సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. వాగ్దానాలు, హామీల్లో వైఫల్యాలతోపాటు అవి నీతిని వెలికితీసి ప్రజాకోర్టులో పొలిటికల్ చార్జిషీట్లు దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఇచ్చిన వాగ్దానాలు, నేతలు స్థానికంగా ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలపై వివరాలు సేకరించనుంది.
నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయేందుకు అవకాశమున్న అంశాలు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు మొదలు వివిధ స్థాయిల నేతలు పాల్పడే అవినీతి, దందాలపై బీజేపీ దృష్టి పెట్టింది. వీటితో ముడిపడిన వివిధ అంశాలపై ప్రత్యేకంగా పనిచేసేందుకు త్వరలోనే ముఖ్యనేతలతో సబ్ కమిటీలను నియమించనున్నట్టు సమాచారం.
ఈ కమిటీలకు కన్వీ నర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమించడం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై సమాచార సేకరణ, లోతైన విశ్లేషణ జరిపి అధికారపార్టీ తీరును ఎండగట్టాలని నాయకత్వం భావిస్తోంది. గత ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, వాటి నిర్మాణానికి చేసిన వ్యయం, వాటి వల్ల ప్రజలకు ఒనగూరిన అదనపు ప్రయోజనాలు, అవినీతి, అక్రమాలు, కమిషన్లు పొందేందుకు ఉన్న ఆస్కారాలు, సంబంధిత విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది.
ముఖ్య నేతలతో కమిటీల నియమాకం
సీఎం కేసీఆర్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఏ మేరకు అమలయ్యాయి, వాటిలో ప్రధానంగా అమలుకానివి ఏవేవీ అన్న అంశాన్ని కూడా మరో కమిటీ ద్వారా వెలికితీయనున్నారు. వివిధ స్థాయిల్లోని టీఆర్‌ఎస్ నేతలపై వచ్చిన, వస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టి పెట్టేందుకు ఇంకొక కమిటీని నియమిస్తున్నారు. త్వరలోనే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్వహణ, లోటుపాట్లు తదితర అంశాల పరిశీలనకు ఓ మాజీ ఎంపీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీలకు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్ వెంకటస్వామి, తీన్మార్ మల్లన్న, ఇతర ముఖ్య నేతలను కన్వీనర్లు, కో కన్వీనర్లుగా నియమించేందుకు నియమించనున్నట్లు సమాచారం. ఈ కమిటీల్లో సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు తెలుస్తోంది.
వీటికి సమాంతరంగా వివిధ సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా టీఆర్‌ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, దందాలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా మొత్తంగా అధికార పార్టీపై వివిధ మార్గాల ద్వారా రాజకీయపరంగా ముప్పేట దాడిని కొనసాగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment