సాగర్ జలాల విడుదల
ఏప్రిల్, మే నెలలకు సరిపడా జలాలు
తప్పిన తాగునీటి గండం
సాక్షి, మహబూబాబాద్: మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు జలాశయంలో నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు వదిలారు. ఎడమ కాల్వనుంచి రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాలకు పొంచి ఉన్న తాగునీటి ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 2,439 గ్రామాలకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు.
వీటి పరిధిలోని సుమారు 22లక్షల జనాభాకు పాలేరు నుంచి వచ్చే గోదావరి నీరే ఆధారం. ఇటీవల పాలేరు జలాశయం అడుగంటే పరిస్థితికి చేరుకుంది. 2.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో నీరు బుధవారం నాటికి 0.49 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటితో రెండు, మూడు రోజులకు మించి తాగునీరు అందదని అధికారులు భావించి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు.
ఈ నేపథ్యంలో సాగర్ జలాలు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు విడుదల చేసే నీరు ఏప్రిల్, మే నెలలకు సరిపోనుందని, ప్రస్తుతానికి గండం తప్పినట్లేనని పాలేరు గ్రిడ్ డీఈ మురళీకృష్ణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment