారం పడుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 540 గ్రామాల ప్రజలకు తాగునీరు, విశాఖకు 23.44 టీఎంసీల నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి రాకుండా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment