దేశానికే ఆదర్శం | Is the motto of the country | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శం

Published Sat, Jun 11 2016 2:07 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

Is the motto of the country

మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ

 

దేవాదులతో నూతనంగా 35 వేల ఎకరాలకు సాగునీరు  దేశంలోనే నంబర్ వన్  సీఎం కేసీఆర్ స్పీకర్ భూపాలపల్లిని తీర్చిదిద్దుతున్నారు యువ ఎమ్మెల్యేలు   ఆదర్శంగా తీసుకోవాలి - మంత్రి తన్నీరు హరీశ్‌రావు

 

భూపాలపల్లి : మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి శాసన సభాపతిగా ప్రమాణ స్వీకారం చేసి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భూపాల పల్లిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో నిర్మిస్తున్న పార్కులో మొక్కలను నాటారు. అనంతరం బస్‌డిపోలో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సును ప్రారంభించారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి క్రీడా మైదానం వరకు భారీ ర్యాలీగా వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నంబర్ 1 సీఎం అని ఇండియా టుడే తన సర్వేలో వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంతో నూతనంగా 35 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఈ మేరకు పనులు చేపడుతున్నామని ఆయన చెప్పారు.


ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, కళ్యాణ లక్ష్మీ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు. అరుుతే, తెలంగాణపై కేంద్రానికి ప్రేమ లేదని, రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదన్నారు. దేశంలో ఏ శాసన సభాపతి పనిచేయని విధంగా సిరికొండ మధుసూదనాచారి అభివృద్ధి పనులు చేస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. రెండేళ్ల కాలంలో  రూ. 1100 కోట్ల అభివృద్ధి పనులు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. యువ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూపాలపల్లి పట్టణ ప్రధాన రహదారిపై ఏడు కిలో మీటర్ల పొడవునా బటర్ ఫ్లై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించడం హర్షనీయమన్నారు. భూపాలపల్లిలో తిరుగుతుంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుందన్నారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా మేధావులు, విద్యావంతులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పాలనను దేశం మెచ్చుకుంటున్నా.. చేతకానివారు తప్పుకోవాలని అంటూ కొందరు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. వారు ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సభలో పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీ సీతారాంనాయక్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు కొండా మురళి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నవనీతరావు, సిరికొండ ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, టీబీజీకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement