పనులను పరుగెత్తించాలి | YS Jagan Mohan Reddy Review Of Irrigation Projects With Officials | Sakshi
Sakshi News home page

పనులను పరుగెత్తించాలి

Published Fri, Jun 26 2020 3:07 AM | Last Updated on Fri, Jun 26 2020 9:16 AM

YS Jagan Mohan Reddy  Review Of Irrigation Projects With Officials - Sakshi

గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్‌–2 పనులు వేగంగా సాగాలి. గడువులోగా పనులు పూర్తి చేయాలి. అక్టోబర్‌లో ప్రారంభించడానికి సిద్ధం చేయాలి. పోలవరం పనుల్లో ఇంకా వేగం పెరగాలి. – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అవుకు టన్నెల్‌–2, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2.. వంశధార–నాగావళి అనుసంధానం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిని ఈ ఏడాదే ప్రారంభించడానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో ఈ ఏడాది పూర్తి చేయాలని నిర్దేశించుకున్న ఆరు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం లోతుగా సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

గడువులోగా అవుకు టన్నెల్‌–2 పనులు

  • గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్‌–2 పనులు వేగంగా జరుగుతున్నాయని.. గడువులోగా పనులు పూర్తి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. అక్టోబర్‌లో ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని చెప్పారు.
  • వెలిగొండ టన్నెల్‌–1లో 700 మీటర్ల మేర తవ్వకం పనులు మిగిలాయని, గడువులోగా ఆ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. నల్లమలసాగర్‌ పనులు పూర్తయ్యాయని.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అన్ని రకాల అనుమతులు వచ్చాయని వివరించారు. 
  • నల్లమలసాగర్‌ నుంచి ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ (తూర్పు ప్రధాన కాలువ)కు నీటిని సరఫరా చేసేందుకు 180 మీటర్ల పొడవున టన్నెల్‌ తవ్వాలని.. వాటిని మూడు నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పారు. తీగలేరు కెనాల్‌కు నీటిని సరఫరా చేసేందుకు 600 మీటర్ల మేర తవ్వాల్సిన టన్నెల్‌ పనులు కూడా పూర్తవుతున్నాయని వివరించారు.
  • నాలుగు నెలల్లోగా టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్‌లో వెలిగొండ టన్నెల్‌–1 ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేయడానికి సిద్ధం చేస్తామన్నారు.
  • నెల్లూరు బ్యారేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయని, రెండు నెలల్లోగా సివిల్‌ పనులు పూర్తవుతాయని.. అక్టోబర్‌ చివరికి పనులు పూర్తవుతాయని సీఎంకు అధికారులు వివరించారు. 
  • సంగం బ్యారేజీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని, అక్టోబర్‌కు పనులు పూర్తవుతాయని, ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు.

    ప్రాజెక్ట్‌ల పనుల పురోగతిపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి అనిల్‌కుమార్, అధికారులు 

నేరడి బ్యారేజీకి అంచనాలు సిద్ధం చేయండి 

  • వంశధార–నాగావళి అనుసంధానం పనులను వేగవంతం చేశామని.. డిసెంబర్‌ నాటికి వాటిని పూర్తి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు.
  • వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2లో మిగిలిపోయిన పనులను కూడా వేగంగా సేఫ్‌ స్టేజ్‌ (రక్షణాత్మక స్థాయి) వరకూ పూర్తి చేసి.. ఈ ఏడాది హిరమండలం రిజర్వాయర్‌లో 8 టీఎంసీలను నిల్వ చేస్తామని.. వచ్చే ఏడాది జూలై నాటికి మిగతా పనులను కూడా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఆరు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 
  • వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2లో వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వంశధార ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై అయ్యేలోపు నేరడి బ్యారేజీ పనులు చేపట్టడానికి డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేయాలన్నారు. నేరడి బ్యారేజీని పూర్తి చేయడం ద్వారా.. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారు.

షెడ్యూల్‌ ప్రకారం పోలవరం పూర్తి కావాలి 

  • పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం గడువులోగా  పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
  • గోదావరికి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తే పోలవరం స్పిల్‌ వేను వరద జలాలు తాకుతాయని.. ఆ మేరకు వరద ఆగస్టులో వస్తుందని అధికారులు తెలిపారు. ఆగస్టులో తప్ప.. మిగతా రోజుల్లో స్పిల్‌వే పనులు చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 
  • పోలవరం ప్రాజెక్టులో ఏప్రిల్‌లో మూడు వేల మంది కూలీలు పని చేసేవారని.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో 900 మంది మాత్రమే పనులు చేసేవారని అధికారులు తెలిపారు.  ప్రస్తుతం రెండు వేల మంది కూలీలు పని చేస్తున్నారని.. మిగతా అందరినీ పిలిపిస్తున్నామన్నారు.   
  •  స్పిల్‌ వేలోని 52 ఫర్స్‌లు గతంలో సగటున 28 మీటర్ల ఎత్తున ఉంటే.. ప్రస్తుతం సగటున 47.44 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయన్నారు.

రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక పనులకు టెండర్లు 

  • కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి, దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి టెండర్లు పిలవాలి.
  • పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలి. 
  • చిత్రావతి, గండికోట జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు మిగిలిపోయిన భూసేకరణను పూర్తి చేయడం ద్వారా ఆ జలశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
  • ఈ సమీక్షలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నవంబర్‌ నుంచి పోలవరం గేట్లు బిగించాలి

  • పోలవరం ప్రాజెక్టు రేడియల్‌ గేట్ల తయారీ పనులను పూర్తి చేసి, నవంబర్‌ నుంచి స్పిల్‌ వేకు 48 గేట్లను అమర్చడం ప్రారంభించాలి. గోదావరికి వరద తగ్గాక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీలను భర్తీ చేసి.. గోదావరి డెల్టాలో రబీ పంటలకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ పనులను చేపట్టి గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి.
  • వరద వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులు చేసుకోవాలి. స్పిల్‌ వే పూర్తయ్యాక గేట్లను నవంబర్‌ నుంచి బిగించాల్సి ఉంటుంది కాబట్టి.. ఆలోగానే గేట్ల ఫాబ్రికేషన్‌ పనులు పూర్తి అయ్యేలా చూడాలి. ఈ అంశంలో ప్లాన్‌–బీ కూడా పెట్టుకోవాలి. పనులు ప్రణాళికా బద్ధంగా సాగకపోతే.. షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుంది.
  • గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని.. పోలవరం ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలి. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలి. (అధికారులు జూలైలోగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు) 2022 జూన్‌ నాటికి సాగుకు నీళ్లివ్వాలి.
  • పోలవరానికి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన  వ్యయంలో రూ.3,791 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఇందులో రూ.2,300 కోట్లను రీయింబర్స్‌ చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మిగిలిన రూ.1,491 కోట్లను కూడా రీయింబర్స్‌ చేయడానికి ప్రతిపాదనలను పంపాలని సీఎం ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement