జేబులు నింపుకోవడానికే ‘మిషన్ కాకతీయ’
నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుకోవడానికేనని, ఇందులో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున మీడియా నిఘా పెట్టాలని ఎంపీల ఫోరం మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. చెరువుల పునరుద్ధరణ, పూడికతీతలు ఏళ్ల తరబడిగా సాగుతున్న ప్రక్రియేనని, దానికి మిషన్ కాకతీయ’ అన్ని కొత్తపేరు పెట్టి భారీగా దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణపై పాజిటివ్‌గా రాసే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ప్రోత్సాహకాలను ప్రకటించడం కన్నా.. అందులో తప్పులను ఆధారాలతో ఎత్తిచూపే వారికి ఇస్తే పారదర్శకంగా పనులు చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకే చెరువుల పునరుద్ధరణ పనుల్లో భారీ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున.. ఆ అక్రమాలను ఆధారాలతో సహా వాస్తవాలు ప్రతిబింబించేలా బయటపెట్టే మీడియా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ. లక్ష బహుమతిని అందజేయనున్నట్లు పొన్నం ప్రకటించారు. ఈ బహుమతి ఎంపిక కోసం సీనియర్ జర్నలిస్టులతో ఓ కమిటీని వేయనున్నట్లు ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ పనులు పారదర్శకంగా జరిగితే ఫరవాలేదని, అవకతవకలు జరిగే చోట మీడియా స్పందించాలని ఆయన కోరారు.