ప్రాజెక్టుల పనులపై సీఎం అసంతృప్తి | Works projects On CM dissatisfied | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పనులపై సీఎం అసంతృప్తి

Published Thu, Jul 30 2015 3:44 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

ప్రాజెక్టుల పనులపై సీఎం అసంతృప్తి - Sakshi

ప్రాజెక్టుల పనులపై సీఎం అసంతృప్తి

సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకలా సాగుతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకలా సాగుతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో బుధవారం సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ‘ఈ నెల 3న జీడిపల్లి రిజర్వాయరు పరిశీలన సందర్భంగా పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించా.

పనులు చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశా. ఆదేశించి 23 రోజులు గడిచినా లక్ష్యం మేరకు పనులు పూర్తికాలేదు...’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  భూసేకరణ, పూడికతీత, కాంక్రీట్ పనులను త్వరితంగా జరపాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టుల పూర్తికి సహకరించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని, కొంతకాలం వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.700 కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రంలో భూసేకరణకు రూ.1,028 కోట్లు వ్యయం చేశామని వివరించారు. ఇప్పటి వరకూ సమయమిచ్చానని, ఇక చర్యలేనని స్పష్టం చేశారు.
 
డిసెంబర్ కల్లా హంద్రీ-నీవా పూర్తి
హంద్రీ-నీవా సుజల స్రవంతి రెండోదశ పనులను ఈ ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలని, సీఎం సూచించారు.
 
ఆ 18 వేల కోట్లు.. ఇక ఖజానాకు
ప్రభుత్వంలో నిధులకు కొరతే లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ ముఖ్యమంత్రి నిర్వహించిన శాఖాధిపతుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల నిధులు రాష్ట్రవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో రూ.18 వేల కోట్లు ఉన్నాయని, ఆ నిధులన్నింటినీ రాష్ట్ర ఖజానా ఖాతాలకు తీసుకువస్తామని రమేశ్ స్పష్టం చేశారు.  మంగళవారం రాత్రి నిర్వహించిన శాఖాధిపతుల సమావేశంలో ఈ మేరకు ప్రస్తావించారు.
 
బౌద్ధ పర్యాటక కేంద్రంగా అమరావతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతిని బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, విదేశీ యాత్రికులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగం అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో ప్రపంచ బౌద్ధులకు ఆకర్షణగా నిలిచేలా కాలచక్ర ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ తరహాలో కోరంగ వన్యప్రాణి అభయారణ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

సముద్ర తీరంలో 500 దీవులు ఉన్నాయని, వీటిలో 40 దీవులను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చే ప్రమోటర్లు, బిల్డర్లకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఓడలరేవు, అద్దూరు, ఎస్.యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల్లూరును కోస్టల్ టూరిజం హబ్‌గా రూపొందించేందుకు రూ.31.8 కోట్లతో ప్రాజెక్టును రూపొందించామని, పులికాట్, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, మైపాడు, ఇసుకపల్లి బీచ్‌లను అభివృద్ధి చేస్తామని అధికారులు వివరించారు. విశాఖపట్నం, తిరుపతి సర్క్యూట్‌ల అభివృద్ధికి, శ్రీశైలం టైగర్ పార్కు, కుప్పంలో ఎలిఫెంట్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement