అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు
కాంగ్రెస్ నేతలపై పాతూరి సుధాకర్‌రెడ్డి
సాక్షి , హైదరాబాద్: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు కాంగ్రెస్ పార్టీ నేతలని శాసన మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ వంటి పథకంపై కూడా వారు విషం కక్కుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో మాట్లాడారు. మిషన్ కాకతీయతో తాము ప్రజలకు దగ్గరవుతు న్నామనే, కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో ఎన్ని టీఎంసీల నీళ్లు చేరాయో కూడా వారికి కనీస పరిజ్ఞానం లేదన్నారు. ప్రజల అవసరాలను గమనించి ఎప్పటికపుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్న హరీశ్‌రావు వంటి సమర్థ మంత్రిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
తప్పుడు ప్రచారం మానుకోండి: కాంగ్రెస్ నాయకులు మిషన్ కాకతీయ పథకం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని కూడా గుర్తించరా అని నిలదీశారు. మిషన్ కాకతీయ ఫలితాలను ఈ ఖరీఫ్ లో ఇప్పటికే తెలంగాణ ప్రజలు చూశారన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు విషయం కొందరికి ముందే లీక్ అరుుందనే ఆరోపణలు చాలా తీవ్రంగా పరిగణించాల్సినవని, దీనిపై కేంద్రం విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని ఎంపీ బూర కోరారు.