మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వంపై మంత్రి హరీశ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులను సకాలంలో పూర్తి చేయించడంలో విఫలమైన అధికారులపై వేటు వేసిన నీటి పారుదల శాఖ.. తాజాగా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపైనా వేటుకు సిద్ధమైంది. కాంట్రాక్టు పొందినా పనులు చేయడంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టు సంస్థలు, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఈ -టెండరు విధానంలో చెరువుల పునరుద్ధరణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. ఒప్పందం చేసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒప్పందం కుదిరినా పనులు మందకొడిగా సాగుతున్నాయి.
వర్షాకాలం సమీపించినా పనులు ప్రారంభమయ్యేలా చూడటంలో విఫలమైన నల్లగొండ జిల్లా నీటిపారుదల శాఖ సీఈ పురుషోత్తం రాజును బదిలీ చేయగా.. వరంగల్ ఎస్‌ఈ విజయ భాస్కర్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా మంత్రి హరీశ్‌రావు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాల మేరకు నల్లగొండ, మెదక్ జిల్లాల్లో పలువురు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో.. సిద్దిపేట డివిజన్‌లో ఎనిమిది చెరువుల పునరుద్ధరణ పనులు పొందిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. అలాగే రెండో దశ కింద పనులు పొందినా.. ప్రారంభించని మరో ముగ్గురిని బ్లాక్ లిస్టులో పెట్టారు.
నల్లగొండ జిల్లాలోనూ రెండో విడతలో పనులు పొందిన ఆరుగురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఐదు రోజుల వ్యవధిలో అగ్రిమెంట్ చేసుకోని కాంట్రాక్టర్లను తక్షణం పనులనుంచి తప్పించాలని ఆదేశించారు. పనులను చేయని ఎల్-1 కాంట్రాక్టును (పనులను దక్కించుకున్న సంస్థ కాంట్రాక్టు) రద్దు చేస్తూ.. అదే ధరకు ఎల్-2కు పనులు అప్పగించాలని.. ఒక వేళ ఎల్-2కూడా ముందుకురాని పక్షంలో ఎల్-3కి ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎవరూ ఆసక్తి చూపని పక్షంలో టెండర్‌ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టంచేశారు. మిషన్ కాకతీయ పథకంలో రెండో విడతలో పనులు పొందిన కాంట్రాక్టర్లు తక్షణమే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.