‘మిషన్ కాకతీయ’ భేష్: ఏఎఫ్‌ఎంఐ
చికాగో సదస్సులో పాల్గొనాలని హరీశ్‌రావుకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’కు మరో ఖండాంతర ఖ్యాతి దక్కింది. మిషన్ కాకతీయతో తెలంగాణ దేశానికే దిక్సూచి అవుతోందని భారత సంతతికి చెందిన ముస్లింల అమెరికా సమాఖ్య (ఏఎఫ్‌ఎంఐ) కొనియాడింది. ఈ మేరకు ఏఎఫ్‌ఎంఐ అధ్యక్షుడు రజియా అహ్మద్ బుధవారం నీటిపారుదల మంత్రి టి.హరీశ్ రావుకు లేఖ రాశారు. ‘భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళు, లౌకికవాదం – బహుళత్వం’అనే అంశంపై అక్టోబర్7న చికాగోలో నిర్వహిస్తున్న సదస్సులో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని కోరారు.
మిషన్ కాకతీయతో 17 వేల చెరువులను పునరుద్ధరించి 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుతో పాటు మొత్తం 15 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద సాగునీరందించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. మిషన్ కాకతీయతో తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో అనూహ్యమైన మార్పు వచ్చిందన్నారు. మంత్రి హరీశ్ రావును దూరదృష్టి ఉన్న నేతగా కొనియాడారు. అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రజల్లో హరీశ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.