సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్‌నగర్ బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.
‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు.
కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు.
తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్..
తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment