
ఆదిలాబాద్‌లో 3.2 లక్షల ఎకరాలకు నీరు
► మిషన్ కాకతీయ ద్వారా సాగులోకి తెచ్చాం: మంత్రి హరీశ్
► జిల్లా ప్రాజెక్టులపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది మిషన్ కాకతీయ, జైకా నిధులతో చేపట్టిన పనులతో 3.2 లక్షల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించి నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టక ముందు చెరువుల కింద ఆయకట్టు లక్ష్యాలలో 30 శాతమే సాగునీరందేదని, ప్రస్తుతం 90 నుంచి 100 శాతం ఆయకట్టుకు నీరు అందుతోందని చెప్పారు. సోమవార మిక్కడ జలసౌధలో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పథకాలను ఆయన సమీక్షించారు.
జిల్లాలో గడచిన పదేళ్లుగా భూసేకరణ, అటవీ అనుమతుల వంటి సమస్యల కారణం గా పెండింగ్‌లో ఉన్న 57 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి కింద సుమారు 40 వేల ఎకరాలను సాగులోనికి తెచ్చినట్టు మంత్రి చెప్పారు. జపాన్ ఆర్థిక సహకారంతో ప్రారంభమైన 47 ప్రాజెక్టుల్లో 40 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి 39 వేల ఎకరాలు సాగులోకి తెచ్చినట్టు వివరించారు. మిషన్ కాకతీయలో బోథ్ ప్రాజెక్టు కింద 5,000 ఎకరాలు, బజార్ హత్నూర్ ప్రాజెక్టు కింద 4,500 ఎకరాలు, చింతల్‌బోరి ప్రాజెక్టు కింద 1500 ఎకరాలు ఈ ఏడాది సాగులోకి తెచ్చామన్నారు.
గడ్డెన్నవాగు డ్యామ్ నిర్మా ణం పూర్తి చేయడంతోపాటు కాలువలను ఆధునీకరించడంతో 10వేల ఎకరాలకు నీరం దిందన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నాటికి 45,500 ఎకరాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు. సాత్నాలా, స్వర్ణ, వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టులతోపాటు కడెం, సరస్వతి, సదర్మట్ కాల్వల కింద గ్యాప్ ఆయకట్టును పూరించ డానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చనాఖా–కొరటా పనులను వచ్చే ఏడాది జనవరికి పూర్తి చేసి 10 వేల ఎకరాలకు నీరం దించాలని అధికారులకు సూచించారు.