
మెతుకుసీమలో అభివృద్ధి పరుగులు
♦ ‘మిషన్ కాకతీయ’తో చెరువులకు కొత్తకళ
♦ ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికి నల్లా నీళ్లు
♦ గ్రామీణ పట్టణ రహదారులకు మహర్దశ
♦ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట
♦ ఉరకలు పెడుతున్న పారిశ్రామిక అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతకుసీమలోని పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో అభివృద్ధి పనులు ఉరకలు పెడుతున్నాయి. సంక్షేమ ఫలాలు సైతం ప్రజల దరిచేరుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మిషన్‌కాకతీయతో చెరువుల పూడికతీత పనులు జోరుగా సాగుతున్నాయి. సింగూరు, ఘనపురం ఆయకట్టుతో పాటు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిషన్‌భగీరథ ద్వారా రాబోయే కొద్దిరోజుల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నీరు సరఫరా చేయనున్నారు.
ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. మీటన్నింటికీ మించి రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. పంట రుణాల మాఫీతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన మెదక్ జిల్లాలో టీఎస్ ఐపాస్ ద్వారా ప్రభుత్వం 900 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసింది. రూ.650 కోట్ల పెట్టుబడులతో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
శరవేగంగా మిషన్ భగీరథ
ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి వ్యక్తికి వందలీటర్ల శుద్ధి జలాలు సరఫరా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్‌భగీరథ పనులు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ఁభగీరథ*కు శ్రీకారం చుట్టింది. జిల్లా అంతటా పైపులు వేయటంతో పాటు సింగూరు వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మొదటి విడతలో త్వరలో పనులు త్వరలో పూర్తి కానున్నాయి. పంప్‌హౌస్, సంప్‌హౌస్, నీటిశుద్ధి ప్లాంట్లు, వాటర్‌ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గజ్వేల్‌లోని 249 గ్రామాలకు ఇప్పటికే 35,516 నల్లా కనెక్షన్లు బిగించారు.
‘కాకతీయ’తో చెరువులకు పూర్వవైభవం
చిన్ననీటి వనరుల పునరుద్ధరణ కింద జిల్లాలో మిషన్‌కాకతీయ మొదటి విడతలో భాగంగా 1,684 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.362 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 1346 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. మిషన్‌కాకతీయ రెం డో విడతలో రూ.454 కోట్లతో 1,679 చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. ఇప్పటికే 1,045 చెరువుల్లో పనులు ప్రా రంభమయ్యాయి. రూ.33 కోట్లతో 10 చెరువులను మినీ ట్యాంక్‌బండ్ లుగా మార్చేందుకు సర్కార్ సిద్ధమైంది. మరో నాలుగు చెరువుల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
సాగునీటి ప్రాజెక్టులకు కొత్తకళ
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను సింగూరు తరలించాలని ధృడసంకల్పంతో ఉంది. అదే సమయంలో చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సింగూరు ప్రాజెక్టు కాల్వల నిర్మాణం, ఇతర మరమ్మతుల కోసం రూ.105 కోట్లు ఖర్చు చేస్తోంది. అదేవిధంగా ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల ఆధునికీకరణ పనుల కోసం రూ.60.59 కోట్లు మంజూరుచేసింది. పనులు పూర్తయితే 21,625 ఎకరాలకు మేలు జరుగుతుంది. వీటితోపాటు 50 టీఎంసీల సామర్థ్యంతో కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్, 7 టీఎంసీలతో కొండపోచమ్మ, 3.5 టీఎంసీలతో అనంతగిరి, 0.8 టీఎంసీలతో రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్‌లను నిర్మించనున్నారు.
రహదారులకు కొత్త దశ
జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా పంచాయతీరాజ్ శాఖ రహదారుల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.705 కోట్లతో రహదారులు, బ్రిడ్జిల నిర్మాణాలు మొదలయ్యాయి. మొత్తం 2318.11 కి.మీ. మేర పనులు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1288.90 కిలోమీటర్లు పూర్తయ్యాయి. అదేవిధంగా 37 రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం పనులు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం రూ.377 కోట్లతో రహదారుల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రత్యేక మరమ్మతుల కింద రూ.34 కోట్లతో 13 పనులు జరుగుతున్నాయి. మండల కేంద్రాలు రోడ్డు విస్తరణ పనులు రూ.55 కోట్లతో చేపట్టారు. సింగిల్ లైన్‌రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా మార్చే పనుల కోసం రూ.72 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కార్నెట్ ప్లాన్ ద్వారా రహదారుల నిర్మాణం కోసం రూ.70 కోట్లు ఖర్చు చేయనుండగా రూ.40 కోట్లతో వంతెనలు నిర్మిస్తున్నారు.
వేగంగా డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. పది నియోజకవర్గాలకు 11,400 గృహాలు మంజూరయ్యాయి. నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, నర్సాపూర్ నియోజకవర్గాలకు 400 చొప్పున.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి 3400, సిద్దిపేటకు 2200, మెదక్‌కు 2200, దుబ్బాకకు 1200 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 9220 గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లిలో 285, నర్సన్నపేటలో 200 ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. గజ్వేల్ నగర పంచాయతీలో 1250 ఇళ్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది.
సంక్షేమానికి పెద్దపీట
ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోంది. డీఆర్‌డీఏ ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లను అందిస్తోంది. భూమి కొనుగోలు పథకం ద్వారా రెండేళ్లుగా రూ.57.89 కోట్లతో 544 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 1,237 ఎకరాల సాగు భూమి పంపిణీ చేస్తోంది. జిల్లాలో మొత్తం 3.40 లక్షల మందికి నెలకు రూ.35 కోట్ల ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. రెండేళ్లలో మహిళలకు 85 వేల గ్యాస్ కనెక్షన్‌లు మంజూరుచేశారు. కల్యాణలక్ష్మి పథకం కింద 3900 మంది ఎస్సీలకు రూ.20 కోట్లు, 1300 మంది ఎస్టీలకు రూ.7 కోట్లు పంపిణీ చేస్తున్నారు. షాదీముబారక్ కింద ,2500 మైనార్టీలకు రూ.13 కోట్లు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.