ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడుగంటిన బావులు, చేతి పంపులు
‘భగీరథ’నీటి సరఫరాకు సమస్యలు
సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులే ఆధారం
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్‌లోనూ ఇదే సమస్య ఉంది.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది.
చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
నీటి కోసం పని మానేస్తున్నాం
గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా
బోరు నీళ్లే తాగుతున్నాం
భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది.
–రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment