తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘‘రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకే ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ ప్రాజెక్టు పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముందుగా నిధులిస్తున్నాం. పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలి’’
– ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరులశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల ప్రగతిని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు 91 శాతం పూర్తయ్యాయని, జూన్ 15 నాటికి మిగిలినవి పూర్తి చేస్తామన్నారు. స్పిల్ వేకు 42 రేడియల్ గేట్లను బిగించామని, మరో 6 గేట్లు అమర్చాల్సి ఉందని, వాటిని కూడా వేగంగా బిగిస్తామని వివరించారు. జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు త్వరలోనే పోలవరానికి చేరుకుంటాయన్నారు. ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేసి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నెలాఖరుకు స్పిల్ చానల్ పనులు రక్షిత స్థాయి (సేఫ్ స్టేజ్)కి చేరుకుంటాయన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు సంక్లిష్టమైనవి కూడా పూర్తి చేశామని వెల్లడించారు. కాఫర్ డ్యామ్‌లోని అన్ని రీచ్‌లను జూన్ నెలాఖరుకు 38 మీటర్ల ఎత్తుకు, జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని తెలిపారు.
వేగంగా దిగువ కాఫర్ డ్యామ్ పనులు..
నిర్దేశించుకున్న ప్రణాళిక మేరకు పోలవరం పనులు జరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
కేంద్రం నుంచి నిధులు రాబట్టండి..
పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి దాదాపు రూ.1,900 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తేవడంతో.. కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండడం సరి కాదన్నారు. ఢిల్లీ వెళ్లి ఆ నిధులు రీయింబర్స్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పనులకు వచ్చే మూడు నెలల్లో కనీసం రూ.1,470 కోట్లు అవసరమవుతాయని అధికారులు వివరించడంతో ఆ మేరకు నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రాధాన్యతగా నేరడి బ్యారేజీ..
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. బ్యారేజీ ముంపు ప్రాంతంపై చర్చల కోసం ఇప్పటికే ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాసి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఒడిశా అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు కూడా 84 శాతం పూర్తయ్యాయని, జూలై 31 నాటికి మిగిలినవి పూర్తవుతాయని వివరించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను ఇరువైపుల నుంచి చేస్తున్నామని, 116 మీటర్ల పని మిగిలి ఉందని, ఫాల్ట్ జోన్‌ను పాలి యూథిరేన్ ఫోమ్ (పీయూఎం) రసాయన మిశ్రమం ద్వారా ఫోర్ ఫిల్లింగ్ ప్రక్రియ ద్వారా చేస్తున్నామని, మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు.
రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలి..
వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తయిందని అధికారులు వివరించారు. టన్నెల్ –2 హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. టన్నెల్–2లో ఇంకా 7,335 మీటర్ల పని మిగిలి ఉందని తెలిపారు. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని, తదుపరి సమావేశం నాటికి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం నిర్దేశించారు.
సత్వరమే వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పూర్తి..
వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వీటన్నింటినీ ప్రాధాన్యత ప్రాజెక్టులుగా చేపట్టామని, వీటి పనుల్లో ఏమాత్రం ఆలస్యం కావడానికి వీల్లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులకు సంబంధించి భూసేకరణ ఇబ్బందులు తొలగినందున వేగంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. భూసేకరణ సమస్యలను కొలిక్కి తెస్తున్నామని, గడువులోగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కాంట్రాక్టరు కోర్టుకు వెళ్లారని, న్యాయపరమైన చిక్కులను తొలగించి ముందడుగు వేస్తున్నామని వివరించారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేశామన్నారు. బ్రహ్మంసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. బ్రహ్మంసాగర్‌లో సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నిల్వ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిధులు సమీకరించి పక్కాగా పనులు..
రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులు, గోదావరి కృష్ణా సెలైనటీ మిటిగేషన్, జలభద్రత ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల పనుల సన్నద్ధత, ఆర్థిక వనరుల సేకరణను పరిశీలించారు. ఇప్పటికే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశామని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) ఈ ప్రాజెక్టుకు రూ.12,056 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పనులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ) రూ.2,750 కోట్ల రుణం మంజూరు చేసిందని, అందులో రూ.850 కోట్లు మార్చిలోనే విడుదలైనట్లు చెప్పారు. నిధులను సమీకరించి ప్రణాళిక ప్రకారం పనులను చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన బిల్లులన్నీ మంజూరు చేయాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment