సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా ఉన్న నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగం లోకి తేవడం, సుమారు రూ.2లక్షల కోట్ల ఖర్చుతో.. 1.25కోట్ల ఎకరాలకు పైగా సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఓ యజ్ఞంలా సాగుతోంది. నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు.. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగు యోగ్యత కల్పించడం లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతోంది. రాష్ట్ర పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కనూ పరీవాహక ఆయ కట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం.. వరదలు వచ్చినపుడు గరిష్టంగా వీలైనంత నీటిని ఒడిసిపట్టు కునేందుకు చేస్తున్న భగీరథ యజ్ఞంలో ఇప్పటికే కొత్తగా 16.65లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మరో 10లక్షల ఎకరాలను సాగులోకి తేనుంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై లక్ష కోట్ల ఖర్చు చేయగా.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏకంగా రూ.70వేల కోట్ల ఖర్చు చేసి కొత్త రికార్డులు నెలకొల్పింది. మరో లక్ష కోట్లు ఖర్చు చేసైనా.. కోటికిపైగా ఎకరాలకు నీరిందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రికార్డు స్థాయిలో ఖర్చు.. రుణాలే కీలకం!
మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటిపై ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. ఐదేళ్లలో సాగునీటికై రూ.70వేల కోట్ల మేర ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.20,040కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతానికి రూ.21,489కోట్లు ఖర్చు చేశారు. ఇది మార్చి నాటికి రూ.23వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13,107కోట్లు మేర ఖర్చు చేయగా, కార్పొరేషన్ రుణాల ద్వారానే రూ.9,013కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.15వేల కోట్ల మేర ఖర్చు చేయగా, ఇందులో రుణాల ద్వారా రూ.12,739కోట్లు ఖర్చుచేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, వీటి ద్వారా మరో రూ.2,800 కోట్లు ఖర్చు చేశారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం ఈసారి రూ.17వేల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే మొత్తంగా ప్రభుత్వం తీసుకునే రుణాలు రూ.70వేల కోట్లను చేరనున్నాయి.
నిర్వహణకే తడిసి మోపెడు!
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం)కే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి ఏకంగా విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో విద్యుత్ అవసరాల ఖర్చే ఏకంగా రూ.37,796కోట్లు ఉండగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374కోట్లు ఉండనుంది. ఈ ఏడాదికే కొత్తగా 4,689 మెగావాట్ల విద్యుత్ అదనంగా అవసరంగా ఉండగా, ఇప్పటికే ఉన్న అవసరంతోకలిపి అది 6,099 మెగావాట్లకు చేరనుంది. మొత్తంగా 2021–22 నాటికి మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,722 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం అవుతుంది.
ఆయకట్టు.. పనిపట్టు!
ఇక రాష్ట్రంలో మొత్తంగా 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.65లక్షల ఎకరాలమేర సాగులోకి రాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78లక్షల ఎకరాలను సాగులోకి తేగలిగింది. మరో 54లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది జూన్ ఖరీఫ్ నాటికి కనిష్టంగా 12లక్షల ఎకరాలకైనా కొత్తగా నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న ఆయకట్టు లక్ష్యాలను చేరాలంటే భూసేకరణ అత్యంత కీలకంగా మారనుంది. ప్రాజెక్టుల పరిధిలో మరో 58వేలకు పైగా భూమి సేకరించాల్సి ఉండటం ప్రభుత్వానికి పరీక్ష పెడుతోంది.
‘కాకతీయ’కు నిధుల కరువు
చిన్న నీటివనరుల పునరుద్ధరణకై చేపట్టిన మిషన్ కాకతీయ అనుకున్న లక్ష్యాలని చేరింది. మొత్తం 4 విడతల ద్వారా చేపట్టిన పనులతో 8టీఎంసీల నీటి నిల్వ పెరగడంతో పాటు 13.8లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అయితే 3,4వ విడత పనుల పూర్తికి 800 కోట్ల మేర బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ పనులు పూర్తి జరగడం లేదు.
కాళేశ్వరా.. కదిలిరా!
ఈ ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. ఖరీఫ్ నాటికి కనిష్టంగా 100 టీఎంసీల నీటిని ఆయకట్టుకు మళ్లిస్తారని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించగా, ఇందులో ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తయ్యాయి.
బ్యారేజీల్లో గేట్ల బిగింపు పూర్తవుతుండగా, పంప్‌హౌజ్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియలో వేగం పెరిగింది. ఎట్టిపరిస్థితుల్లో మార్చి, ఏప్రిల్ నాటికి మిడ్‌మానేరు వరకు పనులు పూర్తిచేసి కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇక మిడ్‌మానేరు కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్‌పనులు జరుగకున్నా, ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ ఛానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment