'రివర్స్‌'పై పారని కుట్రలు! | Chandrababu Political Drama Fails On Reverse Tendering | Sakshi
Sakshi News home page

'రివర్స్‌'పై పారని కుట్రలు!

Published Wed, Sep 25 2019 4:46 AM | Last Updated on Wed, Sep 25 2019 11:23 AM

Chandrababu Political Drama Fails On Reverse Tendering - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తమ దోపిడీ బండారం బట్టబయలవుతుందనే భయంతో ‘రివర్స్‌ టెండరింగ్‌’ను అడ్డుకునేందుకు మాజీ సీఎం చంద్రబాబు రకరకాల కుట్రలకు తెర తీస్తున్నారు. పోలవరం పనులకు నిర్వహించిన రెండు టెండర్లలో ఆయన పాచికలు పారకపోవడంతో తాజాగా వెలిగొండ రెండో టన్నెల్‌ ‘రివర్స్‌ టెండరింగ్‌’ను నీరుగార్చడానికి కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో టెండర్లలో అధిక ధరకు కోట్‌ చేసి పోలవరం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లే ‘రివర్స్‌ టెండరింగ్‌’లో తక్కువ ధరకు కోట్‌ చేస్తూ బిడ్‌లు దాఖలు చేసేందుకు ముందుకు రావడంతో బెంబేలెత్తిన చంద్రబాబు వారితో పలు దఫాలు సుదీర్ఘంగా రాయబారాలు జరిపారు. ఒక పనికి గతంలో అధిక ధరకు కోట్‌ చేసిన వారు ఇప్పుడు తక్కువ ధరకు కోట్‌ చేస్తూ బిడ్‌ దాఖలు చేస్తే ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తుందంటూ బెదిరింపులకు దిగారు. రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనవద్దని ఆయా సంస్థలను హెచ్చరించారు. అయితే ఆయన ఎత్తుగడలు విఫలమయ్యాయి. తన అక్రమాలు రుజువులతో నిరూపితం అవుతుండటం వల్ల తన రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే ఆందోళనతో ఈ కుట్రలకు తెర తీసినట్లు పేర్కొంటున్నారు.

కాంట్రాక్టర్లకు బెదిరింపులు..
పోలవరం 65వ ప్యాకేజీ పనులకు రూ.274.25 కోట్ల అంచనా వ్యయంతో ఆగస్టు 17న రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో మొదటి నోటిఫికేషన్‌ జారీ అయింది. టీడీపీ హయాంలో ఈ పనులను 4.77 శాతం అధిక ధరలకు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. ఆ సంస్థతోపాటు మరో ఐదుగురు కాంట్రాక్టర్లు రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపారు. ఇది పసిగట్టిన చంద్రబాబు తన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతో మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తక్కువ ధరకు బిడ్‌ దాఖలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెడుతుందని భయపెట్టారు. మిగతా కాంట్రాక్టు సంస్థలతోనూ ఇదే రీతిలో సంప్రదింపులు జరిపారు. పోలవరం హెడ్‌వర్క్స్‌కు రివర్స్‌ టెండరింగ్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ వ్యతిరేకిస్తోందని.. జలవిద్యుత్‌ కేంద్రం రివర్స్‌ టెండరింగ్‌పై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోందని.. బిడ్‌లు దాఖలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విష ప్రచారం చేయడం ద్వారా కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను నమ్మించే యత్నం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుండటం, అవినీతి నిర్మూలనకు నడుం బిగించడం, లాలూచీలకు తావులేకపోవడంతో చంద్రబాబు, టీడీపీకి చెందిన మాజీ మంత్రుల సూచనలను వారు తోసిపుచ్చారు. 

బట్టబయలైన అక్రమాలు.. రూ.841.33 కోట్లు ఆదా
పోలవరం 65వ ప్యాకేజీ పనులను గతంలో 4.77 శాతం అధిక ధరలకు దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థే ఈసారి రివర్స్‌ టెండరింగ్‌లో 15.6 శాతం తక్కువ ధరకు చేజిక్కించుకుంది. దీనివల్ల ఖజానాకు రూ.58.53 కోట్లు ఆదా అయ్యాయి. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం టెండర్లలో మేఘా సంస్థ 12.6 శాతం తక్కువ ధరలకు పనులు దక్కించుకుంది. దీనివల్ల ఖజానాకు మరో రూ.782.8 కోట్లు ఆదా అయ్యాయి. వెరసి రెండు రివర్స్‌ టెండర్లలో రూ.841.33 కోట్ల మేరకు ప్రజాధనం ఆదా అయింది. ఈ రెండు రివర్స్‌ టెండర్లు చంద్రబాబు అక్రమాలను బహిర్గతం చేశాయి. రివర్స్‌ టెండరింగ్‌తో భారీగా ప్రజాధనం ఆదా అవుతుండటం, తన అక్రమాలు బయటపడటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా వెలిగొండ రెండో టన్నెల్‌ పనులకు రూ.528.35 కోట్లతో ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ టెండర్‌ను నీరుగార్చేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

పోలవరం రివర్స్‌ టెండర్లతో నష్టం 
టీడీపీ నేతల సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్య 
రాజకీయ దురుద్దేశంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. రివర్స్‌ టెండర్‌ పేరుతో టెండర్‌ను రిజర్వ్‌ చేశారన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రివర్స్‌ టెండర్ల వల్ల రాష్ట్రానికి లాభం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల ప్రజలకు జరిగే నష్టం ఎంతో చెప్పాలన్నారు. అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు భద్రతతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు హైడల్‌ వర్క్స్, పవర్‌ హౌస్‌ పనులు రెండింటిని ఎందుకు కలిపారని, సీవీసీ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు. గతంలో ఇదే సంస్థ పోలవరం పనుల్లో టెండర్‌ ఎక్కువకు వేసిందని, అప్పుడు ఇదే మేఘా తన బినామీ అని, పట్టిసీమలో దానికి రూ. 350 కోట్లు దోచిపెట్టానని విమర్శించారని చెప్పారు. గతంలో పనిచేసిన సంస్థలకు నష్ట పరిహారం కింద ఎన్ని వందల కోట్లు చెల్లిస్తారని ప్రశ్నించారు. పోలవరం పనుల్లో తక్కువకు టెండర్‌ వేయడం ద్వారా నాసిరకం పనులు చేస్తారా, లేక వాళ్లకు వేరే విధంగా లబ్ధి చేకూరుస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement