సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులకు 2023–24 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,908.10 కోట్లను కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిన సీఎం వైఎస్ జగన్ గతేడాది పెన్నా డెల్టా జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి సెపె్టంబరు 6న జాతికి అంకితం చేయడం తెలిసిందే. తద్వారా పెన్నా డెల్టాలో 4.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందేలా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించారు. ఈ ఏడాదీ ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు.
ఉత్తరాంధ్రలో కీలకమైన వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తయ్యేలా తగినన్ని నిధులు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనుల పూర్తికి నిధులు కేటాయించారు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను మళ్లించి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 68 చెరువులను నింపి సాగు, తాగునీటిని అందించే పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు.
పోలవరంపై ప్రత్యేక దృష్టి..
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. కేంద్రం రూ.3 వేల కోట్లకుపైగా రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తున్నా రాష్ట్రమే నిధులను వెచ్చిస్తోంది. ఈ బడ్జెట్లోనూ పోలవరంకు సింహభాగం నిధులు రూ.5,042.47 కోట్లు కేటాయించింది.
చంద్రబాబు నిర్వాకాలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతతో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పద్ధతులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సూచనల మేరకు దృష్టి పెట్టాం. తర్వాత వరదల్లోనూ ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది.
జలయజ్ఞం ఫలాలే లక్ష్యంగా..
సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుల జీవనోపాధులను పెంచడానికి దోహదం చేసేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తోటపల్లి, పుష్కర, తాటిపూడి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు నీళ్లందించే ఉప కాలువలు, పిల్ల కాలువలను పూర్తి చేయడానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేశాం.
ఉత్తరాంధ్రలో కీలకమైన తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా నిధులు కేటాయించింది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పూర్తి చేసి రాష్ట్ర కోటా నీటిని పూర్తి స్థాయిలో రాబట్టి రాయలసీమ రైతులకు నీళ్లందించడమే లక్ష్యంగా తుంగభద్ర బోర్డుకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment