ప్రాజెక్టుల టెండర్లలో భారీ అక్రమాలు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన పనుల టెండర్ అర్హతలను రూపొందించడంలోనే కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారన్నారు. టెండర్లు, ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 25 వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఆహ్వానించారని, ఈ ఉత్తర్వులను ఉంచాల్సిన వెబ్‌సైట్‌ను నిలిపివేశారని అన్నారు. పాములపర్తి జలాయశం పనుల విషయంలోనూ గతంలో రూ.659 కోట్ల పనులను ఏకంగా రూ.3007కోట్లకు పెంచారని, వాటికి ఎలాంటి టెండర్లూ లేకుండా పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో పనులను అప్పగించారన్నారు.
ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలం...
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో రైతు సమస్యలపై సమావేశం జరిగింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు రేణుకాచౌదరి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పంటల బీమా పథకం-2016, పత్తిపంటకు మద్దతు ధర, ఆహార పంటల జన్యుమార్పిడి, కరువు మండలాల ప్రకటన, ఎండిన పంటలకు నష్టపరిహారం, రైతుల ఆత్మహత్యలు, పరిహారం, పంటరుణాల మాఫీ వంటి సమస్యలపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల పేర్లు మార్చడాన్ని ఈ సమావేశం ఖండించింది.