
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో లక్ష కోట్ల నిధుల అవసరం ఉంది. లక్ష కోట్ల మేర ఖర్చు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టు రాష్ట్రంలో సాగులోకి రానుంది. మొత్తంగా రాష్ట్రంలోని 38 భారీ, మధ్యతరహా ఎత్తిపోతల పథకాల పూర్తికి రూ.2.19 లక్షల కోట్ల మేర అవసరం ఉండగా, ఇందులో ప్రభుత్వం ఇప్పటికే 1.15 లక్షల కోట్ల మేర ఖర్చు చేసింది. మరో 1.04 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలపైనే రూ.54 వేల కోట్ల మేర ఖర్చు చేసింది.
ఈ ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి రోజుకు ఒక టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసేలా పనులు చేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా రూ.10 వేల కోట్ల రుణాలు సేకరించగా, దీని నుంచే అధికంగా ఖర్చు చేయనుంది. లక్ష్యం మేరకు పనులు పూర్తయితే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాదికే 7 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 1.24 కోట్ల ఎకరాలకు ఆయకట్టు వసతి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70.1 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.77 లక్షల ఎకరాల మేర సాగులోకి రాగా, రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.9 లక్షల ఎకరాలను సాగులోకి తేగా, మరో 53.33లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది.
రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇలా..
- మొత్తం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు: 38
- ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మొత్తం: రూ.2,19,513.9 కోట్లు
- ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం: రూ.1,15,417.72 కోట్లు
- ఇంకా ఖర్చు చేయాల్సిన మొత్తం: రూ.1,04,096.18 కోట్లు
- రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఖర్చు చేసిన మొత్తం: రూ.80 వేల కోట్లు
- ప్రాజెక్టులతో సాగులోకి రావాల్సిన ఆయకట్టు: 70.1 లక్షల ఎకరాలు
- ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయకట్టు: 16.77 లక్షల ఎకరాలు
- ఇంకా సాగులోకి రావాల్సింది: 53.33 లక్షల ఎకరాలు
Comments
Please login to add a commentAdd a comment