సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/పటాన్ చెరు/గచ్చిబౌలి (హైదరాబాద్): తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెబుతున్న సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని తెలిసే కేసీఆర్ ఇలా అంటున్నారని చెప్పారు. తదాస్తు దేవతలు ఉన్నారని, వారంలోనే ఆయన మాట నెరవేరనుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సీఎంగా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం’అని చెప్పారు.
ఇవి సెమీఫైనల్ ఎన్నికలని, రాష్ట్రంలో ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో 2024లో ఢిల్లీ ఎర్రకోటలో తిరంగా జెండా ఎగుర వేయడానికి మార్గం సుగమవుతుందని, మోదీని ఇంటికి పంపిస్తామన్నారు. రేవంత్ ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, పటాన్‌చెరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార సభల్లో మాట్లాడారు.
‘ఈ బకాసురుడికి రూ. లక్ష కోట్లు దోచినా చాలట్లేదు. ధరణి పేరుతో రాష్ట్రంలో పదివేల ఎకరాలు మింగాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా తోకబట్టి ఈడ్చుకొచ్చి రూ.లక్ష కోట్లను కక్కిస్తాం. సీఎం కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూం నిర్మిస్తాం.. దోపిడీలో భాగమైన కొడుకు, బిడ్డ, అల్లుడికీ చోటు కల్పిస్తాం’అని వ్యాఖ్యానించారు.
పాలమూరు బిడ్డ సంతకంతోనే..
పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ ఏనాడూ పాలమూరును పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్‌దని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పాలమూరు బిడ్డను గెలిపించుకోకుంటే మళ్లీ గుంపు మేస్త్రీలు సంతల్లో పశువుల్లా వలస తీసుకెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌లో శషబిషలు, గ్రూపులు, గుంపులు లేవన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై ఎవరైనా చేయిచేసుకుంటే వారి గుడ్లు పీకి గోళీలు ఆడతానని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులున్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారని, ఇది పాలమూరు గడ్డ గొప్పతనమని చెప్పారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ, కేటీఆర్, హరీశ్ గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారని, పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు.
మూడోసారి మనవడికి ఇస్తారా?
కేసీఆర్ మూడోసారి గెలిపించాలని కోరుతున్నారని, ఇప్పటికే తాను సీఎం అయి, కొడుకు, అల్లుడిని మంత్రులను చేశారని, సంతోష్‌రావును ఎంపీగా చేశారని, నిజామాబాద్‌లో నేలకేసికొడితే బిడ్డను మళ్లీ ఎమ్మెల్సీని చేశారని, ఈసారి గెలిస్తే మనవడిని మంత్రి చేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. లక్కీ నెంబర్ ఆరు లాగా మనవడు మంత్రి అయ్యాడంటే అందరికీ పదవులొచ్చినట్లవుతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ 17 పరీక్షలను నిర్వహించి పల్లీలను అమ్మినట్లు పరీక్ష పేపర్లను అమ్మి మోసం చేసిందని, నిరుద్యోగులంతా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమాల్లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పరి్ణకారెడ్డి (నారాయణపేట), జి.మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), కాట శ్రీనివాస్ గౌడ్ (పటాన్‌చెరు) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment