ఏడుగురు సస్పెన్షన్.. ఆరుగురిపై శాఖా పరమైన చర్యలు
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ ఇంజనీర్లపై వేటు పడింది. చెరువు పనుల్లో అక్రమాలు రుజువు కావడంతో ఏడుగురు ఇంజనీర్లపై సస్పెన్షన్ విధిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరుగురు ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. 36 మంది కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు, వారి నుంచి సొమ్ము రాబట్టాలని నిర్ణయించింది.
మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ డివిజన్‌లో మిషన్ కాకతీయ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. మట్టి పని చేయకుండానే చేసినట్లు, తక్కువ మట్టి తీసి ఎక్కువగా తీసినట్లు ఇంజనీర్లు రికార్డులు సృష్టించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరిశీలించకుండానే పని జరిగినట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీనిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు గతేడాది సెప్టెంబర్‌లో నిర్ధారించింది. దీనికి 13 మంది ఇంజనీర్లను బాధ్యులుగా తేల్చింది.
వీరిలో నిర్మాణ విభాగం, నాణ్యతా విభాగానికి సంబంధించిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 8 మంది ఏఈలు ఉన్నారు. ఇందులో 12 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఒక డీఈఈపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. విజిలెన్స్ సూచనలకు అనుగుణంగా గురువారం నలుగురు ఏఈఈ, ఇద్దరు డీఈ, ఒక ఈఈపై సస్పెన్షన్ వేటు పడగా, క్వాలిటీ కంట్రోల్ ఈఈ, ఒక డీఈఈ, మరో నలుగురు ఏఈఈలపై శాఖా పరమైన చర్యలు తీసుకోనుంది. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్టర్ల నుంచి రూ.2కోట్ల వరకు రికవరీ చేయనున్నారు