సాక్షి, న్యూఢిల్లీ: తరతరాలుగా కరువుతో తల్లడిల్లుతున్న సీమ కడగండ్లు తీర్చేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి తాగునీరు అందించేలా రాయలసీమ ఎత్తిపోతల ఎంతో ఉపకరిస్తుందని పథకం ఆవశ్యకతను వివరించారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వేగంగా మంజూరు చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. బుధవారం ఢిల్లీలో భూపేంద్రయాదవ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం సందర్భంగా పర్యావరణ అనుమతులతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు.
ఏకపక్షంగా నీటి విడుదల..
కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆపరేషనల్ ప్రొటోకాల్స్, ఒప్పందాలు, ఆదేశాలను ఉల్లంఘించడంతో కృష్ణాపై వాటా హక్కుల్ని ఏపీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. 2021–22, 2022–23లో సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచే విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వినియోగించడం ప్రారంభించిందన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడంతో పాటు బోర్డుకు ఎలాంటి ఇండెంట్ లేకుండా... నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాకు అవసరం లేనప్పటికీ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందన్నారు.
నీటి పారుదల అవసరాల్లో విద్యుదుత్పత్తి అన్నది కేవలం యాదృచ్ఛికంగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల దిగువ వరకు నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే కానీ పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని కేంద్రమంత్రికి వివరించారు. లేదంటే పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు.
ఎత్తిపోతల మినహా మరో ప్రత్యామ్నాయం లేదు..
తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3 టీఎంసీలు), దిండి పథకాల గురించి గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వినియోగించుకోవడం కూడా సాధ్యపడదన్నారు.
ఈ పరిస్థితుల నేప«థ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఎస్) అమలు చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరునగరి సుజల స్రవంతికి సరఫరా చేయగలుగుతామన్నారు. నిబంధనలు, ప్రొటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రయోజనాలు ప్రమాదంలో పడకుండా కాపాడాలన్నారు.
ప్రధాన కాలువకు నీటిని అందించేందుకే..
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర అధికారులతో సమగ్ర చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే అందించామన్నారు. ఇందుకోసం భూ సేకరణ చేయడం లేదని, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి 10 కి.మీ దూరంలో ఉండడంతో పాటు కేవలం ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని అందించడం కోసమే ఎత్తిపోతలను చేపడుతున్నట్లు సీఎం వివరించారు. వీలైనంత త్వరలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి..
పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని సీఎంజగన్ వివరించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తికి అనువైన స్థలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, వీటిని ప్రోత్సహించేందుకు పాలసీ కూడా రూపొందించినట్లు తెలిపారు.
ఆ తరహా ప్రాజెక్టులకు ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు లాంటి చోట్ల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోసం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల (1,350 మెగావాట్లు) పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల ప్రగతికోసం చేపట్టిన ఆయా ప్రాజెక్టులన్నింటికీ అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
3 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు
‘‘ఏపీ 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ఉందని సీఎం జగన్ కేంద్రమంత్రికి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు తీరప్రాంతంలో 10 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
రామాయపట్నం ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 మార్చి నాటికి పోర్టు కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన సమాచారాన్ని కూడా అందజేశామన్నారు. ఈ పనులను వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అనుమతులిచ్చి సహకారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment