6,250 చెరువుల పునరుద్ధరణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో విడత పనుల్లో చిన్న నీటి పారుదల శాఖ వేగం పెంచింది. ఓవైపు పరిపాలనా అనుమతులు, మరోవైపు టెండర్లు, ఇంకోవైపు పనుల ఆరం భాన్ని వేగంగా పూర్తి చేస్తోంది. ఈ విడతలో 6,250 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న శాఖ ఇప్పటికే రూ.1,959.82 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చింది. మొత్తంగా 46,531 చెరువులను లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 8,045 పనులను ఆరంభించింది. ఇందులో రూ.1,632 కోట్ల తో 8,022 చెరువుల పనులను శాఖ పూర్తి చేసింది. ఇక రెండో విడతలో 9,016 చెరు వులకు అనుమతులివ్వగా ఇందులో రూ.1,966.78 కోట్ల వ్యయంతో కూడిన 8,887 చెరువుల పనులను ఆరంభించారు.
రెండో విడత పనులకు జూన్ డెడ్ లైన్
ఇక గతేడాది రెండో విడత ఆరంభ సమ యానికే మొదటి విడత చెరువులే భారీగా పెండింగ్ ఉండటంతో రెండో విడత చెరు వుల పునరుద్ధరణ మార్చిలో ఆరంభమైంది. దీంతో పనులు చేసేందుకు జూన్, జూలై వరకు కేవలం 3 నెలల సమయమే దొరి కింది. అనంతరం భారీ వర్షాల వల్ల చాలా చెరువుల్లో నీరు చేరడంతో పనులు ఆలస్య మయ్యాయి. తిరిగి జనవరి నుంచి పనులు ఆరంభించినా ఇప్పటివరకు కేవలం 3,500 చెరువులను మాత్రమే పూర్తి చేయగలిగారు. మరో 6,500 చెరువులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పూర్తికి ఈ ఏడాది జూన్ టార్గెట్‌గా నిర్ణయించారు. ఇక రెండో విడత పనుల జాప్యం కారణంగా మూడో విడతలో కేవలం 6,250 చెరువులకు మాత్రమే శాఖ పరిమితం అయింది.
ఇందులోనూ వర్షాలు తక్కువగా కురిసిన మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల చెరువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను మూడో విడతలో ప్రాధాన్యం కల్పించారు. ప్రస్తుతం వరకు రూ.1,959.82 కోట్లతో 6,250 చెరువులకు అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా, అందులో రూ.1,079.48 కోట్లతో 3,889 చెరువులకు ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఇందులోనూ 2వేల చెరువులకు టెండర్లు పిలవగా, సుమారు వెయ్యి పనులు మొదలయ్యాయి. ఈ వారం లోనే మరో 2వేల చెరువులు ఆరంభించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మూడో విడత చెరువుల్లో వీలైనన్ని ఎక్కువ చెరువు లను పూడికతీత ద్వారా జూలై నాటికి సిద్ధం చేయాలని మిగతా పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.