మధ్య మానేరుకు మరో రూ. 250 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మధ్య మానేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ. 250 కోట్లు అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ముంపు గ్రామాల్లో పునరావాసం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలనే నిర్ణయాన్ని ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదించింది. మిడ్‌మానేరు రిజర్వాయర్ ముంపు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు శనివారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు నీటిపారుదల, రెవెన్యూ విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ప్రాణహిత ప్రాజెక్టుకు మిడ్‌మానేరు రిజర్వాయర్ గుండెకాయ వంటిదని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముంపు గ్రామాల్లోని ఇళ్లు, ఇతర కట్టడాల విలువ తరుగుదలను 35 శాతానికి పరిమితం చేయాలని అధికారులకు సూచించారు. గతంలో చెల్లించిన నష్టపరిహారం కంటే తక్కువ కాకుండా ప్రస్తుత పరిహారం లెక్కించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు హరీశ్, కేటీఆర్ ఆదేశించారు.
2015 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు దాటిన నిర్వాసితులకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని దినాలకు గాను ప్రస్తుతం ఇస్తున్న రోజుకు వంద రూపాయలను, రూ.180కి పెంచాలని మంత్రులు సూచించారు. ముంపు గ్రామాల పునరావాస కేంద్రాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, సిరిసిల్ల అర్బన్ ప్రాం తంలోని సుమారు 423 ఎకరాల భూములను జీఓ 123 ప్రకారం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
భూ సేకరణ కోసం రైతులతో వెంటనే సంప్రదింపులు ప్రారంభించాలని కరీంనగర్ కలెక్టర్‌ను ఆదేశించారు. మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలోని గోపాల్‌రావుపేటలో 32 ఇళ్లకు పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అక్టోబర్ 31లోపు అమలు చేయాలని అన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ మానిక్‌రాజ్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, కరీంనగర్ కలెక్టర్ నీతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.