మాంద్యాన్ని అధిగమించి.. జాతీయ సగటు మించి... | Telangana State Growth Rate Is Strong and Above the National Average | Sakshi
Sakshi News home page

మాంద్యాన్ని అధిగమించి.. జాతీయ సగటు మించి...

Published Mon, Mar 9 2020 2:03 AM | Last Updated on Mon, Mar 9 2020 4:51 AM

Telangana State Growth Rate Is Strong and Above the National Average - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర ఆర్థిక మాంద్యంతో ప్రపంచ, జాతీయ వృద్ధి రేటు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వృద్ధి రేటు చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడింది. 2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.4 శాతానికి పతనమైందని, ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యల్పమని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అవకాశాల నివేదిక పేర్కొంటోంది. 2019–20లో జాతీయ వృద్ధిరేటు సైతం 5 శాతానికి పడిపోనుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కానుందని అంచనా. అయితే, గత కొన్నేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు గణాంకాలతో పోలిస్తే ఈసారి కొంతమేర తగ్గుదల కనిపిస్తోంది. అయినా జాతీయ వృద్ధిరేటు సగటును మించిన వృద్ధి రేటును రాష్ట్రం సాధించనుంది. ఇలా అధిగమించడం 2015–16 నుంచి ఇది వరుసగా ఐదోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. 2018–19లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.8.61 లక్షల కోట్లతో 14.3 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, 2019–20 నాటికి రూ.9.7 లక్షల కోట్లకు పెరిగి 12.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. 2018–19లో స్థిర ధరల వద్ద 6.13 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2019–20లో 8.2 శాతం వృద్ధి రేటుతో రూ.6.63 లక్షల కోట్లకు పెరగనుందని అంచనా.

ప్రథమ, తృతీయ రంగాల హవా..
రంగాల వారీగా పరిశీలిస్తే.. 15.8 శాతం వృద్ధి రేటుతో ప్రాథమిక, 14.1 శాతం వృద్ధి రేటుతో తృతీయ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడుతున్నాయి. ద్వితీయ రంగం 5.3 శాతం వృద్ధి రేటును సాధించింది. ప్రాథమిక రంగం పరిధిలోని వ్యవసాయం, పశు, అటవీ, మత్స్య పరిశ్రమలు, మైనింగ్, క్వారీయింగ్, ద్వితీయ రంగం పరిధిలో తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర పౌరసేవలు, నిర్మాణ రంగ పరిశ్రమలు, తృతీయ రంగం పరిధిలో వాణిజ్య, రిపేర్‌ సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, స్టోరేజీ, ప్రసార సేవలు, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, నివాస గృహాల యాజమాన్య హక్కులు, వృత్తి సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు వస్తాయి. మొత్తానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 65.2 శాతం చేయూత (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌/ జీవీఏ) తృతీయ రంగమే అందిస్తోంది. జాతీయ సగటు కన్నా అధిక తలసరి ఆదాయాన్ని రాష్ట్రం నిలబెట్టుకుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయ తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 6.3 శాతం కాగా, రాష్ట్రం 11.6 శాతాన్ని సాధించింది. చివరగా, జాతీయ స్థాయిలో 8.08 ద్రవ్యోల్బణం నమోదు కాగా, రాష్ట్రంలో సైతం 7.46 నమోదైంది. పారిశ్రామిక కార్మికుల కోసం రూపొంచిన వినియోగదారుడి ధరల సూచిక (కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు.
చర్యలు సఫలీకృతం..
వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. జాతీయ సగటుకు మించిన వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. 

32 అర్బన్‌ ఫారెస్ట్‌ల అభివృద్ధి 
తెలంగాణకు హరితహారంలో భాగంగా 2019లో మొత్తం 38.18 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో 31.79 కోట్ల మేర జియో ట్యాగింగ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్‌ ఫారెస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు, ఇతర జిల్లాల్లో కలిపి 32 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు పూర్తి చేశారు. మరో 46 ప్రాంతాల్లో ఈ పార్కుల ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణలోని వివిధ అడవుల పరిధిలోని జీవవైవిధ్యం కాపాడేందుకు 12 రక్షిత ప్రాంతాల పరిధిలోని 9 వన్యప్రాణి అభయారణ్యాలను, 3 జాతీయపార్కులను (జాతీయపార్కుల వరకు 5,692.48 చదరపు కి.మీ) నెట్‌వర్క్‌ను ప్రకటించింది. తెలంగాణలో 2,939 చెట్ల రకాలు, 365 పక్షుల జాతులు, 103 క్షీరదాలు, 28 రకాల సరీసృపాలున్నాయి.

రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969.48 లక్షల చ.కి.మీ.గా విస్తరించి ఉంది. మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడో వంతు జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోఉండగా, నాలుగు జిల్లాల్లో అంటే ఈ రెండు జిల్లాలతో సహా నాగర్‌కర్నూల్, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కలిపి 50 శాతం అటవీ ప్రాంతముంది. మొత్తం కలిపి రాష్ట్రంలోని అటవీప్రాంతమున్న 24 శాతం అటవీ శాఖ నిర్వహణ పరిధిలో ఉన్నా దాదాపు 15 శాతంలో మాత్రమే గణనీయమైన పచ్చదనం, అడవులున్నాయి. 2020–21 సంవత్సరానికి సంబంధించి హరితహారంలో 68 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 1994 నుంచే అటవీ శాఖ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ల సాంకేతికను వినియోగిస్తోంది. రిమోట్‌ సెన్సింట్‌ శాటిలైట్‌ ఇమేజరీ సాంకేతికను ఉపయోగించి అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. ఎకో టూరిజంలో భాగంగా బొగతా, కుంతాల, పొథెరా, మల్లెలతీర్థం జలపాతాలు, అనంతగిరి హిల్స్, మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, లక్నవరం చెరువు, మల్లారం ఫారెస్ట్, పాకాల చెరువు, టైగర్‌ఫారెస్ట్‌లను అభివృద్ధి చేస్తోంది.  

లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి  51.77 టీఎంసీల ఎత్తిపోత 
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్‌ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్‌లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్‌ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement