రైతుల పేరుతో రాజకీయాలా?
సంగారెడ్డి మున్సిపాలిటీ: రైతుల పేరుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్‌కు రైతులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో వీరు ఒక్కరోజైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమన్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేవని, మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అప్పట్లో కోరినా పట్టించుకోని కాంగ్రెస్..
ఈ రోజు టీఆర్‌ఎస్‌ను విమర్శించడం అవివేకమన్నారు. రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలకు అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాహుల్ స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఇన్‌ఫుట్ సబ్సిడీ ఘనత మాదే
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రూ.400 కోట్లతో మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని గత పదేళ్లలో ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. వడగళ్ల వానతో గతంలో వరుసగా నాలుగేళ్లు రైతులు నష్టపోతే రూ.480 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా, అందులో పైసా కూడా ఇవ్వలేదన్నారు. తాము రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని అందించామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు ఆంధ్రాలో రుణమాఫీ చేయని టీడీపీ సర్కార్‌పై ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు.
6 లక్షల ఎకరాలకు సాగునీరు!
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 25 లక్షల మందికి పింఛన్లు ఇస్తే తాము 36 లక్ష ల మందికి ఇస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా తెలంగాణలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. జిల్లాకు 4 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని, సీఎం అదనంగా మరో 1500 ఇళ్లు ఇస్తామని ప్రకటించారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.