సకాలంలో పోలవరం పూర్తి కావాల్సిందే: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Irrigation Projects Work Progress | Sakshi
Sakshi News home page

సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం జగన్‌

Published Fri, Jan 29 2021 4:55 PM | Last Updated on Fri, Jan 29 2021 6:43 PM

CM YS Jagan Review Meeting On Irrigation Projects Work Progress - Sakshi

సాక్షి, అమరావతి : నిర్ధేశించుకున్న లక్ష్యాలలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్ధేశించుకున్న పోలవరం సహా నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వెలిగొండ, వంశధార, అవుకు టన్నెల్‌ తదితర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి ప్రతి పనిలో కూడా ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రెండో విడత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌ల కార్యాచరణ సిద్దం చేయాలని, దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టండని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలలోపు పనులు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్షించి.. ప్రాధాన్యతా ప్రాజెక్టులు, సకాలంలో వాటిని పూర్తి చేయడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఇళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు.. 

సహాయ పునరావాస కార్యక్రమాలపైనా అధికారులతో సీఎం సమీక్షించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల పనుల పురోగతి, నెల్లూరు బ్యారేజీ సివిల్‌ వర్క్స్‌ పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. మార్చి 31లోగా గేట్ల బిగింపు పూర్తవుతుందని అన్నారు. ఏప్రిల్‌లో బ్యారేజీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సంగం బ్యారేజీకి సంబంధించి సివిల్‌ మేజర్‌ వర్క్స్‌ పూర్తయ్యాయని పేర్కొన్నారు. గేట్లకు సంబంధించిన సామగ్రి చేరిందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. రెండు వారాల్లో గేట్ల బిగింపు ప్రారంభించి, మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామన్న అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్‌, నీటిపారుదలశాఖ కార్యదర్శి జే శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్‌

అవుకు టన్నెల్‌ పనుల పురోగతి
అవుకు టన్నెల్‌లో లూజ్‌ సాయిల్‌ వల్ల క్లిష్టపరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటికే రెండు టన్నెల్స్‌ నుంచి దాదాపు 14వేల క్యూసెక్కుల వరకూ నీటిని పంపించగలుగుతాన్నమని, మరో టన్నెల్‌లో 134 మీటర్ల తవ్వకం పనుల్లో వర్షాలు, లూజ్‌సాయిల్‌ కారణంగా సమస్యలు వచ్చాయని అన్నారు. సొరంగంలో విరిగిపడ్డ మట్టిని తొలగించే పనులు, పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. జులై నాటికి ఈ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.

వెలిగొండ టన్నెల్‌ పనుల పురోగతి
వెలిగొండలో టన్నెల్‌ 1  హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. టన్నెల్‌ 2 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు ఏప్రిల్‌ 1 నుంచి  ప్రారంభం కానున్నట్లు, మూడున్నర నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. టన్నెల్‌ 1 తవ్వకం పనులు పూర్తి చేశామన్న అధికారులు లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. టన్నెల్‌ 2 లో ఆగష్టు నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్‌ నీటినిల్వకు సిద్ధం చేశామని అధికారులు తెలపగా.. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు అక్టోబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన కాల్వల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు.

పోలవరం_ప్రాజెక్టు:
► ఫిబ్రవరి 10 నాటికి స్పిల్‌ వే రోడ్‌ పూర్తిచేస్తామన్న అధికారులు
► స్పిల్‌ఛానల్‌లో  శరవేగంగా పనులు జరుగుతున్నాయన్న అధికారులు
► రేడియల్‌ గేట్లను అమర్చే ప్రక్రియ ఏప్రిల్‌ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు
► అప్రోచ్‌ ఛానల్‌ కూడా మే నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు 
►డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకూడదన్న సీఎం
►అనుమతులకోసం ప్రత్యేకించి ఒక అధికారిని పెట్టాలన్న సీఎం
►సిలెండర్ల దిగుమతిలో ఆలస్యం లేకుండా చూసుకోవాలన్న సీఎం

ఎగువ కాఫర్‌ డ్యాంలో రీచ్‌ 1 మార్చి నెలాఖరుకు, రీచ్‌ 2  ఏప్రిల్‌ నెలాఖరు నాటికి రీచ్‌, 3 మే నెలాఖరు నాటికి, రీచ్‌ 4 మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. 

► వచ్చే వర్షాకాలంలోగా కాఫర్‌ డ్యాం పనులు పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు
► గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్‌ డ్యాం కారణంగా ఎవరూ ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం
► ఆలోగా సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న సీఎం
► ప్రాధాన్యతా క్రమంలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు చేపట్టాలన్న సీఎం

ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులపై కూడా సీఎం సమీక్ష
► వంశధార ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను జులై నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు
► ఈ ప్రాజెక్టు కింద మొత్తం మూడు ప్యాకేజీల్లో పనులు పూర్తి చేసి జూలైనాటికి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామన్న అధికారులు
► వంశధార - నాగావళి అనుసంధానానికి సంబంధించి జూన్‌నాటికి పనులు పూర్తిచేస్తామన్న అధికారులు

తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులపైనా సీఎం సమీక్ష
► తోటపల్లి పెండింగ్ పనులను 2022 జూన్‌ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు 
► గజపతినగరం బ్రాంచి కెనాల్‌ కింద 15వేల ఎకరాలకు 2022 జూన్‌ నుంచి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
► తారకరామ తీర్ధసాగర్‌  ప్రగతిని వివరించిన అధికారులు
►న్యాయపరమైన వివాదాలపై దృష్టిపెట్టి, డిసెంబర్, 2022 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్న అధికారులు
►మహేంద్ర తనయ ప్రాజెక్టును జూన్, 2022 నాటికి పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
►కాల్వలకు భూసేకరణ పూర్తిచేసి... త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్న అధికారులు

పనులు వెంటనే మొదలుపెట్టాలి: సీఎం 
► రెండో ఫేజ్‌లో ప్రయార్టీ ప్రాజెక్టులతో కార్యాచరణ తయారు చేయాలని సీఎం ఆదేశం
►వీటితోపాటు ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
► రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టు, కృష్ణా కొల్లేరు సెలైనటీ మిటిగేషన్‌ ప్రాజెక్టు, ఏపీ స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌
► ప్రాజెక్టులకు సంబంధించిన ఎస్‌పివి(స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌)లపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలనూ సమీక్షించిన సీఎం
► ఆయా ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు
► రాయలసీమ, పల్నాడు కరువు నివారణ  ప్రాజెక్టులకు వివిధ ఆర్థిక సంస్థలతో సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని వెల్లడించిన అధికారులు
► మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపైనా దృష్టిపెట్టామన్న అధికారులు
►వరికిపూడిశెల పనులు సాగుతున్నాయని అధికారులు ముఖ్యమం‍త్రికి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement