
కూలిన దేవుని చెరువు కట్ట
- బూడిదలో పోసిన పన్నీరైన ప్రజాధనం
- కట్టపైనుంచే తండాకు రోడ్డు
- గిరిజనులకు తప్పని తిప్పలు
మెదక్: ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువు కట్ట పనులు నిర్మించిన వెంటనే చిరు జల్లులకే కూలిపోయింది. దీంతో ఆయకట్టు రైతులతోపాటు కట్టపై నుండి వెళ్లే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులోని దేవుని చెరువు మరమ్మతులకోసం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సుమారు రూ.20లక్షలు నిధులు మంజూరయ్యాయి. దీని నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావుతోపాటు డిప్యూటీ స్పీకర పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.
ఆన్‌లైన్ టెండర్ ద్వారా పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ చెరువులోని నల్లమట్టిని పంట పొలాలకు తరలించడంతోపాటు మొరంలాంటి మట్టిని కట్టపై పోయించారు. కాని సరైన పద్ధతిలో పనులు చేపట్టక పోవడంతో ఇటీవల కురిసిన చిరుజల్లులకు కట్టపై పోసిన మట్టి కొట్టుకు పోయింది. కట్టనిర్మాణం చేపట్టే సమయంలో జేసీబీ ద్వారా సరైన స్టెప్పులు చేయక పోవడంతోనే కట్టపై మట్టి కిందకు జారిందని ఆయకట్టు రైతులతోపాటు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
కాగా ఈ కట్టపై నుంచేlగంగాపూర్ గిరిజన తండాకు రహదారి ఉంది. మట్టి కొట్టుకు పోవడంతో కనీసం కట్టపైనుంచి ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టకముందే కట్టపై నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు తిరిగేవని, నిర్మాణం చేపట్టాక కురిసిన వర్షానికి మట్టి కొట్టుకు పోయి అస్తవ్యస్తంగా మారిందంటున్నారు.
తప్పిన ప్రమాదం
గంగాపూర్ గిరిజన తండాకు ఈ కట్టపై నుంచే వెళ్తాం. గతంలో కట్టపై నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు తిరిగేవి. ఇటీవల మరమ్మతులు చేసిన తరువాత కురిసిన వర్షంతో మట్టి అంతా కొట్టుకు పోయి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కట్టపై నుంచి పొలాల్లోకి వెళ్తున్న ట్రాక్టర్ మట్టిలో కూరుకుపోయింది. అతికష్టం మీద ట్రాక్టర్‌ను పక్కకు తీశాం. లేనిచో పెద్ద ప్రమాదం జరిగేది.
–మూడవత్ గణేష్, గిరిజన తండా
కట్ట మళ్లీ నిర్మించాలి
శమ్నాపూర్ దేవుని చెరువు కట్టను నాణ్యతతో నిర్మించక పోవడం వల్ల మట్టి కొట్టుకు పోయింది. కట్టను మళ్లీ నిర్మించాలి. కట్టపై నుంచే తండాకు వెళ్లాలి.
–మూడవత్ శ్రీను, గిరిజన తండా
మళ్లీ కట్ట నిర్మిస్తాం
కట్టపై మట్టి పోసే సమయంలో స్టెప్పులు తవ్వించి నిర్మించాం. కాగా కట్ట బాగా ఎత్తులో ఉండటం వల్ల వర్షపునీటికి మట్టి కొట్టుకు పోయింది. కట్టను మళ్లీ నిర్మిస్తాం.
–ఇరిగేషన్ జేఈ శ్రీధర్