ఏమిటీ జాప్యం? | KCR Fires On Officers In Irrigation Project Works | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

Published Sun, Dec 16 2018 1:35 AM | Last Updated on Sun, Dec 16 2018 4:11 PM

KCR Fires On Officers In Irrigation Project Works - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలి. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగట్లేదు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణాలు వేగవంతం కావాలి. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు.
– సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా యుద్ధప్రాతి పదికన పనులు చేయాలని పేర్కొన్నారు. సీతారామ, శ్రీరామ్‌ సాగర్, దేవాదుల పునరుజ్జీవం పథ కం పనులు మందకొడిగా నడుస్తుండటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యాన్ని సహిం చేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని, ఇందుకోసం అవసర మైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మా ణాన్ని స్వయంగా పరిశీలించేందుకు స్వయంగా రెండు రోజులపాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని సీఎం నిర్ణయించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నా రం బ్యారేజీలు, పంపుహౌస్‌లను మంగళవారం ఆయన సందర్శించనున్నారు. అనంతరం మరో రోజు ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో నిర్మి స్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో శనివారం ఏడు గంటలపాటు సమీక్షించారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టిన నిర్మా ణాలపై కూలంకషంగా చర్చించి అధికారులకు తగు సూచనలు చేశారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్, ఎంపీ బి. వినోద్‌ కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములకు తక్షణమే పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి రూ. 80 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు స్పష్టం చేశారు. భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పారు. ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాలువలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నుంచి ఆఫ్‌ టేక్‌ (ఓటీ) తూముల ద్వారా అన్ని చెరువులకు నీరందించాలి. కాకతీయ కెనాల్‌–ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ మధ్యనున్న ఆయకట్టుకంతా నీరందించేలా ఈ ప్రాంతంలోని అన్ని చెరువులు నింపాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పనుల్లో వేగం పెంచాలి...
‘తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలి. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగట్లేదు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణాల్లో వేగం పెరగాలి’అని కేసీఆర్‌ ఆదేశించారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను సందర్శిస్తానని సీఎం చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు, శ్రీరామ్‌సాగర్‌ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదని సీఎం అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ. 11 వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. వర్క్‌ ఏజెన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులను మేకల్లా పూర్తి చేస్తామని వర్క్‌ ఏజన్సీలు సీఎంకు మాటిచ్చాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

సింగూరు కింద రెండు ఎత్తిపోతలు..
సింగూరు కింద రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలల చొప్పున నీరందరించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కౌలాస్‌ నాలాను పటిష్టం చేయడంతోపాటు నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని చెప్పారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement