శిశు మరణాలకు కళ్లెం: సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం | CM YS Jagan Comments In review on Covid Prevention measures | Sakshi
Sakshi News home page

శిశు మరణాలకు కళ్లెం: సీఎం జగన్‌ ఆదేశం

Published Thu, Sep 9 2021 2:31 AM | Last Updated on Thu, Sep 9 2021 3:31 PM

CM YS Jagan Comments In review on Covid Prevention measures - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శిశు మరణాలకు కళ్లెం వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణతో దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని, ఇందు కోసం చక్కటి విధానాలను ఖరారు చేయాలని  సూచించారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతతో పాటు వైద్య, ఆరోగ్య శాఖపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని  సూచించారు. మెడికల్‌ కాలేజీల్లో పారా మెడికల్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించడంతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్సులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ప్రజారోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
► ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపై పరీక్షలు అందుబాటులో ఉండాలి. అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. 

► ప్రజల హెల్త్‌ డేటాపై అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స పొందినా.. గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్‌లోడ్‌ చేయాలి. ఒక వ్యక్తి వైద్యం కోసం ఎక్కడకు వెళ్లినా ఆ వివరాలు డాక్టర్‌కు వెంటనే అందుబాటులోకి వచ్చేలా విధానం ఉండాలి.

► ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా, విలేజ్‌ క్లినిక్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రి వరకు ఎక్కడికి వెళ్లినా.. అక్కడ చేయించుకున్న పరీక్షల వివరాలు, చికిత్స వివరాల డేటా అప్‌లోడ్‌ కావాలి. దీనికి సంబంధించి మంచి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.

► థర్డ్‌వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలి. కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్న వాటి వినియోగంపై దృష్టి పెట్టి, అన్ని రకాలుగా సిద్ధం కావాలి. 
కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్‌వేవ్‌ సన్నద్ధతతో పాటు ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

కేరళలో చికిత్స విధానంపై అధ్యయనం
► కోవిడ్‌పై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ బృందాన్ని కేరళకు పంపింది. ఇందుకు సంబంధించి అక్కడ అన్ని విషయాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి వచ్చిన వైద్యాధికారులు.. తమ పరిశీలన గురించి ఈ సమీక్షలో వివరించారు. 

► ఆ రాష్ట్రంలో కోవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, ముందస్తు వ్యూహాలు, అందిస్తున్న చికిత్స విధానాల గురించి చర్చించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
► రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు : 14,452 
► రికవరీ రేటు శాతం : 98.60 
► యాక్టివ్‌ కేసుల నమోదు శాతం జీరో ఉన్న సచివాలయాలు : 10,494
► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు : 3,560 
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 926 
► హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారు : 9,966 
► ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్న బెడ్స్‌ శాతం : 92.50 
► ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్‌ శాతం : 70.69 
► 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ : 684 
► ఇప్పటి వరకు 18 దఫాలుగా ఫీవర్‌ సర్వే 

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై ప్రణాళిక
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ : 20,964
► ఇంకా అందుబాటులోకి రావాల్సినవి : 2,493
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డి–టైప్‌ సిలిండర్లు : 27,311
► ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తైన ఆస్పత్రులు : 108 
► 50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు
► మొత్తం పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటైన ఆస్పత్రులు : 140  
► అక్టోబరు 6 నాటికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement