6న ఢిల్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో ఈ నెల 6న ఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యు డు, రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావును కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆహ్వానిం చారు. ఈ మేరకు గురువారం హరీశ్‌రావుకు లేఖ పంపారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి.
భూసేకరణను వేగవంతం చేయండి...
పీఎంకేఎస్‌వై పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై సాగునీటిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీతో కలసి హరీశ్‌రావు సమీక్షించా రు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు కోసం 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇంతవర కు 10,428 హెక్టార్లు సేకరించారని, మిగతా భూమిని త్వరితగతిన సేకరించాలని సూచించారు. దీంతోపాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురం భీం ప్రాజెక్టు పరిధిలో మిగిలిన భూసేకరణను వేగిరం చేయాలని ఆదేశించారు.