జల కట్టడికి మిషన్‌-2 | Telangana Government Plans To Construct 1200 Check Dams | Sakshi
Sakshi News home page

జల కట్టడికి మిషన్‌-2

Published Mon, May 6 2019 12:38 AM | Last Updated on Mon, May 6 2019 4:53 AM

Telangana Government Plans To Construct 1200 Check Dams - Sakshi

వీణవంక చెక్‌డ్యామ్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరివాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను చెరువులకు మళ్లించి వాటికి జలకళను సంతరించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ కాకతీయ తొలి విడత ప్రయోగం విజయవంతం కావడంతో ప్రభుత్వం రెండో విడత ‘మిషన్‌’ను ప్రారంభించింది. ఈ దఫాలో ప్రాజెక్టుల కాల్వల నుంచి, ఇతర వాగులు, వంకల నుంచి పారే నీటిని వృథాగా పోనివ్వకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసేలా చెక్‌డ్యామ్‌లు, కాల్వల నీళ్లు చెరువుల్లోకి మళ్లేలా తూముల నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రక్రియను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నీటిపారుదల శాఖ ప్రారంభించనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణానికి ఆయా జిల్లాల్లోనే సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనిపై ఇప్పటికే చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

8,350 చెరువులు, 1,200 చెక్‌డ్యామ్‌లు
తొలి విడత మిషన్‌ కాకతీయ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,531 చెరువుల్లో 27వేలకు పైగా చెరువులను పునరుద్ధరించారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, వాటికి అనుబంధంగా తూముల నిర్మాణం, వీలైనన్ని ఎక్కువ చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహకంలో చిన్న నీటి వనరుల కింద కేటాయించిన 265 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడంతోపాటే రాష్ట్ర పరివా హకంలో కురిసే వర్షపు ప్రతి నీటిబొట్టు ఎక్కడికక్కడే నిల్వచేసి నీటి లభ్యత పెంచాలని సూచనలు చేశారు. దీని ద్వారా గరిష్ట ఆయకట్టు పారేలా చూడాలని సూచించారు. దీనికి అనుగుణంగా చెక్‌డ్యామ్, తూముల నిర్మాణానికి రూ.4,200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా.. ముందుగా ప్రాజెక్టుల పరివాహకం పరిధిలోని 8,350 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ గుర్తించిన చెరువుల్లోకి నీటిని మళ్లించేలా 3వేల తూముల నిర్మాణం చేయనున్నారు. ఈ తూముల నిర్మాణానికి రూ.410 కోట్లు మేర ఖర్చు చేయనున్నారు. ఇక కృష్ణా పరివాహకంలో 400, గోదావరి పరివాహకంలో 800 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రాంతాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వీటికి రూ.3,790 కోట్లు ఖర్చు చేయనున్నారు. చెక్‌డ్యాంలకు కనిష్టంగా రూ.3కోట్ల నంచి గరిష్టంగా రూ.8కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణాలకు ఒక్కోదానికి ప్రభుత్వ పరంగా పరిపాలనా అనుమతులు ఇస్తే తీవ్ర జాప్యం జరిగే అవకాశాల దృష్ట్యా, నేరుగా ఆయా పరిధిలోని ఇంజనీర్లే సాంకేతిక అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం జిల్లా ఇంజనీర్లే వీటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలను పరిశీలించి అనుమతులిస్తారు. ఆవెంటనే టెండర్లు పిలుస్తారు. వారం రోజుల్లోనే టెండర్లు ముగించి పనులు ఆరంభిస్తారు. తూముల నిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని నిబంధన పెట్టగా, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 9 నెలల గడువు విధించారు. ఇప్పటికే అంచనాలు సిధ్దమైన చోట్ల జిల్లాల వారీగా సోమవారం నుంచి టెండర్ల ప్రక్రియ ఆరంభం కానుంది. టెండర్ల ప్రక్రియ ముగించి ఈ నెల 20 నుంచి అన్నిచోట్లా పనులు మొదలవ్వాలని ఇప్పటికే ఇంజనీర్లకు ఆదేశాలు వెళ్లాయి.

కాళేశ్వరం నీళ్లతోనే 3,011 చెరువులు
ఈ ఖరీఫ్‌లోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయనున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే ప్రాజెక్టు కాల్వలను చెరువులకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం కాల్వల పరిధిలో మొత్తంగా 3,011 చెరువులను గోదావరి నీటితో నింపేలా ప్రస్తుతానికి ప్రణాళిక వేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం కడెం కింద 62 చెరువులు, ఎస్సారెస్పీ సరస్వతి కెనాల్‌ కింద 38, సదర్‌మట్‌ బ్యారేజీ కింద 7, ఎస్సారెస్పీ స్టేజ్‌–1 కింద 396, స్టేజ్‌–2 కింద 182, దేవాదుల కింద 286, ఎస్సారెస్పీ కింద నేరుగా 1,200, ఎల్లంపల్లి కింద 124, మిడ్‌మానేరు పరిధిలో 12, వరద కాల్వల కింద 17, అప్పర్‌ మానేరు కింద 22, కాళేశ్వరం పరిధిలో ఇతర ప్యాకేజీల కింద 266, నిజాంసాగర్‌ కింద 399 చెరువులను నింపేలా ఇప్పటికే ప్రణాళిక సిధ్ధం చేశారు. ఈ చెరువుల్లో చేరే నీటి సామర్థ్యం సుమారుగా 37.37 టీఎంసీలుగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ చెరువుల కింద మొత్తంగా 2,89,038 ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుందని గుర్తించారు. ఈ చెరువులను నింపేలా ఎక్కడెక్కడ తూముల నిర్మాణం చేయాలన్నది ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పరిధిలో 278 చెరువులను నింపేందుకు కొత్తగా 201 తూముల నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. ఈ తూమల నిర్మాణానికి 7.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement