సాగు నీరు..రుణాల జోరు! | Budget Allocation of Rs 11,053.55 crores to Irrigation sector | Sakshi
Sakshi News home page

సాగు నీరు..రుణాల జోరు!

Published Mon, Mar 9 2020 2:36 AM | Last Updated on Mon, Mar 9 2020 2:38 AM

Budget Allocation of Rs 11,053.55 crores to Irrigation sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆశించిన మాదిరి లేకున్నా ఉపశమనం కలిగించేలా ఉంది. 2020–21 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులకన్నారూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు పెంచింది. గతంకన్నా భిన్నంగా ప్రాజెక్టుల పంపుల నిర్వహణ భారీగా ఉండనుండటంతో దానికింద నిర్వహణ పద్దు నిధులను పెంచారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల ప్రాజెక్టులకు అధిక కేటా యింపులు చేశారు. అయినప్పటికీ ఈ నిధులతో ప్రాజెక్టులు పూర్తికాకుంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్‌ల ద్వారా తీసుకొనే రుణాల ద్వారానే వాటిని పూర్తి చేయనున్నారు. 

అడిగింది కొండంత.. ఇచ్చింది కొంతే.. 
ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపుల నేపథ్యంలో గతేడాది సాగునీటికి కేవలం రూ. 8,476.17 కోట్లే కేటాయించారు. ఈ ఏడాది కూడా మాంద్యం పరిస్థితులున్నా గతేడాదికన్నా రూ. 2,57 7,38 కోట్ల మేర పెంచి మొత్తంగా రూ.11,0 53.55 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్‌ లో కనీసం రూ. 21 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్‌కింద రూ. 7 వేల కోట్లు కోరింది. కానీ ఈ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించింది రూ. 805.47 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు కు రూ. 3,500 కోట్లు, దేవాదులకు రూ. 500 కోట్లు, తుపాకులగూడేనికి రూ. 500 కోట్లు కేటాయించాలన్న సాగునీటిశాఖ విజ్ఞప్తిని సర్కా రు పెద్దగా పట్టించుకోలేదు. పాలమూరుకు రూ. 368.58 కోట్లు, దేవాదులకు రూ. 292.38 కోట్లు, తుపాకులగూడేనికి రూ.73.83 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడు,కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,200 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు రూ. 50 కోట్లకే పరిమితమయ్యాయి. 

బకాయిలూ భారీగానే... 
సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భారీగానే పెండింగ్‌ బకాయిలున్నాయి. రూ. 11,965.23 కోట్ల బకాయిలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రధాన పనులకు సంబంధిం చి బకాయిలు రూ. 5,550 కోట్లు ఉండగా రుణాల కోసం కార్పొరేషన్‌లకు మార్జిన్‌ మనీ కింద ఇవ్వాల్సినవి రూ. 1,695 కోట్లు, భూసేకరణ బకాయిలు రూ. 1,585 కోట్లు, విద్యుత్‌ బకాయిలు రూ. 3,072 కోట్ల మేర ఉన్నాయి. పాలమూరు పరిధిలో రూ. వెయ్యి కోట్లు, కాళేశ్వరం పరిధిలో రూ. 1,500 కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 350 కోట్ల మేర ఉన్నాయి. ఇక ఈ ఏడాది మైనర్‌ ఇరిగేషన్‌కు కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే రూ. 42 కోట్లు తగ్గించి రూ. 602.45 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్‌ కాకతీయకు రూ. 402 కోట్లు కేటాయించారు. అయితే దీని బకాయిలే రూ. 550 కోట్ల మేర ఉన్నాయి. 

ఆదుకునేది అప్పులే
ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్, రబీ నాటికి భారీ ఆయకట్టు లక్ష్యాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటితో  360 టీఎంసీలను ఎత్తిపోయా లని ప్రణాళిక వేశారు. దీంతోపాటే సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా దేవాదులలో 100% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రాష్ట్ర నిధులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా రూ. 61,500 కోట్ల రుణ సేకరణ చేపట్టగా అందులో రూ. 38 వేల కోట్ల రుణాల ద్వారానే ఖర్చు జరిగింది. ఇక సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా రూ. 17 వేల కోట్ల రుణ సమీకరణ చేయగా అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019–20 వార్షిక బడ్జెట్‌ నిధుల ద్వారా రూ. 8 వేల కోట్లు ఖర్చు జరగ్గా రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ. 14 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది సైతం రూ. 20 వేల కోట్ల రుణాల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. అందులో కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్లు ఖర్చు జరిగే అవకాశం ఉండగా మిగతా ప్రాజెక్టులకు మరో రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. 


డబుల్‌ రోడ్లకు బ్యాంకు రుణాలే దిక్కు
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నిర్మించే డబుల్‌ రోడ్లకు ఈసారి బ్యాంకు రుణాలే ఆధారం కానున్నాయి. ఈ రోడ్లకు ప్రణాళికలు రూపొందించిన కొత్తలో విరివిగా నిధులు అందగా, గత రెండు మూడేళ్లుగా చాలినన్ని విడుదల కావడం లేదు. ఈసారి కూడా బడ్జెట్‌ కేటాయింపులు దాదాపు అలాగే ఉన్నాయి.  డబుల్‌ రోడ్లకు తాజా బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతి పద్దు కింద రూ.655 కోట్లు చూపారు. గత బడ్జెట్‌లో దీనికి కేవలం రూ.187 కోట్లు కేటాయించారు. అంతకు ముందు బడ్జెట్‌లో అది రూ.460 కోట్లుగా చూపారు. 2017–18లో రూ.2,500 కోట్లు వచ్చాయి. ఆ సంవత్సరం పనులు ఊపుగా జరిగాయి. ఆ తర్వాత నుంచి నిధులు తక్కువగా రావడంతో కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయాయి. ఇటీవల బ్యాంకు లోన్‌ ద్వారా ఆ బకాయిలు తీర్చారు. ఇప్పుడు కూడా చాలినన్ని నిధులు వచ్చే అవకాశం లేనందున మళ్లీ బ్యాంకు రుణంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో 65% పనులు పూర్తయ్యాయి. మరో 35% పనులు చేపట్టాల్సి ఉంది. 

తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు..
జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నగరంలో పోలీసు కమాం డ్‌ కంట్రోల్‌ భవనం తదితరాల కోసం రూ.550 కోట్లు కేటాయించారు. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు కేటాయించారు. గజ్వేల్‌ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు.  

బియ్యం సబ్సిడీకి రూ.2,362 కోట్లు 
రాష్ట్రంలో ప్రజా పంపి ణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం బడ్జెట్‌లో రూ.2,362 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బి య్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధి్ధదారులకు సబ్సిడీ బియ్యం సరఫరాకు వీలుగా ఈ నిధుల కేటాయింపు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.7 కోట్లు అదనంగా కేటాయించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement